రైతు ధర్మాగ్రహ విజయం

Sakshi Editorial On Announcing An End To Their Over A Year Long Agitation The Samyukt Kisan Morcha

దాదాపు 15 నెలల సుదీర్ఘకాలం... 700 మందికి పైగా రైతుల ప్రాణత్యాగం... ఎండనకా వాననకా, ఆకలిదప్పులను భరిస్తూ వేలాది రైతులు చూపిన ధర్మాగ్రహం... వృథా పోలేదు. రైతుల డిమాండ్లను అంగీకరిస్తూ, కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి అధికారిక లేఖ రూపంలో లిఖితపూర్వక హామీ దక్కింది. దాంతో, 3 నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ, కనీస మద్దతు ధరకు చట్టపరమైన గ్యారెంటీ ఇవ్వాలంటూ ఇన్ని నెలలుగా చేస్తున్న ఆందోళనను విరమిస్తున్నట్టు 40కి పైగా రైతు సంఘాలకు సారథ్యం వహిస్తున్న ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ (ఎస్‌కేఎం) గురువారం ప్రకటించింది. అయితే, ‘ఆందోళనను విరమిస్తున్నామే తప్ప, ఉద్యమాన్ని విరమించడం లేదు. రైతు హక్కుల కోసం పోరు కొనసాగుతుంది’ అనడం గమనార్హం. జనవరి 15 దాకా గడువు పెట్టిన రైతులు, అప్పుడు ప్రభుత్వ హామీల పురోగతిని సమీక్షించి, కార్యాచరణ నిర్ణయించనున్నది అందుకే!

ఏడాది పైగా ఇల్లూ వాకిలీ వదిలేసి, దేశ రాజధాని సరిహద్దుల్లో గుడారాలు వేసుకొని ఉంటున్న రైతులు ఈ 11న విజయోత్సవ ర్యాలీతో స్వస్థలాలకు పయనం ప్రారంభిస్తారు. అయితే, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై చట్టం లాంటి అన్నదాతల ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేరనే లేదు. రైతుల మొక్కవోని దీక్ష, ముంచుకొస్తున్న పంజాబ్‌ – యూపీ ఎన్నికలు... కారణం ఏమైతేనేం కేంద్రం తలొగ్గి, చటుక్కున రూటు మార్చి, వివాదాస్పద రైతు చట్టాలను ఉపసంహరించుకోవడం కనివిని ఎరుగని కథ. గురుపూర్ణిమ వేళ నవంబర్‌ 19న సాక్షాత్తూ ప్రధాని మోదీ రైతులకు టీవీలో క్షమాపణలూ చెప్పారు. అయితే, సాగు చట్టాల రద్దు తమ అనేక డిమాండ్లలో ఒకటి మాత్రమేనంటూ నిరసనను విరమించడానికి రైతులు ససేమిరా అన్నారు. ఆరు డిమాండ్లను ఏకరవు పెడుతూ ఎస్‌కేఎం నవంబర్‌ 21న ప్రధానికి లేఖ రాసింది. దానికి ప్రతిగా ఎస్‌కేఎంకు చెందిన అయిదుగురు సభ్యుల కమిటీకి కేంద్రం తన ముసాయిదా ప్రతిపాదనను బుధవారం పంపింది. రైతు సంఘాలు కోరిన మార్పులు చేర్పులతో గురువారం కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి లేఖ రూపంలో హామీ రావడంతో ఇప్పటికి రైతుల ఆందోళనకు తాత్కాలికంగా తెర పడింది. 

సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌ సహా దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన మొదలుపెట్టిన సరిగ్గా 380వ రోజున రైతులు ఇంటి దారి పట్టనున్నారు. వెనక్కి తిరిగి చూస్తే, కోవిడ్‌ ఫస్ట్‌ వేవ్‌ లాక్‌డౌన్‌ తర్వాత 2020 జూన్‌లో 3 వివాదాస్పద వ్యవసాయ మార్కెటింగ్‌ చట్టాలను సర్కారు పార్లమెంట్‌లో పాస్‌ చేసింది. వాటిని వ్యతిరేకిస్తూ, పంజాబ్‌ గ్రామాల్లో చెదురుమదురుగా మొదలైన నిరసనలు క్రమంగా వేడెక్కి, పొరుగున ఉన్న హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌ సహా దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించాయి. గత ఏడాది నవంబర్‌ 25న వేలాది రైతులు ఢిల్లీకి ప్రదర్శనగా రావడం, వారిని అనుమతించక పోవడంతో రాజధాని ప్రధాన ప్రవేశమార్గాలను ఆందోళనకారులు అడ్డగించడం కనివిని ఎరుగని చరిత్ర. రాజధాని వెలుపలే గుడారాలు వేసుకొని, నిరసన చేస్తున్న రైతు సంఘాల వారితో కేంద్రం 11 విడతల చర్చలు జరిపి, చట్టాల్లో మార్పులు చేస్తామంది. కానీ, చట్టాల రద్దు ఒక్కటే తమకు సమ్మతమని పట్టుబట్టి, రైతులు అనుకున్నది సాధించారు.

నిజానికి, ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేళ రైతు ఆందోళనకారుల ర్యాలీలో పోలీసులతో హింసాకాండ చెలరేగింది. రైతు నిరసన దోవ తప్పినట్టు అనిపించింది. ఆ పైన భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయత్‌ను బలవంతాన ఖాళీ చేయించడం లాంటి వాటితో మళ్ళీ ఉద్యమం ఊపందుకుంది. క్రమంగా నిరసనల కేంద్రం పంజాబ్, హర్యానాల నుంచి పశ్చిమ యూపీకి మారింది. ఒక దశలో సుప్రీమ్‌ కోర్టు సైతం జోక్యం చేసుకొని, సాగు చట్టాలపై ఉన్నత స్థాయి నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాల్సి వచ్చింది. తీరా ఆ సంఘం సుప్రీమ్‌కు సమర్పించిన నివేదిక ఇప్పటికీ వెలుగు చూడలేదన్నది వేరే కథ. 

ఆ మాటకొస్తే సాగు చట్టాలు చేస్తున్నప్పుడు కానీ, వాటిని నవంబర్‌ 29న రద్దు చేస్తున్నప్పుడు కానీ పార్లమెంటులో చర్చ లేకుండా మెజారిటీతో నోరు నొక్కేశారనే అప్రతిష్ఠ మోదీ సర్కారు మూటగట్టుకుంది. చనిపోయిన రైతులకు నష్టపరిహారం మాటెత్తితే, మృతుల వివరాలు మా దగ్గర ఉండవంటూ మళ్ళీ విమర్శల పాలైంది. చివరకిప్పుడు– ఎంఎస్‌పీపై వేసే సంఘంలో ఎస్‌కేఎం నేతలకూ చోటిస్తామనీ, రైతులందరిపైనా కేసులు ఎత్తి వేసేలా చూస్తామనీ, విద్యుత్‌ సవరణ బిల్లులోని సెక్షన్లలో రైతు నేతలను సంప్రదించి మార్పులు చేస్తామనీ కేంద్రం హామీలు ఇవ్వాల్సి వచ్చింది. లఖిమ్‌పూర్‌ ఖేరీ ఘటనలో కేంద్ర మంత్రి బర్తరఫ్‌ డిమాండ్‌ ఒక్కటీ మిగిలిపోయింది.

నిరసనకారులపై కేసులు ఎత్తివేస్తామని కేంద్రం మొదటే చెప్పినా, 2016 నాటి జాట్‌ రిజర్వేషన్ల ఆందోళనల వేళ ఇలాగే ఇచ్చిన హామీలు నెరవేరలేదని రైతులు అనుమానించారు. అందుకు వారిని తప్పుపట్టలేం. హోమ్‌ మంత్రి గత వారం ఫోన్‌ చేసి మరీ చర్చించాల్సి వచ్చింది. హామీలిచ్చినా, అధికారిక లేఖ కావాలని రైతులు కోరారంటే, పాలకులపై పేరుకున్న అనుమానాలు అర్థమవుతున్నాయి. అయితే, కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే కొత్త చట్టాలని భావిస్తూ వచ్చిన రైతుల అనుమానాలు, కష్టాలు ఇంతటితో తీరేవి కావు. వారి సందేహాలను నివృత్తి చేసి, ఈ దేశంలో రైతే రాజు అనే విశ్వాసం నెలకొల్పాల్సింది పాలకులే. అందుకు ఇకనైనా ఓ సమగ్ర వ్యవసాయ విధానం దిశగా నడవక తప్పదు. ఆ ప్రయాణానికి ప్రేరేపించగలిగితే అన్నదాతల ధర్మాగ్రహ విజయం అపూర్వమవుతుంది.  

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top