జనసేనకు టీడీపీ షాక్‌! | - | Sakshi
Sakshi News home page

జనసేనకు టీడీపీ షాక్‌!

May 13 2025 12:41 AM | Updated on May 21 2025 1:45 PM

జనసేన

జనసేనకు టీడీపీ షాక్‌!

నామినేటెడ్‌ పదవుల్లో దక్కని ప్రాధాన్యత

పశ్చిమ జిల్లా అధ్యక్షుడు చిన్నబాబుకు మరో‘సారీ’

అసంతృప్తిలో అనుచరులు

సాక్షి ప్రతినిధి, ఏలూరు : నామినేటెడ్‌ పదవుల కేటాయింపుల్లో జనసేనకు టీడీపీ షాకిచ్చింది. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పదవుల్లో కీలక ప్రాధాన్యం ఉంటుందని పదే పదే ప్రకటించి చివరికి జిల్లా స్థాయిలో కూడా చోటు కల్పించకపోవడంతో జనసేన కేడర్‌ తీవ్ర అసంతృప్తితో ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదన్న బాధలో ఉన్న వారిని తాజా నియామకాలు మరింత నిరాశకు గురిచేస్తున్నాయి.

జనసేన నుంచి నలుగురే..

జనసేన పట్టున్నట్టు చెప్పుకునే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇంతవరకు రాష్ట్ర స్థాయిలో 12 మందికి నామినేటెడ్‌ పదవులు దక్కగా వారిలో జనసేన నుంచి కేవలం నలుగురే ఉన్నారు. జిల్లా నుంచి తొలి విడతలో ఇద్దరికి, రెండో విడతలో నలుగురుకి, తాజాగా ఏడుగురికి పదవులు దక్కాయి. మొదటి విడతలో ఏపీ వినియోగదారుల కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌గా నియమించిన టీడీపీ మాజీ మంత్రి పీతల సుజాతకు ఈ సారి రాష్ట్ర మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పదవి వరించింది. 

మిగిలిన వారిలో ఆప్కాబ్‌ డీసీసీబీ చైర్మన్‌గా ఉంగుటూరు టీడీపీకి చెందిన గన్ని వీరాంజనేయులు, డీసీఎంఎస్‌ చైర్మన్‌గా జనసేనకు చెందిన చాంగటి మురళీకృష్ణ, భవన, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్‌గా తాడేపల్లిగూడెం టీడీపీకి చెందిన వలవల బాబ్జీ, టైలర్స్‌ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌గా తాడేపల్లిగూడెం టీడీపీకి చెందిన ఆకాశపు స్వామి, మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా నరసాపురం టీడీపీకి చెందిన కొల్లు పెద్దిరాజు, ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా ఏలూరు టీడీపీ నగర అధ్యక్షుడు పెన్నుబోయిన వాణి వెంకట శివ ప్రసాద్‌ ఉన్నారు. మూడో విడతలోని ఏడుగురిలో ఆరుగురు టీడీపీకి చెందిన వారే ఉండటం జన సైనికులకు మింగుడు పడటం లేదు.

చినబాబుకు భంగపాటు

భీమవరం నుంచి పవన్‌ కల్యాణ్‌ పోటీ చేయకపోవడంతో ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షుడు, భీమవరానికి చెందిన కొటికలపూడి గోవిందరావు(చినబాబు) బరిలో ఉంటారని భావించారు. అనూహ్యంగా టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు జనసేనలో చేరి సీటు తెచ్చుకున్నారు. కూటమి ధర్మానికి కట్టుబడి భీమవరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పార్టీ ఎమ్మెల్యేల గెలుపునకు పనిచేశారు. ఆయన సేవలకు ఎమ్మెల్సీ పదవి ఆశించారు. పదవి దక్కక ప్రభుత్వ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్న తరుణంలో డీసీసీబీ చైర్మన్‌గా నియమిస్తారంటూ అధినాయకత్వం నుంచి సమాచారం వచ్చిందని రెండు నెలల క్రితం హడావుడి చేశారు. 

అమరావతి వెళ్లి సీఎం చంద్రబాబును కలవడంతో డీసీసీబీ చైర్మన్‌గా చినబాబు ఖాయం అంటూ వార్తలు వచ్చాయి. అదే సమయంలో చినబాబు అనుచరులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఆదివారం ప్రకటించిన పదవుల్లో డీసీసీబీ చైర్మన్‌ రాకపోగా, ఎక్కడా ఆయనకు చోటు దక్కక అనుచరుల్లో అసంతృప్తి నెలకొంది. నియోజకవర్గంలో, ఉమ్మడి జిల్లాలో పార్టీని నెట్టుకుని వస్తే అధికారంలోకి వచ్చాక పదవులను వేరొకరు ఎంజాయ్‌ చేస్తున్నారని మథనపడుతున్నారు.

తీవ్ర అసంతృప్తిలో జనసేన కేడర్‌

గత ఎన్నికల్లో జనసేన నుంచి భీమవరం సీటు ఆశించిన వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్‌నాయుడు నామినేటెడ్‌ పదవి దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. ఇప్పటికే భీమవరంలో పేరుకు జనసేన ఎమ్మెల్యే అయినా పెత్తనమంతా టీడీపీ నాయకుల చేతుల్లోనే ఉంది. ఆచంట, పాలకొల్లు, తణుకు, ఉండి నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తిలో జనసేన కేడర్‌ ఉంది. ఏలూరు నుంచి రెడ్డి అప్పలనాయుడుకు ఆర్టీసీ రీజనల్‌ చైర్మన్‌గా రెండో విడత నామినేటెడ్‌ పదవుల్లో చోటు కల్పించగా కై కలూరు, చింతలపూడి, పోలవరం తదితర నియోజకవర్గాల్లో కేడర్‌ తమను ద్వితీయ శ్రేణి నేతలుగానే చూస్తున్న పరిస్థితి ఉందని మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement