పబ్లిక్‌ పాలసీ – ‘పట్టభద్ర’త

Sakshi Editorial: YS Jagan Govt and MLC Election By Vardhelli Murali

జనతంత్రం

చేరవలసిన గమ్యం ఎంత దూరమున్నా, దారంతా గతుకు లున్నా, చీకటి ముసురుకొస్తున్నా, చేతిలో చిన్న దీపం లేకున్నా గుండెలో ధైర్యం ఉంటే చాలంటాడు కవి తిలక్‌. లోకరీతి పలుకు బడి గలవారి పక్షం వహిస్తున్నప్పుడు, సాంఘిక న్యాయం శాప గ్రస్తమైనప్పుడు న్యాయం పక్షాన నిలబడటానికి కూడా ధైర్యం కావాలి.

అటువంటి ధైర్యం దారి చూపినప్పుడే చరిత్ర కూడా కొత్త మార్గాలను అనుసరిస్తుంది. లోకరీతిని సవరిస్తుంది. ‘నేను యుద్ధం చేస్తున్నది పెత్తందార్లతో. నా ఎకనామిక్స్, నా పాలిటిక్స్‌ పేదవర్గాల ప్రజలకోసమ’ని ఏపీ అసెంబ్లీలో ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి విస్పష్టంగా ప్రకటించారు. సామాజిక న్యాయం కోసం చేసిన యుద్ధ ప్రకటన ఇది.

సరకులు, ఉత్పత్తి, మార్కెట్లు, లాభాలు, డిమాండ్, సప్లై వగైరాలు ముమ్మరించిన తర్వాత భూమి తన చుట్టూ తాను తిరుగుతూ డబ్బు చుట్టూ తిరగడం ప్రారంభించింది. తన చుట్టూ పరిభ్రమించే భూమ్మీద ఆట నియమావళిని అప్పటినుంచే డబ్బు రూపొందిస్తున్నది. ఎక నామిక్స్‌ పితామహుడుగా భావిస్తున్న ఆడమ్‌ స్మిత్‌ జన్మించి ఈ సంవత్సరానికి సరిగ్గా మూడొందల యేళ్లయింది.

ఎకనామిక్స్‌ వయసు కూడా ఇంచు మించు అంతే! ఆయన రాసిన ‘జాతుల సంపద’ అనే ఉద్గ్రంథం లేజేఫెయిర్‌ (స్వేచ్ఛా వాణిజ్యం) ఎకనామిక్స్‌ పాలిటి పవిత్ర గ్రంథం. ఈ పవిత్ర గ్రంథం వెలుగులోనే మన పెట్టు బడిదారీ ఆర్థిక వ్యవస్థ ఈనాటికీ కొన్ని మార్పు చేర్పులతో వెలుగు లీనుతున్నది.

పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ నిబంధనావళిని గతంలో చాలామంది సవాల్‌ చేశారు. కారల్‌ మార్క్స్‌ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఎకనామిక్స్‌ను పేద ప్రజల పక్షాన పునర్నిర్మించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు పెను సంచ లనాలకు కారణమయ్యాయి. అయినప్పటికీ ఆడమ్‌ స్మిత్‌ను మార్క్స్‌ పూర్తిగా ఓడించలేకపోయారు.

కాలాను గుణమైన మార్పులతో ఆడమ్‌ స్మిత్‌ కొనసాగుతూనే ఉన్నాడు. అయినా వ్యవస్థలో సమానత్వం కోసం సాగు తున్న పోరాటాలు ఆగలేదు. ‘మానవ చరిత్రంతా వర్గ పోరాటాల చరిత్రే’ అని మార్క్స్‌ ప్రకటించినట్లుగానే, సమా నత్వం కోసం జరిగే పోరాటాల చరిత్రగా థామస్‌ పికెటీ అభివర్ణిస్తున్నారు. ఈయన ఫ్రెంచి ఆర్థికవేత్త.

చరిత్రలో జరిగిన యుద్ధాలు, విప్లవాలు, విధ్వంసం, వ్యవస్థల మార్పు వగైరా పరిణామాల్లోంచి కూడా క్రమంగా మానవ సమాజం సమానత్వం వైపు కొద్దికొద్దిగా పురోగమించిందని పికెటీ సూత్రీకరించారు. గతంతో పోలిస్తే లింగ, జాతి వివక్షలు కొంచెం తగ్గాయి. ఆర్థిక వనరుల పంపిణీ మెరుగైంది. మెజారిటీ ప్రజలకు విద్య, వైద్యం అందు బాటులోకి వస్తున్నది. పౌరులకు హక్కులు సంక్రమి స్తున్నాయి.

ఈ మార్పులకు కారణమైన విద్య, వైద్య, సాంఘిక, ఆర్థిక, న్యాయ వగైరా వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారాసంపూర్ణ సమానత్వం వైపు పయనించవచ్చని ఈ తరహా ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అంటే పేద, ధనిక, కుల, మత, లింగ ప్రాంత భేదాలు లేకుండా ప్రజలందరికీ సమానావ కాశాలు కల్పించడం, సమాన స్థాయిలో పోటీ పడగలిగేలా ప్రభుత్వ వ్యవస్థలు అండగా నిలవడం ద్వారా సమానత్వ సాధన సులభ సాధ్య మవుతుందని వారి అభిప్రాయం.

ఆర్థికవేత్తలే కాదు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొందరు రాజకీయ ప్రముఖులు కూడా ఇందుకోసం ప్రయత్నించిన ఉదాహరణలు లేకపోలేదు. భారతదేశంలో పరిమితమైన వనరులతో కూడిన ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ ప్రభుత్వ వ్యవస్థల దన్నుతో సమా నత్వ సాధనకు కృషి చేస్తున్న వారిలో అతి ముఖ్యమైన నాయకుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.

గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత విస్తృత స్థాయిలో సమానత్వ సాధనకు కృషి చేసి ఉండలేదు. నాణ్య మైన విద్య, మెరుగైన వైద్యం ఉచితంగా ప్రజలందరికీ అందుబాటులోకి తేవడానికి జగన్‌ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమం ఏ రాష్ట్రంలో ఇంత వరకు జరగలేదు. విత్తు నుంచి విపణి వరకు రైతును చేయి పట్టుకొని నడిపించే విస్తృతమైన రైతు భరోసా కార్యక్రమం చరిత్రలో ఇదే మొదటిసారి.

వెనుకబడిన కులాలన్నింటికీ కార్పొరేషన్‌ల ఏర్పాట్ల ద్వారా ఆత్మగౌరవ ప్రకటన చేయించారు. దేవాలయ కమిటీలతోపాటు, అన్ని నామినేటెడ్‌ పదవుల్లో బలహీన వర్గాలకు, మహిళలకు సింహభాగం వాటా కల్పించారు. రాష్ట్ర మంత్రిమండలి నుంచి పెద్దల సభల వరకు అత్యధిక పదవులు బలహీనవర్గాలకు కేటాయించారు.

ఆర్థిక రంగంలో పేదల అనుకూల విప్లవాన్ని స్వయంగా ప్రభుత్వమే ప్రారంభించింది. బటన్‌ నొక్కడం ద్వారా లబ్ధి దారుల ఖాతాల్లోకి నేరుగా రెండు లక్షలకోట్ల రూపాయలను బదిలీ చేసింది. ప్రభుత్వ ఆసరాతో బలం పుంజుకున్న డ్వాక్రా సంఘాలు సకాలంలో అప్పులు చెల్లిస్తున్నందు వలన లక్ష కోట్ల రూపాయలకు పైగా వాటికి బ్యాంకుల రుణాలు లభించాయి.

ఈ మొత్తం ఇంకా పెరుగుతూ వస్తున్నది. ఇక్కడే మూడు లక్షల కోట్ల రూపాయలు పేద వాడలను చుట్టేస్తూ ప్రవహిస్తున్న వైనం మన కళ్లకు కనబడుతున్నది. గతంలో సంక్షేమం పేరుతో కేటా యించిన పద్దుల్లోంచి అవినీతి కమీషన్లు పోనూ మిగిలిన సొమ్ము మాత్రమే ఈ వాడల్లోకి బట్వాడా అయ్యేది.

పేద మహిళల పేర్ల మీద ఇంటి స్థలాలను కేటాయించి ఇళ్ల నిర్మాణం మరో హెర్క్యులస్‌ టాస్క్‌! ప్రభుత్వం తలపెట్టిన 30 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే కనీస పక్షం ఒక్కో ఇంటికి పది లక్షల చొప్పున మరో మూడు లక్షల కోట్ల ఆస్తి పేద మహిళల చేతిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన మరో ప్రత్యేక శ్రద్ధ వలన దాదాపు లక్షకు పైగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కొత్తగా వచ్చి చేరాయి.

పది లక్షలమందికి పైగా అదనంగా ఉపాధి దొరికింది. ఇందులో అత్యధికులు దిగువ మధ్యతరగతి వర్గ ప్రజలేనని ప్రత్యేకంగా చెప్పవలసిన అవ సరం లేదు. ‘నాడు–నేడు’ కింద చేపట్టిన విద్య–వైద్య సంస్థల పునరుజ్జీవనం గురించి, ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల నిర్మాణం గురించి వేలాది గ్రామీణ సెక్రటేరియట్‌లు, ఆర్‌బీకే కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. డీబీటీ కాకుండా పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన లక్షల కోట్ల కిమ్మతు చేసే కార్యక్రమాల గురించి కూడా చర్వితచర్వణం అవసరం లేదు.

ప్రపంచంలోని తత్వవేత్తలెందరో స్వప్నించిన విధంగా, మన దేశ రాజ్యాంగ నిర్మాతలు అభిలషించిన విధంగా సంపూర్ణ సమానత్వానికి వేగంగా బాటలు వేయగల కార్యక్రమాలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రారంభించింది. మెజారిటీ ప్రజలకు ఇది స్వాగతించదగిన కార్యక్రమమే కావచ్చు. కానీ పాతకాలపు వ్యవస్థలో ప్రయోజనం పొందుతున్న పెత్తందారీ వర్గాలకు ఇది కంటగింపు కలిగించే కార్యక్రమమే. అందుకే ఈ వర్గాలు కత్తిగట్టాయి.

రాష్ట్ర ప్రభుత్వం మినహా మిగిలిన అన్నిరకాల పబ్లిక్‌ సంస్థలపై, వ్యవస్థలపై ఈ పెత్తందార్ల పట్టు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా చూపెట్టగల సామర్థ్యం ఇంకా ఈ వర్గాలకు ఉన్నది. తాము చెప్పిందే న్యాయంగా, తాము చెప్పిందే ధర్మంగా, తాము చెప్పిందే అభివృద్ధిగా ఒప్పించగల నైపుణ్యం ఇంకా పెత్తందార్లకు ఉన్నది.

ఎందుకంటే ఇంతకాలం గేమ్‌ రూల్స్‌ను నిర్ణయించింది వీరే కనుక. మీడియా వీరి చేతిలో ఉన్నది. వ్యవస్థలు వీరి చేతిలో ఉన్నాయి. జగన్‌ ప్రభుత్వ సమానత్వ ఎజెండా వలన ప్రజలు సోమరిపోతులవుతున్నారని ప్రచారం మొదలు పెట్టింది. అభివృద్ధి ఆగిపోయిందనే భ్రాంతిని సృష్టి స్తున్నది.

జగన్‌ ప్రభుత్వ కార్యక్రమాల వలన ప్రత్యక్షంగా లబ్ధిపొందుతున్న అరవై నుంచి డెబ్బయ్‌ శాతం పేద వర్గాలకు పైనున్న వర్గాల్లో విషం చిమ్మే కార్యక్రమాన్ని చేపట్టింది. మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి శ్రేణుల మెదళ్లను కలుషితం చేస్తున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వో ద్యోగుల్లో కొందరు, ఉన్నత ప్రైవేట్‌ ఉద్యోగులు, వ్యాపార వర్గాలు ఈ శ్రేణుల్లోకి వస్తారు.

పేద ప్రజలను పేదరికం నుంచి విముక్తి చేసి అభివృద్ధి పథం వైపు పయనింప జేయడంలో ముందువరసన నిలబడవలసిన వారు ప్రభుత్వోద్యోగులు. పేద ప్రజలూ – ప్రభుత్వోద్యోగులు శత్రు వర్గాలు కాదు. ప్రభుత్వోద్యోగుల్లో మెజారిటీ పేద వర్గాల నుంచి వచ్చిన వారే. రాజ్యాంగ లక్ష్యాల మేరకు పేదలకు అండగా నిలబడ వలసిన వారు కూడా ప్రభుత్వో ద్యోగులే.

పేద ప్రజల ప్రయోజ నాలకు వ్యతిరేకంగా వీరిలో కొందరి మనసులను కలుషితం చేయడంలో పెత్తందార్లు విజయం సాధించడం ఒక విషాదం. రాష్ట్ర ప్రభుత్వ విధా నాలు పెత్తందార్లకు వ్యతిరేకం. తమకు వ్యతిరేకమైన ప్రభు త్వాన్ని ఉద్యోగ వ్యతిరేకిగా ఉద్యోగుల ముందు చిత్రించే ప్రయత్నం పెత్తందారీ వర్గం చేస్తున్నది.

పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి రాష్ట్ర శాసన మండలికి జరిగిన ఎన్నికల్లోనూ పెత్తందారీ వర్గం ఈ ప్రయత్నాలను యథేచ్ఛగా చేసింది. ఇంత చేసినా వారు ఆశించిన ప్రయోజనం నెరవేరిందా? నెరవేరిందని ఎల్లో మీడియా, కొందరు విశ్లేషకులు, జగన్‌ ప్రభుత్వ వ్యతిరేకులు ఢంకా భజాయిస్తు న్నారు.

ఇదెంతవరకు వాస్తవం? గతంలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా పట్ట భద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన దృష్టాంతాలు చాలా తక్కువ. ఈ పరిణామం కొత్తది కాదు. ఈసారి రెండు స్థానాలను టీడీపీ గెలవడం, మూడో స్థానంలో గట్టి పోటీలో గట్టెక్కడం వెనుక ప్రత్యేక కారణాలు న్నాయి.

ఒకటి – ఈ ఓటర్లలో అత్యధిక సంఖ్యలో ఉండే ప్రభుత్వోద్యోగులలో ప్రభుత్వ వ్యతిరేకత నింపడం, రెండు – ఈ నియోజకవర్గాల్లో సంప్రదాయకంగా బలంగా పోటీ పడే పీడీఎఫ్‌ (సీపీఎం అనుకూలురు) అభ్యర్థులు పేలవ మైన పోటీ ఇవ్వడం (తమ ఓట్లను గంపగుత్తగా టీడీపీకి బదిలీ చేయడం కారణం). మూడు – గతంలో ఉత్తరాంధ్రలో గెలిచిన బీజేపీ ఓట్లు కూడా టీడీపీకి బదిలీ చేయడం.

నాలుగు – టీడీపీ తరఫున ఉత్తరాంధ్ర, తూర్పు రాయల సీమల నుంచి పోటీచేసిన అభ్యర్థులు ఓటర్లలో విస్తృత పరిచయాలు కలిగి ఉండడం, ఏడాది కాలంగా వారు ఓటర్ల నమోదు, ప్రచార కార్య క్రమాల్లో నిమగ్నమై ఉండటం. ఇవన్నీ బయటకు కనిపిస్తున్న కారణాలు.

ఇంకో ముఖ్య విషయమేమిటంటే ఈ మూడింటిలో ఒక్కటి మాత్రమే (పశ్చిమ రాయలసీమ) గతంలో వైసీపీ మద్దతుతో ఇండిపెండెంట్‌ గెలిచిన సీటు. మిగిలిన రెండు సీట్లలో వైసీపీ ఎన్నడూ పోటీ చేయలేదు. ఆ ఒక్క సీటులోనూ తొలి లెక్కింపులో ఆధిక్యతను నిలబెట్టుకున్నది. రెండో లెక్కింపులో బీజేపీ – పీడీఎఫ్‌ ఓట్ల సాయంతో టీడీపీ గెలవగలిగింది.

ఇక ఈ మూడు సీట్లలో గెలుపుతో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినట్టేనని ఎల్లో మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది. మూడు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో 108 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయనీ, వాట న్నింటిలో టీడీపీ గెలిచినట్టేనని ‘ఈనాడు’ గాలిమేడలు కట్టేసింది. గతంలో ఉత్తరాంధ్ర నుంచి జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ – పీడీఎఫ్‌ అభ్యర్థులు పోటీ పడ్డారు. బీజేపీకి గానీ, సీపీఎంకు గానీ చెరో అసెంబ్లీ సీటు కూడా దక్కలేదు.

చిత్తూరు నుంచి తూర్పు గోదావరి వరకు మూడు పట్టభద్రుల స్థానా లనూ పీడీఎఫ్‌ గెలిచింది. ‘ఈనాడు’ లెక్క ప్రకారం సీపీఎంకు ఎన్ని అసెంబ్లీ సీట్లు వచ్చి ఉండాలి? అరవై శాతం పేద వర్గాల్లో గణనీయమైన పలుకుబడితో ఉన్న వైసీపీ ప్రభావాన్ని తక్కువ చేసి చూపడం కోసం,కొంతమందిని ప్రభావితం చేయడం కోసం ఎల్లో మీడియా ప్రచారం ఉపయోగపడవచ్చేమో కానీ ఫలితాలను తారుమారు చేయగలంత బలమైన సీన్‌ ఈ సినిమాలో లేదు.

కాకపోతే వరస విజయాలతో మత్తెక్కి ఉన్న వైసీపీ మత్తేభానికి పట్టభద్రులు సరైన సమయంలో వాతలు పెట్టినట్టు భావించాలి. ఆ మేరకు పట్టభద్రులకు వైసీపీ కృతజ్ఞతతో ఉండాలి.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top