ఈ మాటలు మంచివే!

Sakshi Editorial On Indo American Trade Deal

ఈసారి అమెరికాలో అక్కడి రిటైల్‌ షాపుల్లో మన ఊరి మామిడి పండ్లు, ద్రాక్షలు, దానిమ్మలు కనిపిస్తే ఆశ్చర్యపోకండి. అలాగే మరికొద్ది రోజుల్లో మన వీధి చివరి సూపర్‌ బజార్‌లోనే అమెరికన్‌ ఛెర్రీలు, పంది మాంసం ఉత్పత్తులు దొరికితే అబ్బురపడకండి. అక్షరాలా అది అంతా భారత – అమెరికాల మధ్య కుదిరిన తాజా వాణిజ్య అంగీకార ఫలితమే! వాణిజ్యంలో కొన్నేళ్ళుగా భారత్‌ పట్ల అపనమ్మకంతో నడిచిన అమెరికా, ఎట్టకేలకు కొన్ని నియమాలను సడలించడానికి మంగళవారం అంగీకరించడంతో ఈ దృశ్యం ఆవిష్కృతం కానుంది.

నాలుగేళ్ళ తరువాత జరిగిన ఇరుదేశాల ‘వాణిజ్య విధాన వేదిక’ (టీపీఎఫ్‌) తొలి పునఃసమావేశం ఈ కీలక ఘట్టానికి వేదిక అయింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్టీఆర్‌) క్యాథరిన్‌ తాయ్‌ జరిపిన రెండు రోజుల ఢిల్లీ పర్యటన భారత్, అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాల్లో పాత అనుమానాలకు తెర దించి, కొత్త తలుపులు తీసింది. 

వచ్చే ఏడాది మధ్యనాటి కల్లా పరస్పర వాణిజ్య సంబంధాల్లోని చిక్కుముడులను తొలగించుకోవడమే లక్ష్యమని టీపీఎఫ్‌ వేదికపై ఇరుదేశాలూ అంగీకరించడం శుభసూచకం. దీనితో, కీలకమైన వ్యవసాయ, వ్యవసాయేతర వస్తువులు, సేవలు, పెట్టుబడులు, మేధాసంపత్తి హక్కులు సహా వివిధ అంశాల్లో ప్రయాణం సాఫీ కానుంది. ఈ 5 ప్రధాన అంశాలపై ఏర్పాటు చేసిన వర్కింగ్‌ గ్రూపులు తరచూ సమావేశమై, అందుకు కార్యాచరణను సిద్ధం చేయనున్నాయి. వచ్చే ఏడాది మధ్యలో మరోసారి జరిగే టీపీఎఫ్‌ మధ్యంతర సమావేశానికి నిర్దిష్ట వాణిజ్య ఫలితాలను ఖరారు చేయనున్నాయి. 

ఇప్పుడు భారతదేశపు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఏడాది 10 వేల కోట్ల డాలర్ల మార్కును దాటుతుందని అంచనా. చైనాను వెనక్కినెట్టి, అమెరికా ఆ స్థానానికి వచ్చిన పరిస్థితుల్లో టీపీఎఫ్‌ పునరావిష్కృతం కావడం విశేషం. భారత్‌తో ఏదో తాత్కాలికంగా ఓ మినీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని తాము భావించట్లేదని అమెరికా ముందే స్పష్టం చేసింది. దాంతో, టీపీఎఫ్‌ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌కు అతి పెద్ద ఎగుమతుల విపణి కూడా అమెరికాయే. గడచిన 2020–21లో మన దేశం నుంచి 5.2 వేల కోట్ల డాలర్ల విలువ గల ఎగుమతులు ఆ దేశానికి వెళ్ళాయి.

గతంలో డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో అమెరికా, భారత్‌కు ‘ప్రాధాన్యాల సాధారణీకరణ వ్యవస్థ’ (జీఎస్పీ)ని ఉపసంహరించుకుంది. వర్ధమాన దేశాలకు అమెరికా ఇచ్చే ప్రత్యేక వాణిజ్య హోదా అది. ఆ జీఎస్పీ వల్ల వివిధ ఉత్పత్తుల విషయంలో ట్యారిఫ్‌ తగ్గింపు దక్కుతుంది. ఆ హోదా ఉండడంతో 2018లో అమెరికా నుంచి భారత్‌ అత్యధికంగా లబ్ధి పొందింది. 2019లో ట్రంప్‌ సర్కారు ఎత్తేసిన ఆ హోదాను మళ్ళీ అందించాలంటూ ప్రపంచ పెద్దన్నను భారత్‌ తాజాగా అభ్యర్థించింది.

ఆ అభ్యర్థనను పరిశీలిస్తామని అగ్రరాజ్యం పేర్కొనడం తాజా భేటీలోని మరో శుభ సూచన. అలాగే, రెండు దేశాలలోని ఐటీ ఉద్యోగులు తమ తప్పనిసరి సోషల్‌ సెక్యూరిటీ చందాలను స్వదేశానికి తరలించుకొనేందుకు వీలిచ్చే ఒప్పందం ఇప్పటికి పదేళ్ళ పైగా పెండింగ్‌లో ఉంది. ఆ ఒప్పందం సాధ్యమైతే, భారతీయ ఐటీ ఉద్యోగులు వందల కోట్ల డాలర్ల పదవీ విరమణ నిధులు స్వదేశానికి వచ్చే వీలుంటుంది. దానిపైనా ఇప్పుడు మళ్ళీ చర్చలు మొదలు కానున్నాయి. 

పటిష్ఠమైన ద్వైపాక్షిక వాణిజ్య బంధాలు, మెరుగైన ఆర్థిక సంబంధాల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయనీ, రెండు దేశాల్లోని శ్రామిక జనానికి మేలవుతుందనీ భారత, అమెరికాలు గుర్తించాయి. అందుకే, డిజిటల్‌ వాణిజ్యం, వ్యవసాయం, మెరుగైన నియంత్రణ విధానాలు, ప్రమాణాల లాంటి ప్రధాన అంశాల్లో సహకారం అందించుకొనేందుకు కృషి చేయనున్నాయి.

అలాగే, రెండు దేశాల మధ్య నిర్దిష్టమైన విపణి అందుబాటు సమస్యలు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిని పరస్పరం పరిష్కరించుకోవడం వల్ల ఇటు భారతీయ రైతులకూ, అటు అమెరికన్‌ రైతులకూ, అలాగే వ్యాపార సంస్థలకూ స్పష్టమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఆ సంగతి కూడా తాజా భేటీలో రెండు దేశాల మంత్రులూ అంగీకరించారు. 

వచ్చే వారమే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సభ్యదేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ తాజా భేటీ కొత్త ఆశలు రేపింది. రెండు దేశాల మధ్య అపరిష్కృత డబ్ల్యూటీఓ వివాదాలకూ పరిష్కారాలు కనుగొనాలని నిర్ణయించారు. అలాగే, సైబర్‌ ప్రపంచం, సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధ (ఏఐ), 5జీ, 6జీ, అత్యాధునిక టెలికమ్యూనికేషన్స్‌ టెక్నాలజీలలో చైనా సంస్థలతో కొంత అసౌకర్యం అనిపిస్తుండడంతో... వాటిపై పరస్పర భావవినిమయం చేసుకోవాలని భారత్‌ – అమెరికా భావిస్తున్నాయి. వర్తమాన పరిస్థితుల్లో ఇవన్నీ కీలకమైన అంశాలే. 

అందుకే, భవిష్యత్‌ ఫలితాల మాటెలా ఉన్నా, అసలంటూ సమస్యను గుర్తించి, పరిష్కారానికి నడుం బిగించడం వరకు అమెరికా, భారత్‌ వాణిజ్య సంబంధాల భేటీ విజయం సాధించింది. నాలుగేళ్ళుగా పాదుకున్న ప్రతిష్టంభనను తొలగించింది. ట్యారిఫ్‌లపై అటు ట్రంప్‌ చర్యలు, ఇటు భారత పాలకుల ప్రతిచర్యలతో అప్పట్లో బిగుసుకున్న వాణిజ్య సంబంధాలు, ఒప్పందాలు బైడెన్‌ కాలంలో తేలికపడితే మంచిదే! కరోనా అనంతర వేళ కీలక సరఫరాల కోసం చైనాపై అతిగా ఆధారపడక, భారత్‌ను కీలక భాగస్వామిని చేసుకోవాలన్న అగ్రరాజ్యపు ఆలోచన మనకు ఇప్పుడు కలిసొచ్చేదే! అమెరికా సర్కారు నుంచి పలువురి వరుస పర్యటనల్ని సద్వినియోగం చేసుకోవాల్సింది మనమే!  

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top