వేతనాలు పెరగక వెతలు
ప్రభుత్వ టీచర్ ఉద్యోగం మానేసి..
పర్మినెంట్ చేయాలి
నూజివీడు: ట్రిపుల్ ఐటీలోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వేతనాలు పెరగక.. ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో 2011 నుంచి 2014 వరకు ఇంజినీరింగ్ విద్యార్థులకు బోధన చేసేందుకు నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో 200 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. అప్పట్లో ఆర్జీయూకేటీ వీసీ వి.రాజ్‌కుమార్ ఐఐటీలకు, ఎన్‌ఐటీలకు, సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి అక్కడే ఇంటర్వ్యూలు నిర్వహించి మెరిట్ ఉన్న వారిని ఎంపిక చేసుకొని వారిని నియామక పత్రాలు ఇచ్చి నియమించారు. మీ అందరిని పర్మినెంట్ చేయిస్తాననే హామీతో అప్పట్లో వీరిని తీసుకువచ్చారు. అయితే పర్మినెంట్ సంగతేమో గాని కనీస వేతనాలను సైతం చెల్లించడం లేదని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వాపోతున్నారు. తమకు వేతనాలు పెరిగి ఏడేళ్లు అవుతోందని, గతంలో పలుమార్లు అడిగినా వేతనాలు పెంచకుండా తమకేమీ పట్టనట్టు ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్లుగా కేవలం రూ.49 వేల వేతనానికే వారు పనిచేస్తున్నారు. ప్రస్తుతం నూజివీడు ట్రిపుల్ ఐటీలో 38 మంది, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 12 మంది పనిచేస్తున్నారు. వీరంతా బోధన చేయడమే కాకుండా అదనపు బాధ్యతలను సైతం నిర్వర్తిస్తున్నారు.
200ల నుంచి 50 మందికి తగ్గిన వైనం
వేతనాలు పెంచక.. పర్మినెంట్ చేయకుండా అనేక బాధ్యతలు అప్పగిస్తూ 24 గంటలూ పనిచేయించుకుంటున్న నేపథ్యంలో అత్యధిక శాతం మంది వేరే ప్రైవేటు సంస్థలు, ఇనిస్టిట్యూట్‌లలో అత్యధిక శాలరీ లభిస్తుండటంతో ట్రిపుల్ ఐటీలో ఉద్యోగాలు మానేశారు. ఇలా 200 మందిలో
150 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇతర ఉద్యోగాలు చూసుకొని బయటకు వెళ్లిపోయారు. వెళ్లిపోయిన వారంతా రూ.లక్షల్లో వేతనాలను పొందుతూ ఆర్థికంగా ఉన్నత స్థానంలోకి వెళ్లడంతో తామెందుకు ఇక్కడ ఉన్నామా అని మిగిలిన వారు ఆవేదన చెందుతున్నారు.
నల్ల రిబ్బన్లతో నిరసన
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ గత ఐదు రోజులుగా ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిరసన ప్రదర్శన చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం భోజన విరామం సమయంలో కొద్దిసేపు డైరెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్‌ను కలిసి వేతనాలను పెంచాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఏడేళ్లుగా చాలీచాలని వేతనాలతో అవస్థలు
ఇతర ఉద్యోగాలకు వెళ్లిపోయిన 150 మంది
ఆందోళనకు దిగిన కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు
ప్రభుత్వ టీచర్ ఉద్యోగం మానేసి భవిష్యత్ బాగుంటుందేమోనని ట్రిపుల్ ఐటీలో చేరా. టీచర్ ఉద్యోగంలోనే ఉండి ఉంటే నేడు రూ.1.50 లక్షల పైగా జీతం వచ్చేది. రిటైర్ అయ్యాక పింఛన్ వచ్చేది. ఇక్కడ జీతం లేదు, ఉద్యోగ భద్రత లేదు.
– జాడ సీతాపతిరావు, తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్
నాది ఉత్తరప్రదేశ్ కాగా గౌహతీ ఐఐటీలో పీహెచ్‌డీ చేశా. పర్మినెంట్ చేస్తామని హామీ ఇవ్వడంతో 2013లో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరా. కానీ ఇంతవరకు పర్మినెంట్ చేయకపోగా.. వేతనాలు కూడా చాలా తక్కువ ఇస్తున్నారు.
– విజయ్‌కుమార్ మిశ్రా, బయోసైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్
వేతనాలు పెరగక వెతలు
వేతనాలు పెరగక వెతలు


