హామీలపై ప్రశ్నిస్తే కేసులు
ఏలూరు (టూటౌన్): ఎన్నికల హామీల అమలును ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన విభాగాల నాయకులపై, వివిధ ప్రజాసంఘాల కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమంగా బనాయిస్తున్న కేసులకు నిరసనగా శుక్రవారం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్‌లో పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీవైఎల్, వైఎస్సార్సీపీ యువజన విభాగం, విధ్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని, నెలకు రూ.3 వేల చొప్పున అందజేస్తామని చంద్రబాబు సర్కార్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నిస్తున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రశ్నించిన గొంతుకలను అణగదొక్కాలని చూడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షులు కామిరెడ్డి నాని, వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షులు తేరా ఆనంద్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాజేష్, యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.


