
దేహశుద్ధి చేసిన బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు
నిందితుడిపై పోక్సో కేసు నమోదు ఏలూరులో ఘటన
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో పదేళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. చిన్నారికి మాయమాటలు చెబుతూ వారం రోజులుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. బాధిత బాలిక అనారోగ్యంగా ఉండటంతో తల్లి ఆరా తీయగా ఈ దారుణం బయటపడింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు కొత్తపేట ప్రాంతానికి చెందిన తెర్రి సత్యనారాయణ (80) భార్య చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. సమీప ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలిక అమ్మమ్మ ఇల్లు వృద్ధుడి ఇంటికి సమీపంలోనే ఉంది. దీంతో బాలిక పాఠశాలకు వెళుతూ తన అమ్మమ్మ ఇంటికి వచ్చే క్రమంలో వృద్ధుడు ఆమెకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసింది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలిక తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు వృద్ధుడికి దేహశుద్ధి చేశారు. ఏలూరు టూటౌన్ పోలీసులకు సమాచారం అందడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు సర్వజనాస్పత్రికి తరలించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏలూరు టూటౌన్ సీఐ అశోక్ కుమార్ నిందితుడు సత్యనారాయణపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు.