ఎన్నికల ప్రేమకథ

Sakshi Editorial On Punjab Congress Crisis

దేశంలోనే అత్యధికంగా దళితులున్న రాష్ట్రమది. అక్కడ నూటికి 32 మంది దళితులే. కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్ళు నిండినా, ఇప్పటి దాకా ఒక్క దళితుడైనా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు. మరో అయిదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలనగా ఇప్పుడయ్యారు. పంజాబ్‌ రాష్ట్రానికి తొలి దళిత సీఎంగా కాంగ్రెస్‌ నేత చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ సోమవారం పదవీ ప్రమాణం చేశారు. ఇన్నేళ్ళకు సాధ్యమైన ఈ పరిణామాన్ని స్వాగతించాల్సిందే. కానీ 5 నెలల్లో ఎన్నికలనగా చూపిన ఈ ప్రేమ, చేసిన ఈ మార్పు దళితుల సాధికారికతకు చిహ్నమా? లేక ఎన్నికల వ్యూహమా అన్నది ప్రశ్న.  అధ్యక్ష పదవిలో లేకున్నా పార్టీపై అపరిమిత అధికారం ఉన్న రాహుల్‌ గాంధీ స్వయంగా ఈ తాజా పదవీ ప్రమాణానికి హాజరయ్యారు. బీజేపీ అధినాయకుడైన ప్రధాన మంత్రి మోదీ విపక్ష దళిత సీఎంపై అభినందనల వర్షం కురిపించారు. ఎన్నికల క్షేత్రంలో దళిత ఓటర్ల ప్రాముఖ్యాన్ని ఏ పార్టీ విస్మరించదలుచుకోలేదని, ఓట్ల వేటలో కులాల వారీ ప్రేమకథ నడుపుతోందనీ అర్థమవుతోంది.

117 స్థానాల అసెంబ్లీలో 80 సీట్లు గెలిపించి, 2017 నుంచి ఇప్పటి దాకా అన్ని ఎన్నికలలోనూ పార్టీని గెలిపించిన చరిత్ర తాజా మాజీ సీఎం అమరిందర్‌ది. జనంలో పేరున్న నమ్మకస్థుడైన ఈ పార్టీ సైనికుడిని కాదనుకొని, కాంగ్రెస్‌ అధిష్ఠానం సెల్ఫ్‌గోల్‌ చేసుకుంది. రెండు నెలల క్రితం పీసీసీ అధ్యక్షపదవి దక్కించుకున్న సిద్ధూకూ, అమరిందర్‌కూ మధ్య ఆధిపత్య పోరులో చివరకు సిద్ధూదే పైచేయి అయింది. 2019లో పర్యాటక శాఖ మంత్రిగా రాజీనామా చేసినప్పటి నుంచి విమర్శలు, ప్రతివిమర్శలతో వారి మధ్య పోరు బహిరంగ రహస్యం. ఇప్పుడు మరో అయిదు నెలల్లోనే ఎన్నికలు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడానికి అంతకన్నా తక్కువ టైమే ఉంది. వెరసి, పాలనలో తనదైన ముద్ర వేయడానికి కొత్త సీఎం చన్నీకి నిండా 100 రోజులే. అధికారులపై అతిగా ఆధారపడి, ఎమ్మెల్యేలకైనా అందుబాటులో లేకుండా ఫామ్‌హౌస్‌లోనే గడిపారనీ, ఎన్నికల వాగ్దానాలు అనేకం నెరవేర్చలేదనీ అమరిందర్‌పై విమర్శ. పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవాలంటే, ఓటర్లలో ఆ వ్యతిరేకతని తగ్గించాలి. క్యాబినెట్‌లో ఉంటూనే అమరిందర్‌ను విమర్శించిన చన్నీ సీఎం పదవి చేపట్టగానే గ్రామాలలో నీటి, విద్యుత్‌ బిల్లులు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది అందుకే! 

అయితే, 52 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ, ‘‘అవమాన భారంతో’’ నాటకీయంగా సీఎం కుర్చీ వీడారు 79 ఏళ్ళ అమరిందర్‌. పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్‌ జాకఢ్‌ సహా ఇలాంటి సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలతో పోలిస్తే చన్నీ వయసులో చిన్నవాడు. ఎమ్మెల్యేగా, విధాన సభలో ప్రతిపక్ష నేతగా, నిన్నటి దాకా అమరిందర్‌ క్యాబినెట్‌లో మంత్రిగా అనుభవం ఉంది. అదే సమయంలో ఆయనపై కొన్ని వివాదాలూ లేకపోలేదు. అయితే, అమరిందర్‌ స్వతంత్ర ధోరణి రాహుల్‌కు కొంతకాలంగా నచ్చట్లేదు. ప్రియాంకా గాంధీ సైతం సిద్ధూకు అనుకూలంగా నిలిచారు. ఈ పరిస్థితుల్లో సీఎం మార్పుపై అధిష్ఠానం కొద్ది నెలలుగా ఊగిసలాడింది. పరిస్థితులు గమనించినా, అమరిందర్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. చివరకు అధిష్ఠానం అనేకానేక పేర్లు పరిశీలించి, ఏవేవో పేర్లు లీక్‌ చేసి, అనూహ్యంగా చన్నీకి ఓటేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభా పక్షం ఏకగ్రీవంగా ఎన్నుకుందని చెబుతూనే, ఇందిరా గాంధీ నాటి సీల్డు కవర్‌ సంప్రదాయంలో, దళిత కార్డుపై చన్నీకి పట్టం కట్టింది.

దేశంలో మినీ ఎన్నికల పోరాటం మొదలైపోయినట్టు కనిపిస్తోంది. వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల వేడి, దానికి తగ్గట్టే కుల, మత రాజకీయాల జోరు పెరిగాయి. ఎన్నికలు జరగాల్సిన ఉత్తర ప్రదేశ్‌ మొదలు గుజరాత్, పంజాబ్‌ దాకా అన్ని చోట్లా కుల, మత సమీకరణాలే అన్ని పార్టీల వ్యూహాలనూ శాసిస్తున్నాయి. ఇన్నేళ్ళలో తొలిసారిగా పంజాబ్‌లో దళితుడు సీఎం అయ్యారంటే దాని చలవే. అయితే, రానున్న పంజాబ్‌ ఎన్నికలు సిద్ధూ సారథ్యంలోనే జరుగుతాయని కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ హరీశ్‌ రావత్‌ నోరు జారడంతో, ప్రతిపక్ష అకాలీదళ్, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)లు విమర్శించడానికి వీలు చిక్కింది. ‘దళిత సీఎం అనేది ఎన్నికల ముందు చేసిన గిమ్మిక్కు’ అంటూ కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నాయి. మరోపక్క రాజకీయ అపరిపక్వత, పదవీకాంక్ష నిండిన సిద్ధూ ‘జాతి వ్యతిరేకి’ అంటూ స్వయంగా అమరిందరే వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ విపక్షాలకు అవి అంది వచ్చిన అస్త్రాలు. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో పొత్తు అకాలీదళ్‌కు కలిసొచ్చినా రావచ్చు.

దేశం మొత్తం మీద మూడే రాష్ట్రాలలో అధికారంలో మిగిలిన కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్‌లో తాజా మార్పులతో పెను జూదమే ఆడింది. సీఎం మార్పు అనివార్యమనుకున్నా ఆ మార్పు చేసిన విధానమే అంతా కలగాపులగమైంది. ఇక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలోనూ సీఎంలతో ఉన్న చిక్కుల్ని కాంగ్రెస్‌ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. బీజేపీ జయపతాక మోదీ తమ పార్టీ సీఎంలను మార్చినట్టు, విజయాల ట్రాక్‌ రికార్డు లేని రాహుల్‌ అండ్‌ కో చేద్దామనుకుంటే చిక్కే. ఏమైనా ఆరు నెలల క్రితం ఇట్టే గెలుస్తామనుకున్న పంజాబ్‌లో ఆ పార్టీ ఇప్పుడు వెనకబడింది. ఆత్మహనన ధోరణి నిర్ణయాలతో ప్రతిపక్షాలకు సందు ఇచ్చింది. అధికారానికి కొత్త అయిన చన్నీ ఇప్పుడు పార్టీలోని అన్ని వర్గాలనూ సమన్వయం చేసుకుంటూనే, పాలనను గాడిలో పెట్టాలి. 2022 ఎన్నికలలో పార్టీని గెలిపించాలి. అందుకు ఆయన దళిత కార్డు ఒక్కటే సరిపోతుందా? సిద్ధూ సారథ్యంలోనే ఎన్నికలన్న వ్యాఖ్యలను బట్టి చూస్తే, చన్నీ తాత్కాలిక ముఖ్యమంత్రేనా? ఒకవేళ రేపు కాంగ్రెస్‌ మళ్ళీ గెలిస్తే, చన్నీనే సీఎంను చేస్తారా? ఎన్నికల దళిత ప్రేమకథలో ఇప్పటికైతే ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top