● ఏలూరు జీజీహెచ్‌లో మరో దారుణం
● ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన
● వైద్య బృందంపై మంత్రి సీరియస్
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలో పురిటిలోనే ఓ పసికందు ప్రాణం విడిచింది. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి బిడ్డ ప్రాణాన్ని బలి తీసుకున్నారని బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పెదవేగి మండలం నడిపల్లికి చెందిన నాగలక్ష్మి, ముసునూరు మండలం గోపవరంనకు చెందిన శ్రీనివాసరావు దంపతులు. నాగలక్ష్మి గర్భిణి కాగా ఏలూరు జీజీహెచ్‌లోని ఎంసీహెచ్ బ్లాక్‌లో గైనకాలజీ వైద్యులకు చూపిస్తున్నారు. ఆమెను కాన్పు కోసం ఈనెల 7న జీజీహెచ్‌కు తీసుకురాగా రెండు రోజుల అనంతరం తీసుకు రావాలని వైద్యులు సూచించారు. దీంతో మంగళవారం రాత్రి 8 గంటలకు ఎంసీహెచ్‌లో చేర్పించారు. రాత్రి వేళ నాగలక్ష్మికి తీవ్రమైన నొప్పులు రావటంతో బంధువులు వెళ్లి వైద్య సిబ్బందికి చెప్పగా వారు నిర్లక్ష్యం చేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో నొప్పులు మరింత ఎక్కువైనా ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 8 గంటలకు ఆపరేషన్ చేయగా నాగలక్ష్మి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కొద్దిసేపటికే పసికందు చనిపోయిందని చెప్పటంతో వారంతా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో వైద్యులు ఆపరేషన్ చేసి ఉంటే బిడ్డ చనిపోయేది కాదంటూ బాధిత బంధువులు జీజీహెచ్ వద్ద ఆందోళకు దిగారు. ఇలాంటి పరిస్థితి ఇతర కుటుంబాలకు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ విషయంపై మంత్రి కొలుసు పార్థసారథి సీరియస్ అయ్యారు.ఎంసీహెచ్ విభాగంలో తరచుగా ఇదే తరహా ఘటనలు చోటుచేసుకోవటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏలూరు జీజీహెచ్ ఆర్‌ఎంఓను ఫోన్‌లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు.


