కూటమిలో అనైక్యతా రాగం | Sakshi
Sakshi News home page

కూటమిలో అనైక్యతా రాగం

Published Fri, Jan 5 2024 4:12 AM

Sakshi Editorial On Indian National Developmental Inclusive Alliance

ఎన్నికల సంవత్సరంలోకి వచ్చేశాం. కొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటికే రామమందిరం సహా రకరకాల వ్యూహాలతో జనంలోకి దూసుకుపోతోంది. మరి, బలమైన అధికార పక్షాన్ని ఢీ కొట్టాల్సిన ప్రతిపక్షాల మాటేంటి? అవి ఇప్పటికీ అయోమయంలో ఉన్నట్టున్నాయి. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోని భాగస్వామ్య పార్టీలు పేరుకు ఒకే సమూహంగా ఉన్నా, అనేక అంశాల్లో అవి ఒక్క తాటి మీదకు రాలేకపోతున్న దుఃస్థితి కళ్ళకు కడుతోంది. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక, ఎవరెక్కడ పోటీ చేయాలి, సీట్ల సర్దుబాటేంటి తదితర అంశాలు దేవుడెరుగు, కనీసం ఈ కూటమికి ఎవరు కన్వీనర్‌గా ఉండాలనే అంశంలోనూ ఏకాభిప్రాయం కొరవడింది. ఈ వార్తలు కూటమి బలహీనతలను బట్టబయలు చేస్తున్నాయి. బిహార్‌లో జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ను దింపి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను సీఎంను చేసేందుకు ఇటీవల జరిగిన విఫల యత్నం ‘ఇండియా’ కూటమి పక్షాలు సొంత కాళ్ళు నరుక్కొనే మూర్ఖత్వమే!

ప్రాధాన్యం తగ్గుతోందని భావిస్తున్న బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ను విపక్ష ‘ఇండియా’ కూటమి కన్వీనర్‌ను చేసి, బుజ్జగించాలన్నది తాజా ప్రతిపాదన. అయితే, అందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) సహా కొన్నిపక్షాలు ప్రతికూలం. ఈ అంశంపై కూటమి పక్షాల మధ్య గురువారం జరగా ల్సిన వర్చ్యువల్‌ సమావేశం సైతం ఆఖరి నిమిషంలో రద్దయింది అందుకే. ఇక, కూటమిలోని రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ల మధ్య ఢిల్లీ, పంజాబ్‌లలో సీట్ల సర్దు బాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.

మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే) వర్గంతో, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీతో కూడా సరిగ్గా ఇదే పంచాయతీ కాంగ్రెస్‌కు నడుస్తోంది. అలాగే, బీజేపీతో రాజకీయ రంగు పులుముకుంటున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్ళాలా, వద్దా అనే అంశంపైనా నిశ్చితాభిప్రాయం మృగ్యం. వెరసి, కూటమి పార్టీల మ«ధ్య పరస్పర విరుద్ధ ప్రయో జనాలు, సమన్వయ లోపాలు ఎన్నికలు సమీపిస్తున్నా జవాబు లేని ప్రశ్నలుగానే మిగిలాయి. 

2024 ఎన్నికల్లో మోదీని గద్దె దించాలనే లక్ష్యంతో ఈ పార్టీలన్నీ ఒక దగ్గరకు చేరాయి. కాంగ్రెస్‌ చొరవతో విస్తృత చర్చల తర్వాత గత జూలై 18న 26 పార్టీల కూటమిగా ‘ఇండియా’ ఆవిర్భవించింది. 80 మంది ఎంపీలున్న కాంగ్రెస్‌ ప్రాథమికంగా పెద్దన్న పాత్ర పోషిస్తుంటే, ఆ పార్టీకి వివిధ రాష్ట్రాల్లో ప్రత్యర్థులైన ఆప్, టీఎంసీ, వామపక్షాలు సైతం కూటమిలో ఉన్నాయి. ఈ బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ముందు గత ఫిబ్రవరి, మే నెలల్లో 3 రాష్ట్రాల్లో (త్రిపుర, మేఘాలయ, కర్ణాటక) ఎన్నికలు జరిగాయి.

కూటమి ఏర్పడ్డాక నవంబర్‌లో 5 రాష్ట్రాలు (తెలంగాణ, మిజోరమ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌) ప్రజాతీర్పు కోరాయి. రెండుసార్లూ ప్రతిపక్షాలు ఉమ్మడి ప్రత్యర్థి బీజేపీతో పాటు, తమలో తాము ఢీకొన్న పరిస్థితి. కూటమి ఉన్నా కాంగ్రెస్‌ ఒంటరిగా బరిలోకి దిగింది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ గఢ్‌లలో కాంగ్రెస్, తన కూటమి పక్షాలైన ఎస్పీ, జేడీయూలతోనూ పోటీ పడింది. ఫలితంగా మిశ్రమ ఫలితాలే దక్కాయి. 

దేశంలో తూర్పు నుంచి పడమటి వరకు రాహుల్‌ గాంధీ చేయనున్న సరికొత్త ‘భారత్‌ న్యాయ యాత్ర’ ఈ జనవరి ప్రథమార్ధం లోనే ఆరంభం కానుంది. ఎన్నికల ముందు ప్రతిపక్షాల బలప్రదర్శనకు ఈ యాత్రను అనువుగా మలుచుకోవాలని కాంగ్రెస్‌ భావన. కూటమి సభ్యుల మధ్య సీట్ల పంపిణీ ఫార్ములాకు తుది రూపం ఇవ్వాలని ఆ పార్టీ అస్తుబిస్తు అవుతోంది. లోక్‌సభలో ఎన్నికలు జరిగే 543 స్థానాల్లో 290 సీట్లలో స్వయంగా పోటీ చేయాలని కాంగ్రెస్‌ యోచన. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు చేసుకోవాలనీ, వీలైనచోటల్లా బీజేపీ సారథ్య ఎన్డీఏ అభ్యర్థికీ – తమ అభ్యర్థికీ మధ్య ముఖాముఖి పోరు జరిగేలా చూడాలని ‘ఇండియా’ ప్రయత్నం.

అయితే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, రాహుల్‌తో ఎంత స్నేహంగా ఉన్నా సీట్ల సర్దుబాటులో నిక్కచ్చిగానే నిలబడతారు. పశ్చిమ బెంగాల్‌లో హస్తం పార్టీ క్రితంసారి గెలిచిన 2 స్థానాలు తప్ప, ఇంకేమీ ఇవ్వబోమన్నది టీఎంసీ ప్రతిపాదన. ఆ ‘భిక్ష’ అవసరం లేదనీ, మోదీకి అనుకూలంగా మమత పని చేస్తున్నారనీ అయిదు సార్లు ఎంపీగా ఎన్నికైన పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్‌ అధినేత అధిర్‌ రంజన్‌ చౌధురి వ్యాఖ్య. స్థానిక అనివార్యతల రీత్యా రానున్న రోజుల్లో ‘ఇండియా’ కూటమిలో ఇలాంటి అపరిణత వ్యాఖ్యలు, పరస్పర దూషణలు మరిన్ని వినిపిస్తాయి. 

ఐక్యత లేకపోవడం, ఈ అంతర్గత కుమ్ములాటలు కూటమిని బలహీనం చేస్తున్నాయి. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్, టీఎంసీల మధ్య పోరు బీజేపీకే లాభించింది. రేపు లోక్‌సభ ఎన్ని కల్లోనైనా కూటమి పక్షాల మధ్య సర్దుబాటు, సమన్వయం సవ్యంగా సాగుతుందా అన్నది అనుమానమే. నిజానికి, విజయవంతమైన రాహుల్‌ ‘భారత్‌ జోడో యాత్ర’ మొదలు మోదీపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం, పార్లమెంట్‌లో మూకుమ్మడి సస్పెన్షన్ల దాకా ప్రతిపక్షాలు గత ఏడాది వార్తల్లో నిలిచాయి. కానీ, కేవలం వార్తల్లో ఉంటే సరిపోదు.

బీజేపీపై పోరాటం, మోదీని గద్దె దించడమే ఏకైక అజెండా అయితే అదీ జనానికి రుచించదు. కూటమికి లాభించదు. అందుకని, ఇప్పటికైనా ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు మార్గాలేమిటో ‘ఇండియా’ కూటమి పర్యాలోచించాలి. గమ్యానికి తగ్గట్టు గమనం ఉండాలన్నది విస్మరించి, భాగస్వామ్య పక్షాలు అభిప్రాయ భేదాలను కొనసాగిస్తే కష్టం. పిట్ట పోరు పిట్ట పోరు... పిల్లి తీర్చినట్టు అధికార బీజేపీకే కలిసొస్తుంది. ఏ పార్టీకి ఆ పార్టీ తనవైన లెక్కలు వేసుకొనే ఎన్నికల ముంగిట దాన్ని నివారించడం ‘ఇండియా’ కూటమికి పెను సవాలు. కలవని రైలు పట్టాల లాగే స్నేహంతో ప్రతిపక్షాలకు ఒరిగేదేమిటి? 

Advertisement
 
Advertisement
 
Advertisement