సంక్షేమానికి గ్రహణం
కామవరపుకోట: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి గ్రహణం పట్టిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంభం విజయరాజు అధ్యక్షతన, మండల పార్టీ అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో వీరిశెట్టిగూడెం సర్పంచ్ దేవరపల్లి రామ్మోహన్‌రావు నాయకత్వంలో శుక్రవారం మండల పార్టీ నిర్మాణ సంస్థగత సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతంపై నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమని నేడు పార్టీ కోసం కష్టపడిన వారికే భవిష్యత్తులో తగిన గుర్తింపుతో పాటు గౌరవం లభిస్తుందని తెలిపారు. పార్లమెంట్ పరిశీలకుడు వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ మోసాల ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత సంక్షేమానికి చెదలు పట్టిందని, పాలన చేపట్టి రెండేళ్లు గడుస్తున్న ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు. పార్లమెంట్ కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ పాలనలో సంక్షేమ కాంతులు చెరిగిపోయాయని, సూపర్ సిక్స్ పథకాలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రెండేళ్లు గడుస్తున్నా హామీలు అమలు చేయకపోవడంపై ప్రజలు విస్మయం చెందుతున్నారని అన్నారు. కంభం విజయరాజు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ పాలనతో ప్రజలు ఇప్పటికే విసుగు చెందారని, గ్రామాల్లో ఎక్కడికి వెళ్లిన చంద్రబాబు ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత కనిపిస్తుందన్నారు. అనంతరం జలపవారి గూడెం గ్రామానికి చెందిన కరుటూరి బాలస్వామి, కరటూరి శ్రావణ్ కుమార్, మిధున్ చక్రవర్తి, బంటుమిల్లి రవికుమార్ టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరారు. జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ళ సతీష్ చౌదరి, జిల్లా కార్యదర్శి జయమంగళ కాసులు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గురజాల పార్థసారధి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి సరిత రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని, అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలు సాయిల స్వాతి యాదవ్, కామవరపుకోట వైస్ ఎంపీపీ గిరిజ, నియోజకవర్గ ప్రచార విభాగం అధ్యక్షుడు మేరిగ బాబురావు తదితరులు పాల్గొన్నారు.


