మట్టి మాఫియా కోరల్లో గుట్టలు
ఊళ్ల మీదకు వన్యప్రాణులు
వనసంరక్షణ భూములపై మాఫియా కన్ను
● పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు !
● నిమ్మకు నీరెత్తిన ట్టు వ్యవహరిస్తున్న అధికారులు
● ఆవాసాలు కోల్పోతున్న వన్యప్రాణులు
చింతలపూడి: ఒకప్పుడు పచ్చని చెట్లతో, గుట్టలతో కళకళలాడిన ప్రాంతాలు నేడు కనుమరుగవుతున్నాయి. ప్రకృతి ప్రసాదించిన సంపదను మట్టి మాఫియా యథేచ్ఛగా దోచుకుంటోంది. గ్రామాల సమీపంలోని కొండలు, గట్లు కనుమరుగవుతుంటే, పర్యవేక్షించా ల్సిన అధికార యంత్రాంగం మాత్రం గాడ నిద్రలో మునిగిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జీవ వైవిధ్యానికి గొడ్డలి పెట్టు
గ్రామాలకు ఆనుకుని ఉండే కొండలు, గట్లు కేవలం రాళ్ల కుప్పలు మాత్రమే కావు. అవి ఔషధ మొక్కలకు, అనేక వన్యప్రాణులకు, పక్షులకు, క్రిమి కీటకాలకు సురక్షితమైన ఆవాసాలు. జింకలు, దుప్పులు, కోతులు, కొండ ముచ్చులు, కుందేళ్లు, నెమళ్లు, నక్కలు, అడవి పందులు వంటి జీవులకు ఇవి నిలయాలు. నేడు జేసీబీల సవ్వడితో ఆ మూగజీవాలు భయంతో గ్రామాలపైకి వస్తున్నాయి. ఫలితంగా మనుషులపై దాడులు పెరగడమే కాకుండా, వన్యప్రాణులు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న సంఘటనలు ఉన్నాయి.
కాసుల కక్కుర్తి : నిర్మాణ రంగంలో మట్టికి, గ్రావెల్‌కు ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని మాఫియా రెచ్చిపోతోంది. అనుమతులు ఉన్నవి కొద్దిపాటికే అయినా, వందల అడుగుల లోతుకు తవ్వేస్తూ కొండల రూపురేఖలను మార్చేస్తున్నారు. పగలు, రాత్రీ తేడా లేకుండా టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. ఈ క్రమంలో సహజసిద్ధమైన నీటి ప్రవాహ మార్గాలు (వాగులు, వంకలు) పూడిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు వాపోతున్నారు.
నిద్రావస్థలో అధికార యంత్రాంగం
ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్, అటవీ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదులు చేసినప్పుడు మాత్రమే నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో నిఘా లోపించడంతో మాఫియాకు అడ్డులేకుండా పోయింది. రాజకీయ అండదండలతోనే ఈ దోపిడీ సాగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రమాదంలో పర్యావరణ సమతుల్యత
కొండలు కనుమరుగైతే వర్షపు నీరు నిల్వ ఉండక భూగర్భ జలాలు తగ్గిపోతాయి. వన్యప్రాణులు సహజ సిద్ధమైన ఆవాసాలు కోల్పోయి జీవవైవిధ్యం దెబ్బతింటుంది. నిరంతర తవ్వకాలు, వాహనాల రద్దీతో గ్రామాలపై దుమ్ము పడి ప్రజలు శ్వాసకోస వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమ తవ్వకాలను అరికట్టి, మన పూర్వీకులు అందించిన ప్రకృతి సంపదను, వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
మా చిన్నప్పుడు ఈ కొండల మీద ఎన్నో చెట్లు, జంతువులు ఉండేవి. ఇప్పుడు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. కొండలను తవ్వేస్తుండటంతో నెమళ్లు, అడవి పందులు, కోతులు ఊళ్లలోకి వస్తున్నాయి. రాత్రికి రాత్రే గుట్టలను పిండి చేసి తరలిస్తున్నారు.
– మాగసాని గురుబ్రహ్మం, వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు
ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి వన సంరక్షణ కోసం భూములను కేటాయిస్తోంది. మొక్కలు నాటి అడవులను పెంచాలని చూస్తుంటే, మట్టి మాఫియా మాత్రం ఆ భూములపై కన్నేసింది. చెట్లను వేళ్లతో సహా పెకిలించి, అడుగున ఉన్న మట్టిని, గ్రావెల్‌ను తవ్వేస్తున్నారు. వన సంరక్షణ భూముల్లో నుంచి మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి.
– తొర్లపాటి బాబు, సీపీఐ మండల కార్యదర్శి, చింతలపూడి
మట్టి మాఫియా కోరల్లో గుట్టలు
మట్టి మాఫియా కోరల్లో గుట్టలు
మట్టి మాఫియా కోరల్లో గుట్టలు


