మరిదితో వివాహేతర సంబంధం... మరికొందరితో చనువుగా ఉంటోందని.... | Sakshi
Sakshi News home page

మరిదితో వివాహేతర సంబంధం... మరికొందరితో చనువుగా ఉంటోందని....

Published Wed, Feb 28 2024 1:04 AM

- - Sakshi

పోలవరం రూరల్‌: కొత్తరామయ్యపేట పునరావాస కేంద్రంలో మేడూరి దుర్గ (28) అనే వివాహిత హత్య కేసులో నిందితుడిని మంగళవారం పోలవరం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలవరం డీఎస్పీ కార్యాలయంలో హత్యకు సంబంధించిన కారణాలను విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం.సురేష్‌కుమార్‌ రెడ్డి వివరించారు. కొత్తరామయ్యపేట పునరావాస కేంద్రం ప్రాంతానికి చెందిన మేడూరి దుర్గ (28)కు, సమీప బంధువు, వరుసకు మరిది అయిన మేడూరి ప్రసాద్‌ మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది.

అయితే నెల రోజుల నుంచి దుర్గ వేరే వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు అనుమానంతో ప్రసాద్‌ ఆమెతో గొడవ పడుతున్నాడు. ఆదివారం రాత్రి ప్రసాద్‌ దుర్గకు అనేకమార్లు ఫోన్‌ చేయగా, దుర్గ వేరే వారితో మాట్లాడుతుడంతో ఫోన్‌ కలవలేదు. ఫోన్‌ తీయడం లేదనే కోపంతో ప్రసాద్‌ దుర్గ ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. వెంటనే ప్రసాద్‌ తన వెంట తెచ్చుకున్న చాకుతో దుర్గ కంఠం కోసి, ఇంటి వెనుక వైపున మామిడి తోట నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే గాయం తీవ్రంగా కావడంతో దుర్గ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రసాద్‌ హత్య చేసిన అనంతరం దుర్గ ఫోన్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. సమీపంలోని మొక్కజొన్న చేలో ప్రసాద్‌ బట్టలు, ఫోన్‌, చాకు దాచి ఉంచాడు.

ఘటన జరిగిన వెంటనే పోలవరం సీఐ కె.మధు బాబు, ఎస్సై ఎస్‌ఎస్‌ పవన్‌కుమార్‌, సిబ్బంది సంఘటనా స్థలంలో డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌తో పరిశీలించారు. మృతురాలి ఫోన్‌ కనబడకపోవడంతో అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఘటన జరిగిన రెండు రోజుల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో వాస్తవాలు తెలిశాయన్నారు. నిందితుడిని మంగళవారం కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు చేయడంపై జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అభినందించినట్లు చెప్పారు. ఈ కేసులో నిందితుడిని త్వరితగతిన పట్టుకున్నందుకు రివార్డులు కూడా ప్రకటిస్తామని డీఎస్పీ తెలిపారు.

Advertisement
 
Advertisement