ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో బుధవారం దేవాదాయశాఖ జిల్లా అధికారి కె.శ్రీనివాసు పర్యవేక్షణలో జరిగింది. 20 రోజులకు గాను నగదు రూపేణా స్వామికి రూ. 1,95,82,968 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 327 గ్రాముల 700 మిల్లీ గ్రాముల బంగారం, 2.714 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని పాత రూ.2,000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.7 వేలు లభించినట్టు చెప్పారు.
ఏలూరు (టూటౌన్): దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని, క్రైస్తవులపై దాడులను అరికట్టి రక్షణ కల్పించాలని, మత మార్పిడి నిరోధక చట్టాలను ఎత్తివేయాలని క్రిస్టియన్ కో–ఆర్డినేషన్ కౌన్సిల్ రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ ఎన్‌ఏడి పాల్ కోరారు. స్థానిక ఎన్‌ఆర్‌పేటలోని ఎస్సీఆర్‌పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ మెండెం సంతోష్‌కుమార్ అధ్యక్షతన బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పాల్ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో క్రిస్టియన్ కో–ఆర్డినేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం అందజేస్తామన్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌లను ఆవిష్కరించారు.


