అన్నదాతకు తుపాను గండం
ఏలూరు (మెట్రో): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభు త్వం ఓ వైపు, ప్రకృతి మరోవైపు అన్నదాతలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పంట చేతికందే సమయంలో మోంథా తుపాను విరుచుకుపడగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిగిలిన అరకొర దిగుబడులనైనా ఒబ్బిడి చేసుకుందామనే సమయంలో మరోమారు తుపాను హెచ్చరికలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారుతుందంటూ వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. దీంతో జిల్లావ్యాప్తంగా వరి మాసూళ్లు ముమ్మరం చేశారు.
నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు
ఇటీవల మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో 11,613 మంది రైతులు నష్టాలను చవిచూశారు. 859.21 హెక్టార్లలో మినుములు, 4,807.37 హెక్టార్లలో వరి, 33.11 హెక్టార్లలో పత్తి ఇలా మొత్తంగా 5,704 హెక్టార్లలో పంటలను కోల్పోయారు. అనంతరం పంటను ఒబ్బిడి చేసుకుని ధాన్యం విక్రయించుకునే సమయంలో తుపాను ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో 4 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతులు కోతలు కోసి ధాన్యాన్ని రోడ్లపై, ఖాళీ ప్రదేశాల్లో ఆరబెడుతు న్నారు. ఇప్పటివరకూ 40 వేల టన్నుల ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే ధాన్యం కొనుగోలు నెమ్మదిగా సాగుతుండటంతో రైతుల్లో ఆందోళన తీవ్రమవుతోంది.
ఏమాత్రం ఆదుకోని సర్కారు : జిల్లాలో ఏటా విపత్తులు చుట్టుముడుతున్నా రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు సర్కారు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాల సమయంలో ధాన్యాన్ని కాపాడుకునేందుకు కనీసం టార్పాలిన్లు కూడా ఇవ్వడం లేదు. జిల్లావ్యాప్తంగా 89,983 హెక్టార్లలో వరి సాగు చేయగా 5.73 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుందని వ్యవసాయ శాఖ ముందస్తు అంచనాలు రూపొందించినా ప్రకృతి విపత్తుల నుంచి ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రానున్న రెండు, మూడు రోజులు ధాన్యాన్ని జాగ్రత్తగా భద్రపరుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే మరోమారు తీవ్ర నష్టం తప్పదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
వాతావరణ హెచ్చరికలతో ఆందోళన
ముమ్మరంగా ఖరీఫ్ మాసూళ్లు
రహదారులు, ఖాళీ ప్రదేశాల్లో ధాన్యం ఆరబోత
జిల్లాలో 89 వేల హెక్టార్లలో వరి సాగు


