సంతృప్తికర దర్శనం కలిగేలా చూడాలి
ద్వారకాతిరుమల: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి నిర్వహించే శ్రీవారి ఉత్తర ద్వార దర్శనంలో ప్రతి ఒక్క భక్తుడుకి సంతృప్తికరమైన దర్శనం కలిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి దేవస్థానం అధికారులను ఆదేశించారు. చినవెంకన్న ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి చేసిన ఏర్పాట్లను సోమవారం ఉదయం ఎస్పీ కె.ప్రతాప్ శివ కిశోర్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కొండపైన అతిథి గృహంలో అధికారులతో దర్శన ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ శ్రీవారి ఉత్తర ద్వార దర్శనానికి 35 వేల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించు కోవాలన్నారు. తోపులాటలు జరగకుండా చూడాలని, గర్భిణీలు, చిన్న పిల్లలు, వయోవృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని, భక్తుల సంఖ్యకు తగ్గట్టు తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎక్కడైనా తోపులాట జరిగితే వెంటనే భద్రతా సిబ్బంది పరిస్థితిని నియంత్రించి, సాధారణ స్థితికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా అన్ని ప్రదేశాలలో పరిస్థితిని పర్యవేక్షించాలని, ఎక్కడైనా అవాంచనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందని అనుమానం కలిగితే, వెంటనే భద్రతా సిబ్బంది నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవీ రమణ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ పీజే అమృతం, డీఎస్పీ శ్రావణ్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, తహసీల్దార్ జేవీ సుబ్బారావు, ఎంపీడీఓ ప్రకాష్ తదితరులున్నారు.


