ఉత్తర ద్వారం.. గందరగోళం | - | Sakshi
Sakshi News home page

ఉత్తర ద్వారం.. గందరగోళం

Jan 1 2026 11:22 AM | Updated on Jan 1 2026 11:22 AM

ఉత్తర

ఉత్తర ద్వారం.. గందరగోళం

ఉత్తర ద్వారం.. గందరగోళం

ఆ రెండు మార్గాల్లోనే సమస్య..

శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం వద్ద క్యూలైన్‌ పక్కనున్న వీరంతా వీఐపీ మార్గం గుండా వచ్చినవారే..

స్వామివారి వైకుంఠ దర్శనం కోసం క్యూలైన్‌లలో పడిగాపులు

పడుతున్న భక్తులు

ద్వారకాతిరుమల: శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడవుతుందా.. ఆలయంలో నుంచి ఎప్పుడు బయట పడతామా అని కొందరు.. అసలు ఎందుకు వచ్చామురా దేవుడా.. అని మరి కొందరు భక్తులు ఆవేదన చెందారు. ఏర్పాట్లు సంగతి ఎలా ఉన్నా.. క్యూలైన్ల నిర్వహణలో దేవస్థానం అధికారులు పూర్తిగా విఫలం అయ్యారు. అందుకు కొందరు టీడీపీ నాయకులే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం క్షేత్రంలో దీనిపై చర్చ సాగుతోంది. వివరాల్లోకి వెళితే. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో చినవెంకన్న ఉత్తర ద్వార దర్శనాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించాలని ఆలయ అధికారులు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ ఏర్పాట్లను ముందు రోజు జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్‌ శివ కిషోర్‌ పరిశీలించారు. ఆ సమయంలో ఆలయ అధికారులు తమ యాక్షన్‌ ప్లాన్‌ను వారికి వివరించారు. అయితే క్షేత్ర స్థాయిలో ఆ ప్లాన్‌ను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దాంతో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఫెయిల్‌ అవడంతో పాటు.. సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పలేదు.

టీడీపీ నేతల ఆధీనంలో..

ఆలయ తూర్పు రాజగోపురంలో నుంచి ధ్వజస్తంభం మీదుగా ఆలయంలోకి కేవలం వీఐపీలను మాత్రమే అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఆ మార్గాన్ని కొందరు టీడీపీ నాయకులు తమ ఆధీనంలోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులను, బంధువులను, పార్టీకి చెందిన వారిని ఇష్టానుసారంగా ఆలయంలోకి పంపివేశారు. అదికూడా పదుల సంఖ్యలో కాదు.. వందల సంఖ్యలో. ఇలా అడ్డదారిన దర్శనాలు జరిగిపోయాయి. దాంతో ధ్వజస్తంభం వద్ద రద్దీ పెరిగిపోయి, ఇబ్బందులు తలెత్తాయి. అధికార పార్టీ నేతలతో మనకెందుకులే అనుకున్నారో ఏమో.. సంబంధిత అధికారులు చేతులెత్తేశారు. తాళాలు సైతం నాయకులకు అప్పగించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఫలితంగా క్యూలైన్లలో వచ్చిన భక్తులకు కష్టాలు తప్పలేదు.

గొడవలను నివారించడంలో..

శ్రీవారి ఉత్తర ద్వార దర్శనంలో ఎక్కువ మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయకపోయి ఉంటే పరిస్థితులు చేయిదాటిపోయేవి. కొన్ని సందర్భాల్లో అసహనానికి గురైన భక్తులు ఆలయ సిబ్బందిపై ఎదురు తిరిగారు. అయితే పోలీసులు ఎప్పటికప్పుడు గొడవలను నివారించడంలో సమర్థవంతంగా పనిచేశారు. అయితే ఇందులోనూ కొందరు పోలీస్‌ సిబ్బంది తమకు నచ్చిన వారిని దొడ్డిదారిన నేరుగా ఆలయంలోకి పంపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈసారి శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం సామాన్య భక్తులకు నిరాస.. నిస్పృహలనే మిగిల్చింది.

సామాన్యు భక్తులకు సంతృప్తికర దర్శనం కరువు

పోటెత్తిన భక్తజనం.. నిర్వహణ ఘోరం

అడుగడుగునా ఆంక్షలు.. అడ్డగింతలు

వీఐపీ మార్గం పూర్తిగా టీడీపీ నాయకులకే అప్పగింత

వైఫల్యాలపై క్షేత్రంలో తీవ్రస్థాయిలో చర్చ

ఇంకా ప్రారంభం కాని నూతన క్యూ కాంప్లెక్స్‌ను వినియోగిస్తే ఏదైనా జరగొచ్చని గ్రామస్తులు, భక్తులు ముందు నుంచే భావించారు. దీనిపై ‘సాక్షి’లో కూడా కథనం ప్రచురితమైంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే పర్వదినం నాడు ట్రయల్‌రన్‌ వేయడం మంచిది కాదని హెచ్చరించారు. అయితే ఇంజనీరింగ్‌ విభాగ అధికారులు వాటిని పెడచెవిన పెట్టారు. గ్రామస్తులను, గోవింద స్వాములను, రూ. 500 టికెట్‌ తీసుకున్న భక్తులను ఆ క్యూ కాంప్లెక్స్‌లో నుంచే పంపారు. దాంతో ఆ క్యూలైన్లలో రద్దీ పెరిగిపోయి సమస్య తలెత్తింది. రూ.100, రూ.200 లైన్లలో వెళ్లిన భక్తులకే ముందు దర్శనం అయ్యింది. దాంతో రూ.500 టికెట్‌లు కొనుగోలు చేసిన భక్తులు, డబ్బులు పెట్టి కష్టాలు కొనుకున్నట్టు అయ్యిందని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. గ్రామస్తులు, గోవింద స్వాములైతే అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. దర్శనం క్యూలైన్లలో 5 గంటలకు పైగా వేచి ఉండాల్సి వచ్చిందని మండిపడ్డారు. గతంలో గోవింద స్వాములకు, గ్రామస్తులకు ఒక లైన్‌, అలాగే రూ.500 టికెట్‌ తీసుకున్న వారికి మరో ప్రత్యేక లైన్‌ ఏర్పాటు చేసేవారు. అయితే ఈసారి నూతన క్యూ కాంప్లెక్స్‌పై నమ్మకంతో అధికారులు ముందుకు అడుగులు వేసి చేతులు కాల్చుకున్నారు. అడ్డదారిలో వీఐపీ దర్శనాలు ఎంత మందికి జరిగాయి.. దానికి కారకులు ఎవరూ అన్నది సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది.

ఉత్తర ద్వారం.. గందరగోళం 1
1/1

ఉత్తర ద్వారం.. గందరగోళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement