
ఏలూరు జిల్లా పొలసానిపల్లి గురుకుల కళాశాలలో దారుణం
పీటీఎంలో పాల్గొన్న కాసేపటికే ఘటన
కుటుంబ సభ్యులు, స్థానికుల ఆందోళన
భీమడోలు: ఏలూరు జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి అంబేడ్కర్ గురుకుల కళాశాలలో గురువారం సాయంత్రం ఇంటర్ విద్యార్థిని లేళ్ల మానస (16) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భీమడోలు పంచాయతీ శివారు అర్జావారిగూడేనికి చెందిన ఈ బాలిక కళాశాల బాత్‌రూమ్‌లో చున్నీతో ఉరి వేసుకున్న స్థితిలో ఉండగా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.
‘మా కుమార్తె మానస కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతోంది. పొలసానిపల్లి గురుకుల కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశానికి ఆహ్వానం వస్తే వచ్చాం. మధ్యాహ్నం 3.30 గంటల వరకు మాతోనే ఉంది. బాగా మాట్లాడింది. కళాశాలకు వచ్చి వారం రోజులే అయ్యింది.. ఊరికి రమ్మంటే దసరా సెలవులకు వస్తానని చెప్పింది. ఇంతలోనే మరణ వార్తను వినాల్సి వచ్చింది.
మా కుమార్తె ఉరి వేసుకునేంత పిరికిది కాదు’ అని తల్లిదండ్రులు లేళ్ల మరియమ్మ, రాజు తెలిపారు. తహసీల్దార్ బి.రమాదేవి, సీఐ యుజే విల్సన్, ఏలూరు ఆర్‌డీవో అచ్యుత అంబరీష్, డీఎస్పీ శ్రావణ్‌కుమార్ అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడుతున్నారు. బాలిక మృతికి కారణమైన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, న్యాయ విచారణ చేపట్టాలని, కుటుంబానికి నష్టపరిహారం అందించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.