శైవక్షేత్రాల్లో భక్తులకు సౌకర్యాల పెంపు | Sakshi
Sakshi News home page

శైవక్షేత్రాల్లో భక్తులకు సౌకర్యాల పెంపు

Published Tue, Nov 21 2023 1:22 AM

గునుపూడి పంచారామ క్షేత్రంలో విలేకరులతో మాట్లాడుతున్న డీసీ ఎం.విజయరాజు  - Sakshi

భీమవరం (ప్రకాశంచౌక్‌): కార్తీకమాసోత్సవాల్లో భాగంగా గోదావరి జిల్లాల్లో సుమారు 300 ఆలయాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎంవీ విజయరాజు చెప్పారు. సోమవారం భీమవరం పంచారామ క్షేత్రంలో కార్తీకమాస ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. తొలుత ఉమా సోమేశ్వరస్వామివారిని డీసీ దర్శించుకున్నారు. అనంతరం కార్తీక మాసానికి సంబంధించి ఆలయంలో ఏర్పాట్లపై ఆలయ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో డీసీ మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రముఖ శైవక్షేత్రాలకు కార్తీకమాసంలో ఇతర జిల్లాల నుంచి సైతం భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఆయా ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్‌, దేవస్థానాల వద్ద అన్నదానం తదితర సౌకర్యాలు కల్పించామన్నారు. భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట దేవస్థానాలకు సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. అందుకు తగ్గట్లు సోమవారం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు స్వామివారి దర్శనం సులువుగా జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో హిందూ ధర్మ ప్రచార యాత్ర కొనసాగుతోందని, వచ్చేనెలలో పశ్చిమగోదావరి జిల్లాలో కూడా ఈ యాత్ర నిర్వహిస్తామన్నారు. దేవస్థానం భూములను పరిరక్షించడానికి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పడ్డాయన్నారు. దేవస్థానం భూములకు సంబంధించి అన్యాక్రాంతమైన భూములను వెలికితీసి ఆయా దేవస్థానాలకు అప్పగించడం ఈ కమిటీలకు ప్రథమ లక్ష్యంగా ఉంటుందన్నారు. భీమవరం పంచారామ క్షేత్రానికి సంబంధించి ఓ ధర్మకర్త నియామకం నిబంధనలు అతిక్రమించి ఉందని వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామన్నారు. భీమవరంలో వేణుగోపాలస్వామి దేవస్థానానికి సంబంధించిన స్థల వివాదం పరిష్కరించుకుని, చట్ట ప్రకారం దేవదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ సుబ్బారావు, పంచారామక్షేత్రం ఈఓ డి.రామకృష్ణంరాజు, ఇన్‌స్పెక్టర్‌ వర్దినీడి వెంకటేశ్వరరావు, ఈఓలు శ్రీనివాసరావు, ఎన్‌.శ్రీనివాసరావు, డివీ కృష్ణంరాజు పాల్గొన్నారు.

గోదావరి జిల్లాల్లో 300 ఆలయాల్లో కార్తీక మాసోత్సవాలు

దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎంవీ విజయరాజు

గునుపూడి సోమేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్ల పరిశీలన

Advertisement
Advertisement