గొంతెత్తితే.. అణిచేస్తాం!
● 108 ఉద్యోగులపై వేధింపులు
● సమ్మె నోటీసు ఇచ్చిన యూనియన్ నేతలు
ఏలూరు టౌన్: అపర సంజీవనిలా ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచిన 108 అత్యవసర సేవల అంబులెన్స్‌లు ఒకవైపు రోడ్లపై పరుగులెత్తలేక నీరసించిపోగా...మరోవైపు 108 అత్యవసర సేవల ఉద్యోగుల కష్టాలు వర్ణణాతీతం. తమకు జరుగుతోన్న అన్యాయాన్ని ధైర్యంగా బాహాటంగా గొంతు ఎత్తలేని దైన్యస్థితిలో ఉన్నారు. మాకు న్యాయం చేయమని అడిగితే.. రేపటి నుంచి ఉద్యోగం లేనట్లేనని చెబుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు నిర్వహణ సంస్థ చెప్పిందే వేదంగా మారిందని, ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తోన్న సీనియర్ సిబ్బందిని సైతం విధులకు హాజరుకావద్దంటూ చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది. గొంతెత్తితే అణచివేస్తామనే ధోరణిలో 108 అత్యవసర సేవల నిర్వహణ సంస్థ వ్యవహరిస్తోందని సిబ్బంది బావురుమంటున్నారు.
సిబ్బందిపై వేధింపులు?
ఏలూరు జిల్లాలో 28 అత్యవసర సేవల అంబులెన్స్‌లు ఉన్నాయి. టీడీపీ సర్కారు పాలనలో 108 సేవల నిర్వహణ బాధ్యతలను గత 7 నెలలుగా భవ్య హెల్త్ సర్వీసెస్ సంస్థకు అప్పగించారు. సదరు సంస్థ పాలకులకు సంబంధించి సన్నిహిత వర్గానికి చెందటంతో ... ప్రశ్నించే వారు ఉండకూడదనే రీతిలో సిబ్బందిని అణచివేసే ధోరణి అవలంభించడం విమర్శలకు తావిస్తోంది. గతానికి భిన్నంగా 108 సిబ్బంది యూనియన్‌ను సైతం భయపెట్టేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కనీసం తమ బాధను చెప్పుకునే స్వేచ్చ లేకపోవటంపై సిబ్బంది మానసికంగా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. జీతాలు, సమస్యల పరిష్కారంపై కొందరు సిబ్బంది గట్టిగా నిలదీయంతో లేని కారణాలు సాకుగా చూపుతూ విధుల నుంచి తొలగిస్తూ పొట్టకొడుతున్నారని అంటున్నారు.
అసలు జీతాల్లోనూ కోతలే
ఏలూరు జిల్లాలో 108 అంబులెన్స్ సేవల్లో మెడికల్ టెక్నీషియన్లు, పైలట్లు (డ్రైవర్స్) సుమారుగా 140 మంది వరకూ విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. 108 అత్యవసర సేవల్లో గతం నుంచి వస్తోన్న విధానాలను అవలంభించకుండా కొత్త సంస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. 10 ఏళ్ళుగా మెడికల్ టెక్నిషియన్లుగా పనిచేస్తున్న వారికి నెలవారీ జీతం రూ.30 వేల వరకూ ఉంటుంది. డ్రైవర్ (పైలట్)కు జీతం రూ.28 వేలు చెల్లిస్తారు. 5 ఏళ్ళ పైబడిన టెక్నీషియన్లకు జీతం రూ.25 వేలు, డ్రైవర్‌కు రూ.23 వేలు. కొత్తగా చేరితే రూ.20 వేలు, డ్రైవర్‌కు రూ.18 వేల వరకూ నిర్వహణ సంస్థ చెల్లిస్తుంది. కొంత కాలం క్రితం 108 ఉద్యోగులు రాష్ట్ర స్థాయి యూనియన్ ఆధ్వర్యంలో పోరాటం చేసేందుకు సిద్ధంపడగా ... సీఎం చంద్రబాబు సిబ్బందికి రూ.4 వేలు చెల్లించేలా జీవో ఎంఎస్ నెంబర్ 49ను విడుదల చేశారు. కొత్త నిర్వహణ సంస్థ బాధ్యతలు స్వీకరించి 7 నెలలు కావస్తున్నా నేటికీ అమలుకు నోచుకోలేదని సిబ్బంది చెబుతున్నారు. సిబ్బందికి పెంచిన సొమ్ము రూ.4 వేలు ఇవ్వకుండా రూ.2 వేలు కోత వేశారని అంటున్నారు. అసలు జీతంలో రూ.2 వేలు కోతవేశారని, అదనంగా ఇవ్వాల్సిన సొమ్ములు కలిపి సీనియర్ టెక్నీషియన్‌కు రూ.28 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సీనియర్ టెక్నీషియన్‌కు సుమారు రూ.6 వేల వరకూ కోత వేశారని చెబుతున్నారు.


