కొల్లేరుకు అతిథులొచ్చారు!
పక్షులకు ఎల్లలుండవు
పక్షులను ప్రేమించాలి
కై కలూరు: శీతాకాలపు విడిది పక్షుల కిలకిలారావాలతో కొల్లేరు కళకళలాడుతోంది. లక్షల కిలోమీటర్ల దూరం నుంచి తన రెక్కల చప్పుళ్లతో కొల్లేరుకు విదేశీ అతిథి పక్షులు వచ్చేశాయ్. ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొల్లేరు పక్షుల వీక్షణకు అనువైన కాలం. ఈ ఏడాది ఎక్కువ మంది పర్యాటకులు కొల్లేరుకు విచ్చేస్తారని అటవీ శాఖ అంచనా వేస్తోంది. సర్వేల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 482 పక్షి జాతులు ఉన్నాయి. సింహభాగం 210 పక్షి జాతులు కొల్లేరులో సంచరిస్తాయి. కొల్లేరు ప్రాంతానికి రష్యా, బ్రిటన్, సైబీరియా, బంగ్లాదేశ్, నైజీరియా, ఆస్ట్రేలియా, శ్రీలంక తదితర 29 దేశాల నుంచి 71 జాతులకు చెందిన వలస జాతి పక్షులు 1.20 లక్షలు వస్తాయని అంచనా. ప్రపంచంలో పక్షి జాతులు 11,145 ఉండగా, భారతదేశంలో 1,378 ఉన్నాయి. భారతదేశ పక్షి జాతుల వాటా 12.3 శాతంగా ఉంది. కొల్లేరులో స్వదేశీ, విదేశీ అన్ని పక్షులూ కలిపి 4 లక్షల వరకు శీతాకాలంలో విహరిస్తాయి.
పక్షుల అత్తారిల్లు కొల్లేరు
రెండు తెలుగు రాష్ట్రాల్లో రామ్‌సార్ సదస్సు గుర్తించిన ఏకై క చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు. దీని విస్తీర్ణం 2,22,300 ఎకరాలు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించింది. కొల్లేరు 5వ కాంటూరు వరకు 77,135 ఎకరాలను కొల్లేరు అభయారణ్యంగా గుర్తించారు. ఇరు జిల్లాల్లో ఆటపాక, మాధవాపురం పక్షుల విహార కేంద్రాలు ప్రసిద్ధమైనవి. ఏటా శీతాకాలంలో విదేశీ పక్షులు ఇక్కడ గూళ్లు కట్టుకుని సంతానోత్పత్తితో మార్చి మొదటి వారంలో పుట్టింటికి వెళతాయి. కై కలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రంలో పెలికాన్ పక్షులు అధికంగా రావడంతో దీనికి పెలికాన్ ప్యారడైజ్‌గా నామకరణ చేశారు.
బార్ టెయిల్డ్ గాడ్విట్
నిర్విరామంగా అత్యధిక దూరం ప్రయాణించే పక్షి బార్ టెయిల్డ్ గాడ్విట్. ఈ పక్షి ఎక్కడా ఆగకుండా 11 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇవి కొల్లేరు అభయారణ్య ప్రాంతానికి ఏటా వస్తాయి.
ఆర్కిటిక్ టర్న్
అత్యధిక దూరం వలస పోయే పక్షి ఆర్కిటిక్ టర్న్. ఏకంగా 12,200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఎనిమిదిన్నర రోజుల్లోనే చేరుకుంటుంది. అలస్కా నుంచి న్యూజిలాండ్‌కు వలస వెళ్తుంది.
బార్ హెడెడ్ గీస్
ఎక్కువ ఎత్తున ఎగిరే వలస పక్షి బాతు జాతికి చెందిన బార్ హెడెడ్ గీస్. ఇది సముద్రమట్టానికి దాదాపు 8.8 కిలోమీటర్ల ఎత్తున ఎగురుతుంది. ఈ జాతికి చెందిన పక్షులు హిమాలయాల నుంచి ప్రయాణించి, భారత భూభాగంలోని చిలుకా, పులికాట్ తదితర సరస్సులకు వస్తాయి.
గ్రేట్ స్నైప్
అత్యధిక వేగంతో ప్రయాణించే వలస పక్షి గ్రేట్ స్నైప్, ఈ పక్షి గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో దాదాపు 6,500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీనిని పరికరాలతో వీక్షించడం కూడా కష్టం.
ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పిట్టలకు ఎల్లలుండవు. శీతాకాలంలో హిమాలయాలకు దూరంగా నార్తరన్ దేశాలు మంచుతో ఉంటాయి. దీంతో ఆహారం కోసం పక్షులు వలస వస్తాయి. చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు వీటికి అనువైన ప్రాంతం. ఈ ప్రాంతంలో కాలుష్యం కారణంగా వలస పక్షులు తగ్గుతున్నాయి. చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యతగా ఉండాలి.
– శ్రీరామ్‌రెడ్డి, తెలుగు రాష్ట్రాల ఈ–బర్డ్ సమీక్షకుడు, హైదరాబాదు
పక్షులను నేస్తాలుగా భావించి ఆదరించాలి. కొల్లేరు వాతావరణం అనుకూలంగా ఉండటంతో పక్షులు వలస వస్తున్నాయి. అటవీ శాఖ పక్షుల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ చివరన ఏషియన్ వాటర్ బర్డ్స్ సెన్సస్(ఏడబ్ల్యూసీ) చేయాలని భావిస్తున్నాం. ఏలూరు జిల్లాలో ఆటపాక, మాధవాపురంలో పక్షుల విహార కేంద్రాలను అభివృద్ధి చేశాం. కొల్లేరు పక్షుల వీక్షణకు ఇదే అనువైన సమయం.
– బి.విజయ, జిల్లా అటవీశాఖ అధికారి, ఏలూరు
శీతాకాలంలో విడిది పక్షుల సందడి
ఏటా 71 జాతులకు చెందిన 1.20 లక్షల విదేశీ వలస పక్షులు
అక్టోబరు నుంచి మార్చి చివరి వరకు కనువిందు
స్థానికంగా 210 రకాల పక్షి జాతులు ఉన్నట్టు గుర్తింపు
కొల్లేరుకు అతిథులొచ్చారు!
కొల్లేరుకు అతిథులొచ్చారు!
కొల్లేరుకు అతిథులొచ్చారు!


