మద్యం మత్తులో ముంచుతున్న ప్రభుత్వం
తణుకు అర్బన్: రాష్ట్రాన్ని మద్యం మత్తులో ముంచేస్తూ ఇది మంచి ప్రభుత్వంగా కూటమి సర్కారు పేరు సంపాదించిందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సూపర్ సిక్స్ అన్నారు.. సంక్రాంతికి రోడ్లన్నీ వేసేస్తామన్నారు.. కరెంటు బిల్లులు పెంచమన్నారు.. ఇవేమీ జరగలేదు కానీ మద్యం మాత్రం విచ్చలవిడిగా నైట్ పాయింట్‌ల ద్వారా 24 గంటలు అమ్మిస్తూ అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో జగన్ పారదర్శకంగా పథకాలు అందించారని, కూటమి పాలనలో సూపర్‌సిక్స్ అమలు చేయకుండా, ప్రశ్నించిన వా రిపై కేసులు, దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులను సృష్టిస్తున్నారని విమర్శించారు.
ఆరిమిల్లీ నాకు సంస్కారం ఉంది
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తనను ఇష్టానుసారంగా దూషించారని, చదుకున్న అజ్ఞానిగా ఉన్నారంటూ కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా దూషించగలనని, అయితే సంస్కారం ఉంది కాబట్టే సంస్కారవంతంగా సమాధానం చెబుతున్నానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో పేకాటలు, కోతాటలు ఇళ్లలోనే నిర్వహిస్తున్నారని కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని, తణుకులో ఒక టీడీపీ నేత హోటల్‌లోనే కోతాటలో 45 మందిని జిల్లాస్థాయి పోలీసు ఉన్నతాధికారులు పట్టుకున్నారని గుర్తుచేశారు. ప్రశాంతంగా ఉండే తణుకులో గంజాయి విచ్చలవిడి అయిపోయిందని దాడులు, చోరీలకు నిలయంగా మారిందని విమర్శించారు. గత టీడీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ టీడీఆర్ బాండ్ల జారీలో రూ.800 కోట్లు డబ్బులు తీసుకున్నారని ప్రజలే చెప్పుకుంటున్నారని ఆరోపించారు. వారానికోసారి తణుకు వచ్చి ప్రెస్‌మీట్ పెట్టి తనపై విమర్శలు చేస్తున్నారని కారుమూరి ధ్వజమెత్తారు. నాది రాష్ట్రస్థాయి.. నీది తణుకు నియోజకవర్గస్థాయి మాత్రమే అని ఆరిమిల్లికి చురకలు వేశారు. ఆరిమిల్లి భాష మార్చుకో వాలని లేకుంటే ప్రజలు రోడ్లపై తిరగనివ్వరని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలందరికీ కారుమూరి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ లీగల్ సెల్ సభ్యుడు వెలగల సాయిబాబారెడ్డి, పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు ఫణీంద్రకుమార్ వీరమల్లు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కారుమూరి ధ్వజం


