
ఏలూరు (టూటౌన్): విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఉన్నత స్థితికి చేరవచ్చునని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్‌పర్సన్ చీర్ల పద్మశ్రీ అన్నారు. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సందర్భంగా స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సోమవారం నిర్వహించిన ముగింపు సభలో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న 74 గ్రంథాలయాల్లో ఘనంగా నిర్వహించిన సిబ్బందిని అభినందించారు. జిల్లాలో పలు చోట్ల బాలలకు ప్రత్యేక గ్రంథాలయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారంరోజుల పాటు పలు అంశాలపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్, వక్తృత్వం, జనరల్ నాలెడ్జ్ తదితర అంశాలపై గెలుపొందిన వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు బహుమతులను అందజేశారు. గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్‌బాబు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సభ్యులు వై.నరసింహారావు పలువురు వక్తలు గ్రంథాలయాల ప్రాముఖ్యత గురించి వివరించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ పోటీల్లో గెలుపొందిన 150 మందికి పైగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల సభ్యులు, పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.