పాలకొల్లు సెంట్రల్‌:..... | - | Sakshi
Sakshi News home page

పాలకొల్లు సెంట్రల్‌:.....

Mar 20 2023 1:14 AM | Updated on Mar 20 2023 1:14 AM

సీబీఎస్‌ఈ అమలుకు ఎంపికై న పాలకొల్లులోని బీవీఆర్‌ఎం మునిసిపల్‌ హైస్కూల్‌  - Sakshi

సీబీఎస్‌ఈ అమలుకు ఎంపికై న పాలకొల్లులోని బీవీఆర్‌ఎం మునిసిపల్‌ హైస్కూల్‌

పాలకొల్లు సెంట్రల్‌: రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందడంతో పాటు మౌలిక వసతులు సమకూరడంతో గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జిల్లాలో ఎంపిక చేసిన హైస్కూళ్లలో సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) సిలబస్‌ను అమలు చేయనుంది. 2023 – 2024 సంవత్సరం నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ విద్యా విధానం ప్రారంభంకానుంది. దేశ వ్యాప్తంగా జరిగే పోటీ పరీక్షల్లో రాణించాలన్నా, ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ఇంజినీరింగ్‌ కోర్సులు చదవడానికి ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటాలన్నా సీబీఎస్‌ఈ విద్య అభ్యసిస్తే సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ. ఇటువంటి సీబీఎస్‌ఈ విద్య కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా పేద, మద్య తరగతి విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. దీనిలో భాగంగా మొదటి విడతలో జిల్లాలో 16 పాఠశాలలను సీబీఎస్‌ఈకి ఎంపిక చేశారు. ఇప్పటికే నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్‌ స్థాయి హంగులతో మెరుగైన విద్యను అందిస్తున్నారు. అంతేకాకుండా ఆంగ్ల విద్యకు శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు కార్యాచరణ చేపట్టారు. ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కొనాలంటే విద్యార్థులకు సీబీఎస్‌ఈ విద్య చాలా ఉపయోగపడుతుంది. సీబీఎస్‌ఈ ద్వారా చదువుకునే విద్యార్థులు వారి కుల, ఆదాయ ధ్రువీకరణలు, పుట్టిన తేదీ సర్టిఫికెట్‌లను అందజేయాల్సి ఉంటుంది. సీబీఎస్‌ఈ ద్వారా పరీక్షలు రాసే విద్యార్థులు ఐదు సబ్జెక్టులను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

పాఠశాల ఎంపిక ఇలా..

సీబీఎస్‌ఈ విద్యా విధానం అమలు చేసేందుకు ఒక పాఠశాలను ఎంపిక చేయాలంటే పాఠశాల భౌతిక నిర్మాణం, తరగతి గదులు, ఆట స్థలం, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాల ఆర్థిక నిర్వహణ, విద్యార్థుల సంఖ్య, విద్యార్థుల ప్రగతి, బాలబాలికలు, దివ్యాంగులకు సరిపడా టాయిలెట్స్‌ వంటి మౌలిక వసతులను పరిగణనలోకి తీసుకుంటారు.

ఎంపికై న పాఠశాలలు ఇవే

పశ్చిమగోదావరి జిల్లాలో వీరవాసరం, కొణితివాడ, ఆకివీడు, పెదకాపవరం, కోపెల్ల, లంకలకోడేరు, తణుకు, ఏలూరుపాడు, ఉండి, కాళ్ల, మొగల్తూరు, దువ్వ, ఆచంట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలతో పాటు పాలకొల్లు పట్టణంలో బీఆర్‌ఎంవీ మునిసిపల్‌ ఉన్నత పాఠశాల, ఎల్‌బీ చర్ల, ఆరుగొలనులో ఉన్న రెండు రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఎంపిక చేశారు.

రాష్ట్రంలో సీబీఎస్‌ఈ ప్రాంతీయ కార్యాలయం

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ప్రాంతీయ కార్యాలయం, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏపీలో ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో ఏపీ, తెలంగాణకు కలిపి ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 2023–2024 విద్యా సంవత్సరం నుంచి బోర్డు పరీక్షలను ఈ కార్యాలయం నిర్వహిస్తోంది. త్వరలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సీబీఎస్‌ఈ పాఠశాలలు పెరగనున్న కారణంగా ఏపీలో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం విశేషం.

వచ్చే విద్యా సంవత్సరంలో 9వ తరగతి నుంచి ప్రారంభం

తొలిదశలో జిల్లాలో వసతులున్న 16 హైస్కూళ్ల ఎంపిక

విద్యార్థుల్లో మరింత మెరుగుపడనున్న అభ్యసనా సామర్థ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement