కలలు మాని... కళ్ళు తెరవాలి! | Sakshi Editorial On West Bengal Train Accident | Sakshi
Sakshi News home page

కలలు మాని... కళ్ళు తెరవాలి!

Published Wed, Jun 19 2024 5:23 AM | Last Updated on Wed, Jun 19 2024 5:23 AM

Sakshi Editorial On West Bengal Train Accident

ఏడాది గడిచిందో లేదో... సరిగ్గా అదే రకమైన దుర్ఘటన. అవే రకమైన దృశ్యాలు. మళ్ళీ అవే అనునయ విచారాలు, నష్టపరిహారాలు, దర్యాప్తుకు ఆదేశాలు, భద్రతే తమకు ముఖ్యమంటూ సర్కారీ ప్రకటనలు. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలో సీల్డా వెళుతూ ఆగివున్న కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి వచ్చిన ఓ గూడ్స్‌ రైలు గుద్దుకున్న సోమవారం నాటి ప్రమాద దృశ్యాలు, తదనంతర పరిణామాలు చూస్తే సరిగ్గా అలాగే అనిపిస్తుంది. నిరుడు జూన్‌ 2న ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్, మరో రెండు రైళ్ళు ఢీ కొట్టుకోవడంతో 290 మందికి పైగా మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డ దారుణ ఘటన ఇప్పటికీ  మదిలో మెదులుతూనే ఉంది. 

ఇంతలోనే ఇప్పుడు ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్‌లో జనం బక్రీద్‌ హడావిడిలో ఉండగా ఉదయం తొమ్మిది గంటల వేళ జరిగిన తాజా రైలు ప్రమాదం పాలకులు పాఠాలు నేర్చుకోలేదని తేల్చింది. గూడ్స్‌ పైలట్, కో–పైలట్‌ సహా పది మంది ప్రాణాలను బలి తీసుకొని, 40కి పైచిలుకు మందిని గాయాలపాలు చేసిన ఈ దుర్ఘటన మన రైల్వే వ్యవస్థలో లోటుపాట్లను మరోసారి బయటపెట్టింది. 

ప్రమాదం జరగడానికి మూడు గంటల ముందు ఉదయం 5.50 గంటల నుంచే రెండు స్టేషన్ల మధ్య ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ చెడిపోయిందని వార్తలు వచ్చాయి. సిగ్నల్‌ను పట్టించుకోకుండా గూడ్స్‌ ట్రైన్‌ ముందుకు పోవడం వల్లే ప్రమాదం సంభవించిందని రైల్వే బోర్డ్‌ ఛైర్‌పర్సన్‌ జయావర్మ సిన్హా ఉవాచ. కానీ, ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ పనిచేయనప్పుడు రెడ్‌ సిగ్నళ్ళను పట్టించుకోకుండా ముందుకు సాగాల్సిందిగా సర్వసాధారణంగా ఇచ్చే టీఏ 912 మెమోను స్టేషన్‌ మాస్టర్‌ ఇవ్వడం వల్లే రైళ్ళు రెండూ ఒకే లైనులో ముందుకు సాగాయట. 

విభిన్న కథనాలు, వాదనలు, తప్పొప్పులు ఏమైనా అమాయకుల ప్రాణాలు పోవడం విచారకరం. లెక్క తీస్తే 2018–19 నుంచి 2022–23 మధ్య అయిదేళ్ళలో తీవ్ర పర్యవసానాలున్న రైలు ప్రమాదాలు సగటున ఏటా 44 జరిగాయి. దాదాపు 470కి పైగా జరిగిన 2000–01 నాటితో పోలిస్తే ఈ సంఖ్య తగ్గినట్టే కానీ, పెరిగిన సాంకేతికత, పాలకుల ప్రగల్భాలతో పోలిస్తే ఇప్పటికీ ఎక్కువే. ముఖ్యంగా రైళ్ళు ఢీ కొంటున్న ఘటనలు ప్రతి 3.6 నెలలకు ఒకటి జరుగుతున్నాయట. దేశంలోని మొత్తం 18 రైల్వే జోన్లలో దక్షిణ రైల్వే లాంటి ఆరింటిలో మినహా, మిగతా అన్నిటా నిరుడు ఏదో ఒక ప్రమాదం సంభవించింది.

రైలు ప్రమాదాలను అరికట్టాలనీ, ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలనీ చాలాకాలంగా చర్చ జరుగుతోంది. రైళ్ళు ఢీకొనే ప్రమాదం లేకుండా చూసేందుకు ప్రయోగాలూ సాగాయి. ప్రమాదాలను నివారించేందుకు ఆటోమేటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌ ‘కవచ్‌’ను మూడు భారతీయ సంస్థలు దేశీయంగా రూపొందించాయి. 

ఈ ‘కవచ్‌’ భద్రతా వ్యవస్థ రైళ్ళ వేగాన్ని నియంత్రించడమే కాక, ప్రమాద సూచికలు డ్రైవర్ల దృష్టిని దాటిపోకుండా తోడ్పడుతుంది. మసక మసక చీకటిలోనూ భద్రతను అందిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ‘కవచ్‌’ను ప్రవేశపెట్టామని పాలకులు చాలా కాలంగా గొప్పలు చెబుతున్నారు. కానీ, భారత రైల్వే వ్యవస్థ దాదాపు లక్ష కిలోమీటర్ల పైచిలుకు పొడవైనది కాగా, దశలవారీగా 1500 కి.మీల మేర మాత్రమే ‘కవచ్‌’ ఇప్పటికి అందుబాటులోకి వచ్చింది. ఈ నత్తనడక ప్రయాణికుల భద్రతపై ప్రభుత్వ పట్టింపులేనితనానికి నిదర్శనం. 

అసలు ఒకప్పటిలా రైల్వేలకూ, రైల్వే శాఖకూ ప్రాధాన్యం ఉందా అంటే అనుమానమే. రైలు సేవల్లో సామాన్యుల హితం కన్నా హంగులు, ఆర్భాటాలు, ఎగువ తరగతి సౌకర్యాలకే పెద్ద పీట వేస్తున్నారు. సౌకర్యాల పేరిట అధిక ఛార్జీలు, వందే భారత్‌ ౖరైళ్ళు, సుందరీకరణ లాంటివాటి మీదే సర్కారు దృష్టి తప్ప, సాధారణ రైళ్ళ సంగతి పట్టించుకోవట్లేదు. సరిపడా కోచ్‌లు, బెర్తులు కరవన్న మాట అటుంచి, కనీసం కూర్చొనే జాగా కూడా లేక శౌచాలయాల వద్దే ఒకరిపై ఒకరుపడుతున్న జనంతో క్రిక్కిరిసిన రైళ్ళు మన దేశంలో నిత్య దృశ్యాలు. వీటన్నిటి మధ్య భద్రత మాట సరేసరి! 

గతంలో సాధారణ బడ్జెట్‌కు దీటుగా రైల్వేకు ప్రత్యేక బడ్జెట్‌ ఉండేది. 1924 నుంచి ఉన్న ఆ రెండు వేర్వేరు బడ్జెట్ల విధానానికి 2017లో బీజేపీ సర్కార్‌ స్వస్తి పలికింది. ఫలితంగా ఆ తర్వాత రైల్వే శాఖకు వెలుగు తగ్గింది. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదికి, అందులోనూ బీజేపీ పాలిత రాష్ట్రాలకే రైల్వే సౌకర్యాల విస్తరణలో సింహభాగం వడ్డిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఒకప్పటి రైల్వే మంత్రి, బెంగాల్‌ ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ మాటల్లో చెప్పాలంటే, రైల్వేస్‌ ఇప్పుడో అనాథ. 

ఇక, నిరుటి పాలనలో లాగే... కొత్త మోదీ సర్కారులోనూ అశ్వినీ వైష్ణవ్‌కే రైల్వే శాఖ అప్పగించారు. పేరుకు ఆయన రైల్వే మంత్రే కానీ, కీలకమైన ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ శాఖ, సమాచార ప్రసార శాఖ సైతం ఆయన వద్దే ఉన్నాయి. దేనికదే అత్యంత ముఖ్యమైన మూడు శాఖలను వైష్ణవ్‌ ఒక్కరే నిర్వహించడం భారమే. ఇవన్నీ కాక సోమవారం రైలు ప్రమాదం జరిగిన కొద్ది గంటలకే... ఆయనను రానున్న అసెంబ్లీ ఎన్నికలకై మహారాష్ట్రలో పార్టీ ఎన్నికల కో–ఇన్‌ఛార్జ్‌గా కూడా బీజేపీ నియమించడం మరీ విడ్డూరం. 

పాలనా ప్రాధాన్యాల పట్ల అలసత్వానికి ఇది మచ్చుతునక. దేశంలో మునుపెన్నడూ జరగనంత ప్రమాదమైన బాలాసోర్‌ విషాదం తర్వాతా మనం మారలేదు. సీబీఐ దర్యాప్తు చేసి, ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినా ఆ కేసు ఇంకా కోర్టులోనే మూలుగుతోంది. అందుకే, ఇకనైనా సిగ్నలింగ్‌ వ్యవస్థల ఆధునికీకరణ, రైల్వే ప్రయాణ భద్రతను పెంచడం ప్రాధమ్యం కావాలి. బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ల గురించి రంగుల కలలు చూపిస్తున్న మన పాలకులు తాజా ఘటనతోనైనా క్షేత్రస్థాయి వాస్తవాలపై కళ్ళుతెరవాలి. ఉట్టికెగరలేకున్నా, స్వర్గానికి నిచ్చెన వేస్తామంటే హాస్యాస్పదం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement