
చిత్తూరు, ఏలూరు జిల్లాల్లో తీవ్ర విషాదం
దేవరాజపురంలో ఆడుకోవడానికి వెళ్లి నీటి కుంటలో పడి ముగ్గురు మృతి
బుట్టాయగూడెంలోని జల్లేరు జలాశయంలో నీట మునిగి అన్న, తమ్ముడు మృత్యువాత
తల్లిదండ్రులకు తీరని శోకం
కుప్పం రూరల్/బుట్టాయగూడెం: వేసవి సెలవుల్లో చిన్నారుల సందడితో కళకళలాడాల్సిన ఇళ్లల్లో విషాదం అలముకుంది. అప్పటివరకు కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపిన ఐదుగురు చిన్నారులు జల సమాధి అయ్యారు. తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చారు. చిత్తూరు జిల్లా దేవరాజపురంలో ఆడుకోవడానికి వెళ్లి నీటి కుంటలో పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని జల్లేరు జలాశయంలో నీటమునిగి ఓ అన్న, తమ్ముడు మృతి చెందారు.
ప్రమాదవశాత్తూ జారి పడి..
చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేవరాజపురానికి చెందిన యశోద, వరలక్ష్మి, రాజా ఒకే తల్లి బిడ్డలు. యశోద తమిళనాడులో నివసిస్తుండగా.. వరలక్ష్మి, రాజా దేవరాజపురంలోనే ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో యశోద తన కుమారుడు అశ్విన్‌తో కలిసి ఇటీవల దేవరాజపురం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం యశోద కుమారుడు అశ్విన్(7), వరలక్ష్మి కుమార్తె గౌతమి(6), రాజా కుమార్తె శాలిని(7) ఆడుకుంటూ.. సమీపంలోని నీటి కుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ ముగ్గురూ అందులోకి జారిపడ్డారు. ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు ఎంతసేపటికీ రాకపోవడంతో.. తల్లిదండ్రులు వారిని వెదుకుతూ నీటి కుంట వద్దకు వెళ్లగా.. ముగ్గురూ విగతజీవులుగా కనిపించారు. వారిని అలా చూసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేయనున్నట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు.
బిడ్డల కోసం తల్లి పోరాడినా..
తాడేపల్లిగూడేనికి చెందిన షేక్ అన్వర్, పర్విన్ దంపతులకు ఇద్దరు కుమారులు సిద్దిక్(10), అబ్దుల్(7). వేసవి సెలవులు కావడంతో పర్విన్ తన ఇద్దరు కుమారులను తీసుకుని జంగారెడ్డిగూడెంలోని బంధువుల ఇంటికి వచ్చింది. ఆదివారం బంధువులతో కలిసి బుట్టాయగూడెం మండలం అలివేరు సమీపంలోని జల్లేరు జలాశయాన్ని చూసేందుకు వెళ్లారు. నీళ్లు తక్కువగా ఉండడంతో స్నానం చేసేందుకని జలాశయంలోకి దిగారు. సిద్దిక్, అబ్దుల్ లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశానికి వెళ్లడంతో.. నీట మునిగారు. వారిని కాపాడేందుకు తల్లి పర్విన్‌తో పాటు మరో మహిళ ప్రయత్నించారు.
ఈ క్రమంలో వారిద్దరూ కూడా నీటిలో మునిగిపోతుండగా.. స్థానికులు చున్నీల సాయంతో వారిద్దరినీ బయటకు లాగారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ దుర్గామహేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకొని పిల్లల కోసం జలాశయంలో గాలించారు. గంట సేపటి తర్వాత స్థానికుల సాయంతో వలలు వేసి.. పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు పిల్లలూ.. ఒకేసారి మరణించడంతో తల్లిదండ్రులు ‘ఇక మాకు దిక్కెవరు?’ అంటూ రోదించారు.
చిన్నారుల మృతిపై సీఎం విచారం
సాక్షి, అమరావతి: విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడటంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పిల్లల మృతితో తీవ్ర శోకంలో ఉన్న తల్లిదండ్రులకు సానుభూతి తెలిపారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.