ఈఏపీ సెట్‌కు దరఖాస్తు ఇలా.. | - | Sakshi
Sakshi News home page

ఈఏపీ సెట్‌కు దరఖాస్తు ఇలా..

Apr 22 2025 12:55 AM | Updated on Apr 22 2025 12:55 AM

ఈఏపీ సెట్‌కు దరఖాస్తు ఇలా..

ఈఏపీ సెట్‌కు దరఖాస్తు ఇలా..

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సులు చదవాలనుకునే విద్యార్థులు తమ తొలి అడుగు వేయడానికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. ఆయా కోర్సుల్లో ప్రవేశించడానికి గతంలో ఎంసెట్‌ నిర్వహించేవారు. ఎంసెట్‌ ద్వారా వైద్య విద్యలో కూడా ప్రవేశించే వెసులుబాటు ఉండేది. అనంతరం జరిగిన పరిణామాల్లో భాగంగా వైద్య విద్య ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నీట్‌ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు మాత్రం రాష్ట్రస్థాయిలోనే ఏపీ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ( ఏపీఈఏపీ సెట్‌) నిర్వహిస్తున్నారు. ఆయా కోర్సుల్లో ప్రవేశించడానికి ఈఏపీ సెట్‌ పరీక్ష రాయడం తప్పనిసరి. ఈ ప్రవేశ పరీక్ష రాయడానికి ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయగా, షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 24వ తేదీతో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగియనుంది. వివిధ కారణాల వల్ల ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోలేని వారు ఇప్పుడు తొందరపడకపోతే తమ ఇంజనీరింగ్‌ చదువు కలగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. లేదా తమ తోటివారికంటే ఒక ఏడాది ఆలస్యంగా ప్రవేశించాల్సి వస్తుంది. ఏపీ ఈఏపీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా జిల్లాతోపాటు రాష్ట్రంలో ఎక్కడైనా ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు.

దరఖాస్తులు ఆన్‌లైన్‌లో సమర్పించాలి

ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు సీఈటీఆర్‌.ఏపీఆర్‌సీహెచ్‌ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి ఏపీ ఈఏసీసెట్‌–2025ను ఎంపిక చేసుకోవాలి. ఏపీఈ ఏపీసెట్‌ సైట్లో పరీక్ష రాసేందుకు అర్హతలు, దరఖాస్తు ప్రక్రియతో పాటు కోర్సుల వివరాలు, ఏపీ ఈఏపీ సెట్‌కు సంబంధించిన తేదీలు, సూచనలు తదితర పూర్తి వివరాలు పొందవచ్చు.

ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవడం మరువద్దు

ఈ పరీక్షకు దరఖాస్తు చేసే సమయంలో వివిధ కేటగిరీల పరిధిలోకి వచ్చే విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవడం మరిచిపోవద్దు. ముఖ్యంగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పీహెచ్‌సీ కేటగిరిల వారీగా తమ సామాజిక వర్గాన్ని ఎంపిక చేసుకుని ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో క్లిక్‌ చేయాలి. అలాగే ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన నంబర్‌ను దరఖాస్తులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్‌, ఆదాయ ధ్రువపత్రాల నంబరును సైతం విధిగా నమోదు చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ 1వ తేదీ తరువాత తీసుకున్న ధ్రువీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకున్నారు. విద్యార్థుల స్థానికత నిర్ధారణకు 6వ తరగతి నుంచి సీనియర్‌ ఇంటర్‌ వరకు ఏ విద్యా సంస్థల్లో చదివారు, ఏ ఊరిలో చదివారనే వివరాలు ఆయా విద్యా సంవత్సరాల వారీగా నమోదు చేయాలి. చివరలో ఏపీ ఈఏపీ సెట్‌ పరీక్ష ఏ జిల్లాలో రాస్తారనే సమాచారంతో కూడిన ట్యాబ్‌లను ప్రాధాన్యత క్రమంలో క్లిక్‌ చేయాలి. ఈ విధంగా ఐదు ప్రాధాన్యతలను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. సొంత జిల్లాకు చెందిన విద్యార్థి తమ సొంత జిల్లాలో పరీక్ష రాసేందుకు ఆప్షన్‌ ఎంచుకున్నప్పటికీ అక్కడి పరీక్షా కేంద్రంలో పరిమితి మించిపోవడం, ఇతర కారణాలతో పరీక్షా కేంద్రం అందుబాటులో లేని పక్షంలో తరువాత వరుస క్రమంలో ఇచ్చిన ప్రాధాన్యతల వారీగా ఆయా జిల్లాలో పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు.

ప్రింటౌట్‌ తీసుకోండి

ఆన్‌లైన్‌ దరఖాస్తు పూర్తి చేసి సబ్మిట్‌ చేసిన తరువాత ప్రింటౌట్‌ తీసుకోవాలి. పరీక్ష జరిగే రోజున ఏపీ ఈఏపీ సెట్‌ హాల్‌ టికెట్‌తో పాటు ఆన్‌లైన్‌ ప్రింటౌట్‌ కాపీపై ఫొటో అంటించి పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. ఫీజు చెల్లించే సమయంలో ఇచ్చిన రిఫరెన్స్‌ ఐడీ, విద్యార్థి పేరు, సీనియర్‌ ఇంటర్‌ హాల్‌ టికెట్‌, పుట్టిన తేదీ వివరాలతో భవిష్యత్తులో ఈఏపీ సెట్‌ హాల్‌ టికెట్‌, పరీక్షకు హాజరయ్యే సమయంలో సంబంధిత వివరాలు కీలకంగా మారుతాయి కనుక జాగ్రత్తగా ఉంచుకోవాలి.

5 దశలుగా దరఖాస్తు ప్రక్రియ

ఏపీఈఏపీ సెట్‌–2025 సైట్‌లో లాగిన్‌ అయిన తరువాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు ఐదు దశల్లోని ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్‌ ఫీజు పేమెంట్‌కు లాగిన్‌ అయి సీనియర్‌ ఇంటర్‌ హాల్‌ టికెట్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి. విద్యార్థి పుట్టిన తేదీ, మొబైల్‌ నెంబర్‌, ప్రత్యామ్నాయ మొబైల్‌ నెంబర్‌, ఈ మెయిల్‌ ఐడీ నమోదు చేయాలి. దీంతోపాటు ఇంజనీరింగ్‌ ఫార్మా, అగ్రికల్చర్‌ ఫార్మసీ, బోత్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీల వారీగా తాము రాయబోయే ప్రవేశ పరీక్ష, చేరనున్న కోర్సుల వారీగా మూడు ఆప్షన్లలో ఒక దానిని ఎంపిక చేసుకుని క్లిక్‌ చేయాలి. తరువాత సామాజిక వర్గాల వారీగా కేటగిరిపై క్లిక్‌ చేసి ఆన్‌లైన్‌ ఫీజు పేమెంట్‌ చేయాలి. క్రెడిట్‌, డెబిట్‌కార్డు, నెట్‌ బ్యాకింగ్‌ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

నో యువర్‌ పేమెంట్‌ స్టేటస్‌పై క్లిక్‌ చేసి సీనియర్‌ ఇంటర్‌ హాల్‌ టికెట్‌ నెంబర్‌, మొబైల్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలు పూర్తి చేయాలి. అనంతరం విద్యార్థి చేరనున్న కోర్సుల వారీగా ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్లలో ఏదైనా ఒక దానిని ఎంపిక చేసుకుని క్లిక్‌ చేయడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.

ఫిల్‌ అప్లికేషన్లో పేమెంట్‌ చేసిన ఐడీతోపాటు సీనియర్‌ ఇంటర్‌ హాల్‌టికెట్‌ నెంబర్‌, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి. అనంతరం ప్రొసీడ్‌ టు ఫిల్‌ అప్లికేషన్‌పై క్లిక్‌ చేయాలి.

ఇక్కడ నో యువర్‌ అప్లికేషన్‌ స్టేటస్‌పై క్లిక్‌ చేసి పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని సందర్శించవచ్చు.

ఇక్కడ్‌ క్లిక్‌ చేసి ఆన్‌లైన్‌లో సబ్మిట్‌ చేసిన దరఖాస్తు ఫారాన్ని ప్రింట్‌ తీసుకుని భద్రపరచుకోవాలి.

మూడు రోజుల్లో ముగియనున్న గడువు..

దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే సమర్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement