నల్ల బంగారం.. తవ్వకాలకు సిద్ధం
● రేచర్ల బొగ్గు బ్లాక్‌కు ముగిసిన టెండర్లు
● నేటి నుంచి ఈ–ఆక్షన్ కేటాయింపు
● 2,225 మిలియన్ టన్నుల నిల్వలు
● ఆంధ్రా సింగరేణిగా ‘చింతలపూడి’
సాక్షి ప్రతినిధి, ఏలూరు: చింతలపూడి బొగ్గు తవ్వకాల వ్యవహారం తుది దశకు చేరుకుంది. బొగ్గు నిల్వల ఖరారు, బ్లాక్‌ల వారీగా గుర్తింపు ఇలా ఏళ్ల తరబడి సాగిన ప్రయత్నాలు పూర్తయి మొట్టమొదటిగా రేచర్ల బ్లాక్‌ను నిర్ధారించి టెండర్లు ఆహ్వానించి తుది దశకు తీసుకువచ్చారు. సోమవారం నుంచి ఈనెల 28లోపు ఈ–వేలం ద్వారా రేచర్ల బ్లాక్‌ను ఖరారు చేయనున్నారు. 2,225.63 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్న ఈ బ్లాక్‌ను వేలం ద్వారా అప్పగించనున్నారు. 1964 నుంచి 2004 వరకు కేంద్ర ప్రభుత్వం నా లుగు సర్వేలు నిర్వహించింది. 2006 నుంచి 2016 వరకు సర్వే ప్రక్రియ వేగంగా పూర్తిచేసి తుది దశకు తీసుకువచ్చారు. చింతలపూడి, టి.నర్సాపురం, జంగారెడ్డిగూడెం మండలా ల్లోని కొన్ని గ్రామాల్లో గ్రేడ్–1 నిల్వలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియోబోటానీ అనే సంస్థలు గుర్తించి కేంద్రానికి నివేదిక అందజేశారు. ఇప్పటికే రెండు సార్లు టెండర్లు పిలవగా ఎవరూ ముందుకు రాకపోకవడంతో నిలిచిపోయాయి. మూడోసారి ఈ ఏడాది సె ప్టెంబర్‌లో దరఖాస్తులు ఆహ్వానించి అదేనెల 15న ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం అక్టోబర్ 27 వరకు దరఖాస్తు స్వీకరణకు తుది గడువుగా నిర్ణయించి 28న టెక్నికల్ బిడ్‌లను తెరిచారు.
22.24 చ.కిలోమీటర్ల పరిధిలో.. రేచర్ల గ్రామాన్ని కేంద్రంగా తీసుకుని ఎర్రగుంటపల్లి, సీతానగరం, మేడిశెట్టివారిపాలెం, లింగగూడెం, రాఘవాపురం తదితర గ్రామాల పరిధిలోని 22.24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రేచర్ల బొగ్గు బ్లాక్‌ను ఖరారు చేశారు. 623 మీటర్లలోతు నుంచి గరిష్టంగా 1,123 మీటర్ల లోతులో జీ–13 గ్రేడ్ బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. 2,225.63 మిలియన్ టన్నుల నిల్వలు ఈ బ్లాక్ పరిధిలో ఉన్నట్టు గుర్తించారు. వచ్చే వారంలో టెండర్ ఖరారైతే 2026 మార్చి నాటికి పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
నల్ల బంగారం.. తవ్వకాలకు సిద్ధం


