
ఏలూరు జిల్లాలో ఘటన
కొయ్యలగూడెం: కన్నతల్లిపై కొడుకు నడిరోడ్డుపై కత్తితో విచక్షణారహితంగా నరికి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని అశోక్‌నగర్ ప్రాంతంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొయ్యలగూడెంలో జక్కు లక్ష్మీనరసమ్మ (50) రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటూ నివసిస్తోంది. ఆమె భర్త గతంలోనే మృతి చెందాడు. వీరికి కొడుకు, కూతురు ఉండగా, కుమార్తెకు వివాహమైంది. కుమారుడు శివాజీ (32)కి వివాహం కాగా, అతను భార్య, ఇద్దరు పిల్లలతో దేవరపల్లి మండలం బుచ్చియ్యపాలెంలో తాపీమే్రస్తిగా పనిచేస్తూ నివసిస్తున్నాడు. లక్ష్మీ నరసమ్మ తన సొంత ఇంటిలోనే నివాసముంటోంది.
ఇటీవల ఆస్తి విషయంలో తల్లితో శివాజీ తరచూ కొయ్యలగూడెం వచ్చి ఘర్షణ పడుతున్నట్టు స్థానికులు తెలిపారు. తల్లి అంగీకరించకపోవడంతో గతంలోనూ రెండుసార్లు ఆమెపై దాడికి యత్నించాడు. ఆదివారం వారి ఇంటికి సమీపంలో తల్లిని కుమారుడు అకస్మాత్తుగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపైనే ఈ ఘాతుకానికి ఒడిగట్టి పరారయ్యాడు. లక్ష్మీనరసమ్మకు ఈ దాడిలో తలపై నాలుగు, మెడపై నాలుగు, శరీరంపై మరో రెండు తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
స్థానికులు 108 కోసం పలుమార్లు ప్రయత్నించినా స్పందన కనిపించలేదు. దీంతో సురక్ష ఆస్పత్రి అంబులెన్సులో లక్ష్మీనరసమ్మను కొయ్యలగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలించారు. ఆమె పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుల నిరసన
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఆస్పత్రికి తరలించేందుకు అందుబాటులో ఉండాల్సిన 108 అంబులెన్సు నిరుపయోగంగా పడి ఉండటంపై యువకులు కొయ్యలగూడెంలో నిరసన తెలిపారు. లక్ష్మీ నరసమ్మపై హత్యాయత్నం జరిగిన తరువాత స్థానికులు 108కి ఫోన్ చేసినా కనీస స్పందన రాలేదు. దీంతో స్థానిక యువకులు ఆగ్రహానికి గురై నిరుపయోగంగా ఉన్న 108 అంబులెన్సు వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.