వలసపోయిన మందహాసం

Sakshi Editorial On Congress Party INDIA Alliance

పురుటిలోనే సంధి కొట్టింది. కేంద్రంలోని అధికార ఎన్డీఏకి వ్యతిరేకంగా జట్టుకట్టిన ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి పరిస్థితి ఒక్క మాటలో అదే. ఏడాదైనా కాక ముందే... ఎన్నికలు మరో రెండు నెలల దూరమైనా లేక ముందే... ఆ కూటమి అంతర్గత కుమ్ములాటలతో చతికిలపడిన పరిస్థితి. బిహార్‌ నుంచి మహారాష్ట్ర దాకా కూటమి నుంచి వలసపోతున్న నేతలు, సీట్ల పంపిణీ సమస్యలతో ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్న పార్టీలను చూస్తుంటే ఆ మాట అక్షరసత్యమని అర్థమవుతోంది. కొద్ది వారాల క్రితం బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ‘ఇండియా’ కూటమికి గుడ్‌బై చెప్పి, ఎన్డీఏ గూటికి తిరిగొచ్చారు.

కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి, సోమవారం అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో కూడా నెగ్గారు. బిహార్‌లోనే కాదు... మహారాష్ట్రలోనూ ‘ఇండియా’ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మాజీ ఎంపీ మిళింద్‌ దేవరా గత నెలలో గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీని వదిలేసి, శివసేనలో చేరారు. అది జరిగిన కొద్ది వారాలకే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ చవాన్‌ హస్తాన్ని విడిచిపెట్టి, కమలం చేత ధరించారు. ఇలా సొంత కూటమిలోనే సవాలక్ష తలనొప్పులతో ఎన్నికలు రాకముందే బలహీనమైపోయింది. ఎన్డీఏకు సరైన ప్రత్యామ్నాయం తామేనంటూ చెప్పిన మాటలు రోజు రోజుకూ నీరుగారుతున్నాయి. 

ఈ దుఃస్థితికి కారణం ‘ఇండియా’ కూటమి పక్షాల స్వయంకృతం కొంతయితే, భారతరత్న పురస్కారాలు – ఈడీ – సీబీఐ లాంటి సామ దాన భేద దండోపాయాలతో పరవారిని కూడా తమ వారిని చేసుకొనేలా బీజేపీ నడుపుతున్న చాణక్య తంత్రం మరికొంత. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీ కండువాలు మార్చే సీజన్‌ ప్రబలుతోంది. అధికారం, ఎన్నికల్లో విజయాలే పరమావధిగా ఒకప్పటి ‘ఆయా రామ్, గయా రామ్‌’ సంస్కృతిని బీజేపీయే మళ్ళీ యథేచ్ఛగా పెంచిపోషిస్తోందనే విమర్శ బలంగానే వినిపిస్తోంది. గమ్మత్తేమిటంటే, కీలక నేతలే కాదు... కూటములు మారుస్తున్న పార్టీలదీ అదే సంస్కృతి, అదే సరళి.

నిరుడు బీజేపీని అడ్డమైన మాటలూ అని బయటకు వెళ్ళిన నితీశ్, ఆయన జేడీయూ ఇవాళ మళ్ళీ అదే కమలం పార్టీ చంకనెక్కారు. కొత్త కూటమితో మళ్ళీ సీఎం సీటులో కూర్చున్నారు. మహారాష్ట్ర సీఎం సహా అనేక ఉన్నత పదవులను అనుభవించిన అశోక్‌ చవాన్‌  38 ఏళ్ళ కాంగ్రెస్‌ సాహచర్యాన్ని వదులుకొని, కమలనాథుల పంచన చేరారు. అవినీతి ఆరో పణల్ని ఎదుర్కొంటున్న ఆయన తీరా కాషాయ వస్త్రం కప్పుకొన్న మరునాడే రాజ్యసభ అభ్యర్థి కాగ లిగారు. ఎవరెప్పుడు ఎటుంటారో, తిరిగి వదిలొచ్చిన పార్టీలోకే వెళతారో తెలియకపోవడంతో ఇప్పుడు ‘ఆయా రామ్‌... గయా రామ్‌... మళ్ళీ ఆయేగా రామ్‌’ అనేది తాజా ఛలోక్తి అయింది.  

నిజానిజాలేమో కానీ, మధ్యప్రదేశ్‌లో మరో మాజీ సీఎం సైతం కాంగ్రెస్‌ గూడ్స్‌ బండి దిగిపోయి, బీజేపీ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కుతారని వార్త. వ్యక్తులు వెళ్ళిపోయినా, వ్యవస్థలు శాశ్వతమనే మాట నిజమే. కానీ, కాంగ్రెస్‌ అధినాయకత్వం కానీ, ‘ఇండియా’ కూటమి కానీ ముందున్న సవాళ్ళపై లోతుగా ఆలోచిస్తున్నాయా అన్నది ప్రశ్న. పార్టీని విడిచిపెట్టిపోయే ముందు రోజు సైతం అశోక్‌ చవాన్‌ రానున్న లోక్‌సభ ఎన్నికలకు పార్టీ వ్యూహాన్ని ఖరారు చేసే కీలక సమావేశంలో ఉన్నారంటే, చుట్టుపక్కల ఏం జరుగుతోందో పార్టీ చూడలేకపోతోందని అనుకోవాలా? ఒకపక్క బీజేపీ కొత్త కూటములు కట్టడంలో, పాత దోస్తీలు వదిలించుకోవడంలో చాలా చులాగ్గా వ్యవహ రిస్తోంది.

కాంగ్రెస్‌ మాత్రం కనీసం ఎన్నికల్లో పోటీకి సీట్ల పంపిణీలో సైతం అడుగులు ముందుకు వేయలేకపోవడం విచిత్రం. గడచిన పక్షం రోజుల్లో పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ కానీ, పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్‌ కానీ ఏకపక్షంగా తామే అన్ని సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారంటే ఏమనాలి? చివరకు ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఒకే ఒక్క సీటు మాత్రం ఇస్తామనే స్థాయికి తెగించిందంటే ‘ఇండియా’ కూటమిలో సయోధ్య ఏమున్నట్టు?

పార్టీల మధ్య వలసలు వెక్కిరిస్తుంటే, మరోపక్క ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన చర్చలు కరవై, చట్టసభలు సైతం గౌరవం కోల్పోవడం మరో విషాదం. 1990 తర్వాత పార్లమెంట్‌ పనితీరు నానాటికీ తీసికట్టు నాగంభొట్లుగా మారింది. ఇటీవలే ఆఖరుసారి సమావేశమైన ప్రస్తుత 17వ లోక్‌సభలో అసలు డిప్యూటీ స్పీకర్‌ నియామకమే జరగలేదు. సాంప్రదాయికంగా ప్రతిపక్షాలకు కేటాయించాల్సిన డిప్యూటీ స్పీకర్‌ పదవి అనేదే భర్తీ కాకుండా అయిదేళ్ళు గడిచిపోవడం పార్లమెంటరీ చరిత్రలో ఇదే తొలిసారి.

అలాగే, ప్రతిపక్ష ఎంపీలలో 70 శాతానికి పైగా సస్పెన్షన్‌లో ఉండగా కీలకమైన నేర సంస్కరణల చట్టాల లాంటివి ఆమోదం పొందాయి. ఒకే ఒక్క ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇవ్వడం తప్ప, ఏ ప్రశ్నకూ ప్రధాని మౌఖికంగా జవాబివ్వని లోక్‌సభా ఇదే. గద్దె మీది పార్టీలతో సంబంధం లేకుండా గత 30 ఏళ్ళుగా పెరిగిన ధోరణికి ఇది తార్కాణం. 

ఈ పరిస్థితులకు ఎవరిని తప్పుబట్టాలో, ప్రజలు ఏ పార్టీ వైపు ఆశగా ఎదురుచూడాలో తెలియని పరిస్థితి. మోదీ తరహా రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ‘ఇండియా’ కూటమి వైపు చూడవచ్చని కొందరు ఆశపడ్డా, ఇప్పుడదీ అంతంత మాత్రమేననే భావన కలుగుతోంది. నిజాలు ఏమైనా, అయోధ్య, అబూధాబీల్లో ఆలయాలతో అధికసంఖ్యాకుల్లో అనుభూతిపరంగా మార్కులు కొట్టేస్తున్న మోదీతో పోటీపడాలంటే ప్రతిపక్ష కూటమి ఇకనైనా కళ్ళు తెరవాలి.

బలమైన ప్రత్యర్థిని ఢీ కొట్టాలంటే, ఎంత మంచిదైనా ఆఖరి నిమిషపు ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’లు చాలవని రాహుల్‌ గాంధీ లాంటివారు గ్రహించాలి. కూటమిలో ఐక్యత కావాల్సిన కీలక క్షణాల్లో, నిర్ణయాలు తాత్సారం చేస్తే ఫలితాలు చేదుగా ఉంటాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, త్వరపడి తగు చర్యలు తీసుకోకపోతే... ‘ఇండియా’ కూటమి ఎన్నికల్లో పోటీకి ముందే చేతులెత్తేయాల్సి వస్తుంది. 

whatsapp channel

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top