ఆశల పూత
● మామిడి తోటల్లో మొదలైన పూత
● గతేడాది నష్టాలపాలైనా ఆదుకోని
చంద్రబాబు ప్రభుత్వం
● ఈ సీజన్‌పై రైతుల గంపెడాశలు
నూజివీడు: జిల్లాలో మామిడి రైతులు సాగుపై కోటి ఆశలతో ఉన్నారు. కొందరు పూతల కోసం, మరికొందరు వచ్చిన పూతలు నిలవడం కోసం రసాయన మందులను మామిడి తోటల్లో పిచికారీ చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని మండలాల్లోని తోటల్లో పచ్చిపూత, మొగ్గదశ కనిపిస్తుండగా, మ రికొన్ని ప్రాంతాల్లో తెల్లపూత కనిపిస్తోంది. సాధారణంగా వర్షాలకు అక్టోబర్‌లో తోటలలో ఇగురు వచ్చి డిసెంబరు మొదటి నుంచి పూతలు కనిపి స్తాయి. ఇదే పరిస్థితి మామిడి తోటల్లో ఉండటంతో రైతులు ఆశాభావంతో ఉన్నారు.
సుమారు 40 వేల ఎకరాల్లో..
ఏలూరు జిల్లాలో నూజివీడు రెవిన్యూ డివిజన్ పరిధిలోనే మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో కలిపి దాదాపు 38 వేల ఎకరాల్లో, చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం మండలాల్లో 2 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. తో టల నుంచి ఏటా 1.40 లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తుందని అంచనా. మొత్తం విస్తీర్ణంలో 50 శాతం బంగినపల్లి, 30 శాతం తోతాపురి, మిగిలిన 20 శాతం చిన్నరసాలు, ఇతర రకాలు ఉన్నాయి. మామిడి తోటలు డిసెంబరు మొదటి వారం నుంచి జనవరి నెలాఖరు వరకు పూతలు పూస్తాయి. ఫిబ్రవరి ద్వితీయార్థం నుంచి ముదురు పూత వచ్చిన తోటల్లో కాయలు కోతకు వస్తాయి. మే నెలాఖరు వరకు మామిడి కాయల కాపు వస్తుంది. మామిడి తోటలను రైతులు కొందరు కాపు వరకు వ్యాపారులకు విక్రయించడం, మరికొందరు తామే కాయలు కోసం మార్కెట్‌కు తరలించి విక్రయించుకోవడం చేస్తూ ఉంటారు.
గతేడాదిలో పీకల్లోతు నష్టాలు
గతేడాది మామిడికి గిట్టుబాటు ధర లేక రైతులు పీకల్లోతు నష్టపోయినా ప్రభుత్వానికి ఏ మాత్రం కనికరించలేదు. రైతులను ఆదుకునే చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తూ ఉండిపోయింది. తోతాపురి రకం కాయలకు అయితే టన్ను ధర రూ.3 వేలకు పడిపోవడంతో కోత ఖర్చు రావడం లేదని రైతులు కాయలను కోయకుండా మామిడి చెట్లకే వదిలేశారు. అంత దారుణమైన పరిస్థితులను రైతులు చవిచూశారు.


