వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ప్రెసిడెంట్‌గా అనురాధ
అల్లవరం/ఏలూరు టౌన్ : అమలాపురం మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యురాలు చింతా అనురాధ ఆ పార్టీ మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అనురాధ ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనపై విశ్వాసంతో ఈ బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటానని తెలిపారు. 2029లో వైఎస్సార్ సీపీ అధికారమే లక్ష్యంగా మహిళా శక్తిని సమీకరించి, పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తామని చెప్పారు. ఈ నియామకం తన బాధ్యతలను మరింత పెంచిందని, పార్టీ బలోపేతానికి అహర్నిశలూ కృషి చేస్తానని అనురాధ తెలిపారు. పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏలూరు (టూటౌన్): పంచాయతీల్లో ఎస్సీ సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు ఎస్సీ సర్పంచ్‌లు శుక్రవారం ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహార్‌కు ఫిర్యాదు చేశారు. దెందులూరు మండలం కండ్రిగ నరసింహపురంలో పంచాయతీ నిధులతో కమ్యూనిటీ హాలు నిర్మించి శ్లాబ్ లెవల్‌కు తీసుకొచ్చామని, గత 18 నెలల నుంచి పని పూర్తి కానివ్వకుండా పంచాయతీ కార్యదర్శి, ఏఈ, డీఈలు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సర్పంచ్ మెండెం సంతోష్ కుమార్ ఫిర్యాదు చేశారు. దెందులూరు మండలం పోతునూరు సర్పంచ్ బోదుల స్వరూప్, గాలాయగూడెం సర్పంచ్ చిలకా సుబ్బారావు కూడా ఫిర్యాదు చేశారు.


