15వ ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులను ఏకపక్షంగా జెడ్పీటీసీల మద్దతు లేకపోయినా కొందరు కాంట్రాక్టర్లకు కేటాయించినట్లు ఆరోపణలున్నాయి. గతేడాది నవంబర్ 27న జరిగిన సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీలకు అజెండా కాపీ ఇవ్వకుండా సమావేశం నిర్వహించారు. దీనిపై 15 మంది కలెక్టర్ కే.వెట్రిసెల్వి, జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ శ్రీహరికి డీసెంట్ కాపీ రాతపూర్వకంగా ఇచ్చినా స్పందన లేదు. ఈ క్రమంలో 15 మంది జెడ్పీటీసీలు పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీపీకి, కలెక్టర్‌కు, ప్రిన్సిపల్ సెక్రటరీకి రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరితే 30 రోజుల్లో జెడ్పీ సీఈఓ ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఇవ్వకపోవడంపై ఫిర్యాదు చేశారు. జెడ్పీటీసీలు ఇచ్చిన డీసెంట్‌ను రికార్డుల్లో నమోదు చేయకుండా జెడ్పీ సీఈఓ జడ్పీటీసీలను అవమానిస్తున్నారని ఫిర్యాదు చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ భర్త తీరుపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టాండింగ్ కౌన్సిల్ సమావేశాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ భర్త ప్రత్యక్షంగా పాల్గొనడం, పనుల విషయంలోనూ, ప్రతిపాదనల విషయంలోనూ అన్నింటిలోనూ తీవ్ర స్థాయిలో జోక్యం చేసుకుంటూ అధికారులను, జెడ్పీటీసీలను ఇబ్బందులు పెడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు కర్రి గౌరి సుభాషిణి, గుంటూరు పెద్దిరాజుతో సహా 15 మంది సభ్యులు ఫిర్యాదు చేశారు.


