హౌసింగ్‌లో ఇంటి దొంగలు
జిల్లాలో నాలుగు చోట్ల గృహ నిర్మాణ సామగ్రి చోరీ
టన్నుల కొద్దీ ఐరన్, వందల సిమెంట్ బస్తాలు మాయం
పోలీసులకు ఫిర్యాదు చేసినా నమోదు కాని కేసులు
రాజకీయ ఒత్తిళ్లతో పట్టించుకోని జిల్లా యంత్రాంగం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా గృహ నిర్మాణ శాఖలో దొంగలు పడ్డారు. నిరుపేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అందించే హౌసింగ్ సామగ్రి చోరీకి గురైంది. టన్నుల కొద్దీ ఐరన్, వందల సిమెంట్ బస్తాలు మాయమయ్యాయని గృహనిర్మాణ శాఖ అధికారులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఇంటి దొంగలే పనేనని అనుమానం వ్యక్తమవుతుండగా మరికొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్లతో అధికార యంత్రాంగం మౌనం వహించింది. మొత్తంగా జిల్లాలోని దెందులూరు, పెదవేగి, ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో చోటు చేసుకున్న ఈ చోరీ ఘటనలు తీవ్ర సంచలనంగా మారాయి. ఇక్కడ మరో విశేషమేమిటంటే గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నియోజకవర్గంలోనూ చోరీ ఘటనలు జరగడం గమనార్హం.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో జిల్లాలో పేదల ఇళ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఐదేళ్ళ పాలనలో 1,16,431 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో రూ.713.17 కోట్లతో 98,874 ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత పేదలందరికీ ఇళ్లు పథకం పేరు మార్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి సబ్సిడీతో కూడిన రుణం ఇచ్చేవారు.
ప్రతి ఇంటికి 500 కేజీల ఐరన్, 90 బస్తాల సిమెంట్, డోర్లు, ఎలక్ట్రికల్ సామగ్రి ఇలా రూ.1.80 లక్షలు ఖరీదు చేసే మెటీరియల్‌ను పూర్తి సబ్సిడీతో అందించేవారు. దీంతో ఇళ్ళ నిర్మాణ పురోగతి వేగంగా ఉండేది. కొత్త ప్రభుత్వం జిల్లాలో ఈ ఏడాది 49,381 గృహాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 33,522 అర్బన్, 15,859 గ్రామీణ ప్రాంతాల్లో గతంలో మంజూరైన ఇళ్ళనే గుర్తించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోగా ఇంతవరకు 25,729 ఇళ్ల పనులు ప్రారంభమైనట్లు అధికారులు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి విరుద్ధంగా ఉంది
రూ.కోటికిపైగా సొత్తు మాయం
ప్రతి మండలంలో గృహనిర్మాణ శాఖ ఏఈ పర్యవేక్షణలో గొడౌన్ ఏర్పాటు చేశారు. సిమెంట్, ఐరన్, ఎలక్ట్రిల్ సామాన్లు, ఇతర నిర్మాణ సామగ్రి అంతా గొడౌన్లలో ఉంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మార్చి నుంచి ఇంతవరకు దెందులూరు మండలంలో 16 టన్నుల స్టీల్, పెదవేగి మండలంలో 16 టన్నుల స్టీల్, 300 సిమెంట్ బస్తాలు, ఆగిరిపల్లిలో 42 టన్నుల స్టీల్, 500 సిమెంట్ బస్తాలు, నూజివీడులో 600 ఇళ్ల విద్యుత్ మీటర్లు, ఇతర మెటీరియల్ చోరీకి గురైంది. వీటిపై సంబంధిత అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదు చేసి.. హౌసింగ్ పీడీకి నివేదిక పంపారు.
స్థానిక అధికార పార్టీ ఒత్తిళ్లతో వ్యవహారం ముందుకు సాగడం లేదు. మరోవైపు కొందరు స్థానిక అధికారులు 70 శాతం ధరకు బయట మార్కెట్‌లో విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఈ తరహా చోరీలు జరిగి ఉండొచ్చనే వాదన వినిపిస్తుంది. స్థానికంగా పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు విచారణను పూర్తిగా పక్కనపెట్టారు. టన్ను ఐరన్ ధర రూ. 60 వేల నుంచి 65 వేలు, సిమెంట్ బస్తా ధర రూ.350గా ఉంది. ఈ క్రమంలో రూ.48.10 లక్షల ఐరన్, రూ. 2.80 లక్షల సిమెంట్, రూ.42 లక్షల ఎలక్ట్రికల్ సామగ్రి చోరీకి గురైనట్లు నిర్ధారించారు.
దర్యాప్తు చేస్తున్నాం
చోరీ ఘటనలు మా దృష్టికి వచ్చాయి. దీనిపై శాఖపర విచారణ నిర్వహిస్తున్నాం. పూర్తి నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించి బాధ్యులపై చర్యలతో పాటు కేసు నమోదు చేస్తాం.
– జీ.సత్యనారాయణ, హౌసింగ్ పీడీ


