ఈ తీర్పు శిరోధార్యం

Sakshi Editorial On Kafeel Khan Case

దేశ భద్రతకు ముప్పుతెచ్చే నేరగాళ్లను అదుపు చేయడానికి తీసుకొచ్చిన చట్టాలు మన దగ్గర దుర్వినియోగమవుతున్నాయని చెప్పడానికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ నిర్బంధం తాజా ఉదాహరణ. ఆయనను జాతీయ భద్రతా చట్టం(నాసా) కింద అరెస్టు చేయడం చెల్లదని, తక్షణం విడుదల చేయాలని అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు పర్యవసానంగా డాక్టర్‌ కఫీల్‌ మంగళవారం నిర్బంధం నుంచి విముక్తులయ్యారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గోవింద్‌ మాథుర్, జస్టిస్‌ సౌమిత్రదయాళ్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. సీఏఏ వ్యతిరేక ఉద్యమకారులను ఉద్దేశించి అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన చేసిన ప్రసంగం ఈ చట్టం ప్రయోగానికి ప్రభుత్వం చెప్పిన కారణం. కానీ ఆయన ప్రసంగంలో ఎంపిక చేసుకున్న కొన్ని భాగాల ఆధారంగా కేసు పెట్టడం కాక మొత్తంగా దాని నిజమైన ఉద్దేశమేమిటో గ్రహించాలని న్యాయమూర్తులు తేల్చిచెప్పారు. అందులో హింసను లేదా విద్వేషాన్ని ప్రోత్సహించే అంశాలేమీ లేవన్నదే వారి మాట. మూడేళ్లక్రితం గోరఖ్‌పూర్‌ ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజెన్‌ సిలెండర్ల కొరత కారణంగా వందలాదిమంది పిల్లలు మృత్యువాత పడినప్పటినుంచి డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ వార్తల్లోకెక్కారు. ఆ ఉదంతం సమయంలో ఆయన చొరవ తీసుకుని దాదాపు 500 సిలెండర్లు లభ్యమయ్యేలా చూడటం వల్ల అనేకమంది పసిపిల్లల ప్రాణాల్ని కాపాడటం సాధ్యమైందని అప్పట్లో ఇతర వైద్యులు చెప్పారు. సిలెండర్లను తీసుకురావడంలో డాక్టర్‌ ఖాన్‌కు తోడ్పడిన సశస్త్ర సీమాబల్‌ సిబ్బంది సైతం ఆ మాటే అన్నారు. ఈ ఉదంతంపై దర్యాప్తు చేసిన స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ విభాగం ముఖ్య కార్యదర్శి హిమాన్షు కుమార్‌ సారథ్యంలోని అధికారుల బృందం కూడా ఆయనకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఆక్సిజెన్‌ సిలెండర్ల నిర్వహణ ఆయనకు సంబంధించింది కాదని... కనుక ఆయన్ను దోషిగా చెప్పడం సాధ్యం కాదని వివరించింది. ఈలోగా డాక్టర్‌ కఫీల్‌ జైలుకెళ్లక తప్పలేదు. 

నేరగాళ్లు కొత్త ఎత్తులు ప్రయోగించినప్పుడు, దేశానికి కొత్త కొత్త రూపాల్లో సవాళ్లు ఎదురవుతున్నప్పుడు వాటిని అరికట్టడానికి సమర్థవంతమైన చట్టం తీసుకురావడం అవసరమే. కానీ ఇతరేతర ఉద్దేశాలతో వాటిని ఇష్టానుసారం ప్రయోగించడం వల్ల అమాయకులు ఇబ్బందుల పాలవుతారు. ఇందిరాగాంధీ హయాంలో 1971లో తీసుకొచ్చిన ఆంతరంగిక భద్రతా(మీసా) చట్టం అత్యవసర పరిస్థితి కాలంలో ఎంతో దుర్వినియోగమైంది. ఇప్పుడు బీజేపీ సీనియర్‌ నేతలుగా వున్నవారెందరో అప్పుడు జనసంఘ్‌ పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూ ఆ చట్టం కోరల్లో చిక్కుకున్నారు. 1977 ఎన్నికల్లో అధికారంలోకొచ్చిన జనతా పార్టీ ఈ అనుభవాలన్నీ గమనించి ఆ చట్టాన్ని రద్దు చేసింది. కానీ మళ్లీ అధికారంలోకొచ్చిన ఇందిరాగాంధీ 1980లో మీసాను మించిన కఠిన నిబంధనలతో తెచ్చిన చట్టమే జాతీయ భద్రతా చట్టం. ఎలాంటి కారణం చూపకుండా 12 నెలలపాటు పౌరులను నిర్బంధించడానికి వీలు కల్పించే ఈ చట్టంపై కూడా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. అది దుర్వినియోగమవుతున్నదని ఆరోపణలు వచ్చాయి. ఈ చట్టం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పినా... ఎవరినైనా ఆ చట్టం కింద అక్రమంగా నిర్బంధించారని భావించినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటున్నాయి. కానీ ఈలోగా ఆ చట్టం కోరల్లో చిక్కుకున్నవారు తమ తప్పేమీ లేకుండా అకారణంగా జైళ్లలో గడపవలసి వస్తున్నది. ఇప్పుడు డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ కేసు కూడా అటువంటిదే. మొన్న ఫిబ్రవరిలో అరెస్టయ్యాక ఆయన నిర్బంధాన్ని రెండుసార్లు పొడిగించారు. అక్రమ నిర్బంధాల వల్ల కఫీల్‌ ఖాన్‌ వంటివారు, వారి కుటుంబసభ్యులు వ్యక్తిగతంగా ఇబ్బందులు పడతారు. కానీ ప్రభుత్వాలకు, సమాజానికి జరిగే నష్టం అంతకన్నా ఎక్కువే. ప్రభుత్వాల శక్తియుక్తులన్నీ ఇలా అనవసరమైన కేసుల్లో వృథా చేయడం వల్ల సమాజానికి ముప్పుగా పరిణమించే అవకాశమున్న నిజమైన నేరగాళ్లు తప్పించుకునే అవకాశం వుంది. ఇదే ఉత్తరప్రదేశ్‌లో మొన్న జూలైలో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించిన వికాస్‌ దుబే ఉదంతమే అందుకు ఉదాహరణ. ఒక నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకుని, తనకు అడ్డొస్తారని అనుమానం వచ్చినవారిని హత్యలు చేస్తూ ఎదిగిన మాఫియా డాన్‌ దుబే డీఎస్‌పీ, ముగ్గురు ఎస్‌ఐలు సహా ఎనిమిదిమంది పోలీసుల ప్రాణాలు తీశాడు. పోలీసులనే కాదు... 2001లో ఇతగాడు ఏకంగా రాష్ట్ర మంత్రిని నడిరోడ్డుపై దారుణంగా కొట్టి ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల ఎదుటే ఆయన్ను కాల్చిచంపాడు. 

జాతీయ భద్రతా చట్టమైనా, మరే ఇతర ముందస్తు నిర్బంధానికి సంబంధించిన చట్టమైనా ప్రయోగించడం సరైందా కాదా అన్నది న్యాయస్థానాలు చూడాలని 2011లో తమిళనాడుకు చెందిన ఒక కేసులో సుప్రీంకోర్టు సూచించింది. లేనట్టయితే వ్యక్తి స్వేచ్ఛకు ముప్పు కలిగే ప్రమాద మున్నదని హెచ్చరించింది. ముందస్తు నిర్బంధాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలైనప్పుడు న్యాయస్థానాలు అన్ని కోణాలను పరిశీలించాలని, సాధారణ చట్టాలతో సరిపెట్టవలసి వచ్చిన సందర్భాల్లో కూడా ఈ కఠినమైన చట్టాలు ప్రయోగించినట్టు భావిస్తే బాధితులకు విముక్తి కలిగించాలని న్యాయస్థానాలకు సూచించింది. వ్యక్తి స్వేచ్ఛను ఎంతో పవిత్రంగా భావించే రాజ్యాంగంలోని 21వ అధికరణ ఉల్లంఘన కాకూడదని హితవు పలికింది. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో కేవలం యుద్ధ సమయాల్లో మాత్రమే ఇటువంటి ముందస్తు నిర్బంధ చట్టాలు అమల్లోవుంటాయి. మన దేశంలో నాసా చట్టం ఒక్కటే కాదు... ఇప్పుడు సుధా భరద్వాజ్, వరవరరావు వంటివారిని నిర్బంధించిన యూఏపీఏ చట్టం కూడా అత్యంత కఠినమైనదే. నిర్బంధ చట్టాల ప్రయోగంలో ప్రభుత్వాలు అత్యంత జాగురూకతతో మెలగాలన్నది డాక్టర్‌ కఫీల్‌ కేసులో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు సారాంశం. యోగి ప్రభుత్వం దీన్ని గమనించాలి.  

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top