అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

Jun 26 2023 12:52 AM | Updated on Jun 26 2023 12:17 PM

- - Sakshi

ఏలూరు: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందగా, స్నేహితుడే హత్య చేశాడని మృతుడి బంధువులు, స్నేహితులు ఆరోపిస్తుండగా, ప్రమాదవశాత్తూ కాల్వలో పడి మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి తణుకులో మృతుడి బంధువులు, స్నేహితులు రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాడేపల్లిగూడెంలోని పాతవూరుకు చెందిన నల్లా జగత్‌ కల్యాణ్‌ (18), సప్పా అజయ్‌కుమార్‌ స్నేహితులు.

ఈ నెల 20న అర్ధరాత్రి తాడేపల్లిగూడెంలో మద్యం తాగిన వీరు టిఫిన్‌ చేసేందుకు మోటారు సైకిల్‌పై తణుకు వచ్చారు. స్థానిక తేతలి వైజంక్షన్‌ వద్ద టిఫిన్‌ చేసి తిరిగి బయలుదేరారు. అయితే మరుసటి రోజు అజయ్‌కుమార్‌ మాత్రమే తాడేపల్లిగూడెం చేరుకోవడంతో స్నేహితులు ఆరా తీశారు. తనకు తెలియదని తన మోటారు సైకిల్‌ తీసుకుని ఎక్కడికో వెళ్లి ఉంటాడని పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన స్నేహితులు తాడేపల్లిగూడెం పోలీసులకు సమాచారం అందించారు.

అజయ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, మద్యం మత్తులో అసలేం జరిగిందో గుర్తు లేదని చెప్పాడు. ఇదిలా ఉంటే ఈనెల 24న తణుకు మండలం తేతలి గ్రామం పరిధిలోని కాల్వలో గుర్తు తెలియని మృతదేహం ఉందని వచ్చిన సమాచారంతో తణుకు రూరల్‌ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కల్యాణ్‌ ఆచూకీ కోసం గాలిస్తున్న స్నేహితులు, బంధువులు తణుకు వద్ద దొరికిన మృతదేహం కల్యాణ్‌దిగా నిర్థారించారు. దీంతో మరోసారి పోలీసులు అజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకోవడంతో తొలుత హత్యగా భావించారు.

ప్రమాదమే అంటున్న పోలీసులు
కల్యాణ్‌ మృతదేహాన్ని శనివారం గుర్తించిన తణుకు పోలీసులు అదే ప్రాంతంలో మోటారు సైకిల్‌ను ఆదివారం గుర్తించారు. దీంతో అజయ్‌కుమారే హత్య చేసినట్లుగా భావించారు. అయితే విచారణ చేపట్టిన పోలీసులు మృతదేహం, బైక్‌ దొరికిన ప్రాంతంలో లభ్యమైన ఆధారాలు నేపథ్యంలో రోడ్డు ప్రమాదంలోనే కల్యాణ్‌ మృతి చెందినట్లు నిర్థారణకు వచ్చారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ శరత్‌రాజ్‌కుమార్‌, సీఐ నాగరాజు, తణుకు రూరల్‌ సీఐ ఆంజనేయులు, ఎస్సై గుర్రయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

తణుకు జాతీయ రహదారిపై టిఫిన్‌ చేసిన అనంతరం తేతలి వంతెన వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి బైక్‌తో సహా కల్యాణ్‌ కాల్వలోకి పడిపోయి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. మద్యం తాగి ఉన్న అజయ్‌కుమార్‌ గట్టుపై పడి స్పృహ వచ్చి చూసేసరికి కల్యాణ్‌ లేకపోవడంతో దువ్వ సెంటర్‌ వరకు నడిచి వచ్చి అక్కడే గుడిలో నిద్రించి ఉదయాన్నే తాడేపల్లిగూడెం వెళ్లాడు. కల్యాణ్‌ కోసం ఆరా తీసిన స్నేహితులకు ఏం జరిగిందో తనకు గుర్తు లేదని, బైక్‌పై ఎక్కడికో వెళ్లి ఉంటాడని చెప్పాడు. ఇదే నిజమని బంధువులు, స్నేహితులు భావిస్తున్న తరుణంలో కల్యాణ్‌ మృతదేహం లభ్యం కావడం అనుమానాలను రేకెత్తించాయి.

రోడ్డుపై బైఠాయించి నిరసన
కల్యాణ్‌ మృతదేహం లభ్యమైన తర్వాత అజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్న తాడేపల్లిగూడెం పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో తానే హత్య చేశానని ఒప్పుకున్నాడని పోలీసులకు తమకు సమాచారం ఇచ్చినట్లు స్నేహితులు, బంధువులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం వరకు హత్యగానే భావించినప్పటికీ రోడ్డు ప్రమాదంలోనే కల్యాణ్‌ మృతి చెందాడని, దీంతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా కేసు నమోదు చేయడంపై మృతుడి బంధువులు, స్నేహితులు ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు.

తణుకు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లబోమంటూ బైఠాయించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు రాస్తారోకోకు దిగారు. సీఐ ఆంజనేయులు, ఎస్సై గుర్రయ్య వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. తణుకు రూరల్‌ సీఐ సీహెచ్‌ ఆంజనేయులు మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని పోస్టుమార్టం నివేదిక ఆధారంగా సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement