సినిమా చూడాల్సిన సమాజం

Sakshi Editorial On Tollywood Focus On Commercial Films Comparing To Message Oriented Films

‘సామాజిక సందేశం ఇవ్వాలనుకుంటే ఆ ముక్క టెలిగ్రామ్‌ ఇచ్చి చెప్పు. అంతే తప్ప లక్షలు ఖర్చు పెట్టి సినిమా తీయకు’...ఈ జోక్‌ లాంటి సూక్తిని తెలుగు పరిశ్రమ కొన్ని దశాబ్దాలుగా ప్రచారంలో పెట్టి ఉంది. 

సినిమా వినోద ప్రధాన మాధ్యమం అని, భారీ పెట్టుబడితో ముడిపడిన అంశమని, కనుక ఫార్ములా ప్రకారం తీయాలని తెలుగు సినిమా పండితులు సిద్ధాంతాలను చెప్పడమూ, ఉదాహరణలు చూపడమూ కద్దు. కాని ఏ కళ అయినా విజయవంతం అవడం వల్ల ఆర్థికంగా లాభం, సంఘపరమైన కీర్తి సంపాదించవచ్చు గాని అది నిజమైన గౌరవం పొందాలంటే సామాజిక సందర్భాలకు తగినట్టుగా స్పందించాల్సి ఉంటుంది. సమాజ గతిని పట్టించుకోవాల్సి ఉంటుంది. బాధిత దొంతరలకు అండగా నిలవాల్సి ఉంటుంది.

 
తెలుగు సినిమా నడక మొదలెట్టినప్పుడు ఈ మాధ్యమానికి సామాజిక బాధ్యత ఉందనుకున్న పెద్దలు ఉన్నారు.  దాని నుంచి ఏదో ఒక మేర మార్పు సాధించాలని ఆశించినవారు ఉన్నారు. ‘వందేమాతరం’, ‘మాలపిల్ల’, ‘పెద్ద మనుషులు’, ‘కన్యాశుల్కం’... వంటి సినిమాలు అటువంటి భావనలతోనే నిర్మించబడ్డాయి. అయితే ఈ కళ కొత్తది. ప్రేక్షకులకు ఈ కళలో ప్రవేశమూ కొత్తది. వారికి వినోదం ఇస్తూనే వారి అభిరుచి స్థాయిని పెంచుకుంటూ వెళ్లడంలో తెలుగు సినిమా తగిన సహనం చూపించ లేదు.  నాగిరెడ్డి–చక్రపాణి తమ తొలి సినిమా ‘షావుకారు’ను ఆదర్శనీయమైన కథతో తీసి, వచ్చిన ఫలితాలకు నిరాశ చెందారు. ఆ వెంటనే వారు ‘పాతాళభైరవి’ తీశారు. అది ఘన విజయం సాధించడంతో ఆ తర్వాత వారి సినిమాలన్నీ ఫక్తు వినోదానికి పరిమితమయ్యాయి. మరోవైపు ఎన్‌.టి.రామారావు ‘తోడు దొంగలు’ తీసి చేయి కాల్చుకుని వెంటనే కత్తి పట్టుకుని ‘జయసింహ’ అన్నారు. అక్కినేని, ఆదుర్తితో కలిసి ‘సుడి గుండాలు’, ‘మరో ప్రపంచం’ ప్రయోగాలు చేసి ఆశాభంగం చెందారు. ఇవన్నీ మంచి సినిమాలు అయినా ప్రేక్షకుడి సన్నద్ధ లోపమూ లేదా వాటిని చెప్పిన పద్ధతిలో ఆకర్షణ లేకపోవడమూ సరైన ఫలితాలు రాకపోవడానికి కారణం. దురదృష్టవశాత్తు ఇవన్నీ తర్వాతి కాలంలో ‘మంచి సినిమా’ తీయడానికి ‘చెడు ఉదాహరణ’లుగా నిలిచాయి.

పేద, దిగువ మధ్యతరగతి అంచెలతో నిండిన నాటి తెలుగు సమాజంలో సగటు ప్రేక్షకుడు తన కష్టాలు మర్చిపోవడానికి సినిమాకు వచ్చిన మాట వాస్తవమే అయినా అతడి గుండెకు తాకే విధంగా గట్టి అంశాలు చెప్పినప్పుడు ఏనాడూ బాక్సాఫీసును నిరాశ పర్చలేదు. అక్కినేని ‘రోజులు మారాయి’ నుంచి  శారద ‘మనుషులు మారాలి’ వరకు అటువంటి కథలను సూపర్‌హిట్‌ చేశారు.  కె.బి.తిలక్‌ ‘ఎం.ఎల్‌.ఏ’... ఈరంకి శర్మ ‘నాలాగ ఎందరో’ వంటి సినిమాలు తీయడానికి ఈ ప్రేక్షకులు ఉన్నారన్నదే ధైర్యం. ఆ తర్వాత దాసరి రంగ ప్రవేశం చేసి ‘తాత–మనవడు’తో సోషల్‌ మెసేజ్‌ను డ్రామాతో పండించవచ్చని నిరూపించారు. కె.విశ్వనాథ్‌ ‘శంకరాభరణం’, ‘సప్తపది’ తీసి కళకు, ఆలోచనకు తెలుగు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని ఖరారు చేశారు. అయితే అదే సమయంలో కె.రాఘవేంద్రరావు దర్శకేంద్రుడిగా మారి ఫార్ములా సినిమాను కొనసాగిస్తూ దాని వల్ల వచ్చే స్టార్‌డమ్‌ను హీరోలకు చూపుతూ ఆ ఎరీనాకు కట్టి పడేశారు. 

అయితే ఎర్రదండు వచ్చింది. ధవళ సత్యం, వేజెళ్ల సత్యనారాయణ, మాదాల రంగారావు, టి.కృష్ణ, ముత్యాల సుబ్బయ్య, ఆర్‌.నారాయణమూర్తి... వీరంతా సగటు ప్రేక్షకుడి భాషలో సమాజంలోని దోపిడీని చర్చించారు. బి.నరసింగరావు ఇదే పని సటిల్‌గా చేశారు. ఇన్ని జరిగినా ఇంత ప్రయాస జరుగుతున్నా అంతిమంగా తెలుగు సినిమా ప్రతి శుక్రవారం విడుదలయ్యే స్టార్‌ హీరోల కొత్త ఆటపాటలు, ఫైట్ల కొరకే ఉద్దేశించబడింది. బాక్సాఫీస్‌ కలెక్షన్లే దాని ఔన్నత్యానికి సూచి. దాని కథాంశానికి ఏ విలువా లేదు. అది రిలీజైన సమాజానికీ, దానికీ ఎటువంటి సంబంధమూ లేదు.

ఉద్యమాల్లో పని చేసే వ్యక్తిని పోలీసులు మాయం చేస్తే ఆ వ్యక్తి ఏమయ్యాడని  న్యాయవ్యవస్థను నిలదీస్తుంది ఒక స్త్రీ సి.ఉమామహేశ్వర రావు తీసిన 1992 నాటి ‘అంకురం’ సినిమాలో. ఇన్నేళ్ల తర్వాత తాజాగా విడుదలైన ‘జై భీమ్‌’ సినిమాలో తన భర్తను పోలీసులు ఏం చేశారని ఉన్నత న్యాయస్థానాన్ని నిలదీస్తుంది ఒక గిరిజన స్త్రీ. సూర్య వంటి స్టార్‌ ‘జై భీమ్‌’ వంటి సామాజిక చైతన్యం కలిగించే టైటిల్‌ పెట్టిన సినిమాను తీయడం, దొంగలుగా ముద్రపడిన సంచార జాతులపై 1995 కాలంలో తమిళనాడులో ఎలాంటి దాష్టీకాలు జరిగాయో ఈ సినిమా చూపడం, అలాంటి పరిస్థితులు దేశమంతా అక్కడక్కడా ఉండటం వల్ల ఈ సినిమా ఎన్నో ప్రశంసలను అందుకుంటోంది. 

సినిమా వ్యాపార కళే అయినా కమర్షియల్‌ సినిమా తప్పని సరే అయినా ఇతర భాషల సినిమాతో పోల్చినప్పుడు మన కెమెరా కన్ను ఈ సమాజ సమస్యలపై కూడా పడాలని ప్రేక్షకులు కోరుకోవడంలో తప్పులేదు. సమాజానికి ప్రతిస్పందనే కళ. ‘మీ కోసం మేమూ ఆలోచిస్తాము’ అని తెలుగు సినిమా చెప్పాల్సిన రోజు వచ్చేసింది. తెలుగు సినిమా స్వయంభువు కాదు. అది తెలుగు జాతి వ్యక్తిత్వం, చైతన్యం, కళాభిరుచి, వ్యక్తీకరణల ప్రతినిధి. ఇతర భాషల సినిమా ఎదుట తెలుగువారి సామాజిక ప్రతిస్పందనను చిన్నబుచ్చే హక్కు దానికి లేదు. కమర్షియల్‌ సినిమాతోపాటు అర్థవంతమైన సినిమా వెలుగులోకి అది కళ్లు తెరవాలని కోరుకుందాం.  

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top