మిరియం రైతుకు ప్రకృతి సెగ | The pepper yield is not promising this year | Sakshi
Sakshi News home page

మిరియం రైతుకు ప్రకృతి సెగ

Feb 9 2026 4:01 AM | Updated on Feb 9 2026 4:01 AM

The pepper yield is not promising this year

పూత సమయంలో కానరాని వర్షాలు  

పాదులకు గణనీయంగా తగ్గిన కాపు 

ఎకరాకు 50 కిలోలు కష్టమే ∙

గతేడాది రూ.లక్షల్లో ఆదాయం 

ఏజెన్సీలో గిరిజన రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మిరియం సాగు ఈ ఏడాది గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ప్రకృతి కన్నెర్ర చేయడంతో పూత దశలోనే పంట దెబ్బతిని, దిగుబడి భారీగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఏడాది రూ.లక్షల్లో ఆదాయం చూసిన రైతులు, ఈసారి కనీస పెట్టుబడులు కూడా వస్తాయో లేదోనని ఆందో ళన చెందుతున్నారు. 

సాక్షి, పాడేరు: ఏటా గిరిజన రైతులకు సిరులు కురిపించే మిరియం దిగుబడి ఈ ఏడాది ఆశాజనకంగా లేదు. తోటల్లోని పాదులకు అక్కడక్కడ మాత్రమే గుత్తులు కనిపిస్తుండటంతో, దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల మధ్య అంతరపంటగా మిరి యం సాగవుతోంది. గతంలో ఎకరానికి రూ. లక్ష వరకు ఆదాయం వచ్చేదని, ఈసారి మాత్రం రూ. 20 వేలకు మించి వచ్చేలా లేదని గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. 

జాతీయ స్థాయిలో డిమాండ్‌ ఉన్నా.. 
గిరిజన రైతులు సాగు చేసే మిరియాలకు జాతీయ స్థాయిలో మంచి డిమాండ్‌ ఉంది. సాధారణంగా ఎకరాకు 150 నుంచి 200 కిలోల వరకు ఎండు మిరియాల దిగుబడి వస్తుంది. గత ఏడాది దిగుబడి బాగుండటంతో, కిలో మిరియాలు రూ.600 –రూ.700 వరకు పలికాయి. దీని తో ఎకరాకు సుమారు రూ. 1.5 లక్షల వరకు ఆదాయం లభించిందని రైతులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది కాపు భారీగా తగ్గడంతో ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. 

పూత సమయంలో వర్షాల్లేక.. 
మిరియం పాదులు పూత దశలో ఉన్నప్పుడు వర్షాలు లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని గిరిజన రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా ఆగస్టు, సెపె్టంబర్‌ నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. దీని ప్రభావం పూతపై పడటంతో దిగుబడి క్షీణించింది. గత ఏడాది మిరియం గుత్తులతో కళకళలాడిన తోటలన్నీ ప్రస్తుతం వెలవెలబోతున్నాయి.

తక్కువగా పూత 
ఐదు ఎకరాల కాఫీ తోటలో మిరియం పాదులు ఉన్నాయి.  ఏటా దిగుబడి ఎక్కువగా ఉండేది. ఈ ఏడాది పూత తక్కువగా ఉంది. అందువల్ల కాపు కూడా బాగా తగ్గింది. అరకు, పాడేరు మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. దీని ప్రభావం ఆదాయంపై చూపుతుంది.  – పాలికి లక్కు, గిరిజన ౖరైతు, మోదాపల్లి పంచాయతీ, పాడేరు మండలం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement