పోటాపోటీ పెద్దన్నలు! 

Sakshi Editorial On America And China Relations

ఒకరు అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌... మరొకరు అగ్రస్థానానికి దూసుకువస్తున్న చైనా దేశాధినేత షీ జిన్‌పింగ్‌. ప్రపంచాన్ని శాసించే విషయంలో నువ్వా నేనా అంటూ పోటీపడుతున్న ఈ రెండు దేశాల అధినేతలూ కలసి మాట్లాడుకొంటే, అంతకన్నా పెద్ద వార్త ఏముంటుంది? వీడియో కాన్ఫరెన్స్‌లో అయితేనేం, సోమవారం నాటి ఈ అగ్రజుల భేటీ మీద అందరి దృష్టీ పడింది అందుకే!

కానీ, చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న అమెరికా... తైవాన్‌ అంశంలో అమెరికా వేలు దూర్చాలనుకోవడం నిప్పుతో చెలగాటమని హెచ్చరించిన చైనా... – ఇలాంటివే పతాక శీర్షికలకు ఎక్కాయి. అంటే, మూడున్నర గంటలు సాగిన ఈ భేటీ నిజంగా సాధించినదేమిటని అనుమానం రాక మానదు. రెండు దేశాల మధ్య అనేక విభేదాలున్నాయనీ, పోటీ తప్పదనీ మినహా ఈ చర్చల్లో తేలిన విషయం, చెప్పుకోదగ్గ విజయం ఏమిటన్నది విశ్లేషకులను వేధిస్తున్న ప్రశ్న. ఈ స్థాయి చర్చలు ముగిశాక సాంప్రదాయిక సంయుక్త ప్రకటనైనా వెలువడకపోవడం గమనార్హం. 

ఇద్దరు నేతలూ ఈ ఏడాది రెండుసార్లు ఫోన్లలో మాట్లాడుకున్నా, ఈ వీడియో భేటీ అనేక అంశాలపై లోతైన చర్చకు తావిస్తుందని అందరూ ఆశించారు. కానీ, ‘ఈ భేటీతో మేమేమీ అద్భుతాలు ఆశించలేదు. అదే జరిగింది’ అని తేల్చేశారో అమెరికన్‌ అధికారి. అయితే, నికర విలువ పరంగా, అమెరికాను దాటుకొని, ప్రపంచంలోనే ధనిక దేశంగా నంబర్‌ వన్‌ స్థానానికి చైనా ఎగబాకిందని తాజా మెకిన్సే నివేదిక తేల్చింది. ఆ పురోగతికి తగ్గట్టే, వాషింగ్టన్‌కు సమవుజ్జీ తామేనని బీజింగ్‌ భావిస్తున్నట్టు చర్చల్లో ఆ దేశాధ్యక్షుడి వైఖరి చెప్పకనే చెప్పింది. మానవ హక్కుల గురించి, ఉపఖండంలో దూకుడు గురించి అమెరికా సుద్దులు చెబితే చైనా డూడూ బసవన్నలా తల ఊపే పరిస్థితి కనపడలేదు.

పైపెచ్చు, తాము అంతర్భాగమని భావించే తైవాన్‌ స్వాతంత్య్రంపై జోక్యం చేసుకుంటే తస్మాత్‌ జాగ్రత్త అని చైనా మాటకు మాట అప్పగించింది. ఆత్మవిశ్వాసంతో, నిక్కచ్చిగా మాట్లాడుతున్న చైనా మాటలను అమెరికా సావధానంగా వినక తప్పలేదు. అంతే కాదు... ‘మేము ప్రధాన ప్రపంచ లీడర్‌. అలాగే మీరు కూడా’ అని చైనాతో అమెరికా అంటే అది సహజం. కానీ ఈ భేటీలో బైడెన్, షీని ఉద్దేశించి, ‘మీరు (చైనా) ప్రధాన ప్రపంచ లీడర్‌. అలాగే అమెరికా కూడా’ అంటూ, చైనాకు పెద్ద పీట వేసి మాట్లాడడం మారిన పరిస్థితులకు ప్రత్యక్ష నిదర్శనం. 

చైనా జోరుకు బ్రేకులు పడేలా, భావసారూప్యం ఉన్న ప్రజాస్వామ్య దేశాలతో కలసి ‘క్వాడ్‌’ సహా రకరకాల పేర్లతో జట్టు కట్టడం అమెరికా వ్యూహం. ఈ వ్యూహాన్ని చైనా పరోక్షంగా ప్రస్తావించింది. శిబిరాల ఏర్పాటు వల్ల ప్రపంచానికి మళ్ళీ ప్రచ్ఛన్న యుద్ధం నాటి ఉత్పాతం తప్ప ఒరిగేదేమీ లేదన్న షీ జిన్‌పింగ్‌ వ్యాఖ్య తీవ్రమైనదే. బైడెన్‌ సైతం షింజియాంగ్, టిబెట్, హాంగ్‌కాంగ్‌లలో చైనా అనుసరిస్తున్న విధానాలు, మానవ హక్కుల ఉల్లంఘన వార్తల లాంటి ఘాటైన అంశాలను నిర్మొహమాటంగా షీతో ప్రస్తావించారు.

ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత సముద్రయాన ప్రాధాన్యం గురించి లేవనెత్తారు. అదే సమయంలో పరస్పరం పోటీపడినప్పటికీ, ఘర్షణకు దిగకుండా, పర్యావరణ మార్పు లాంటి ఉమ్మడి ప్రయోజనాలున్న కీలక అంతర్జాతీయ అంశాల్లో కలసి పనిచేయాలంటూ అమెరికా అనడం ఆహ్వానించదగినది. ప్రపంచ శాంతి సౌభాగ్యాల కోసం అంతర్జాతీయ బాధ్యతలలో ఇరుదేశాలూ భుజం కలపాలని చైనా అధినేత సైతం అంగీకరించారు. కానీ, వాస్తవంగా వాటి గురించి ఈ భేటీలో ఎంత చర్చ జరిగిందంటే, మళ్ళీ ప్రశ్నార్థకమే. 

ఇటీవలే ముగిసిన ప్రపంచ పర్యావరణ సదస్సు ‘కాప్‌–26’ సైతం పర్యావరణ పరిరక్షణకు అగ్రరాజ్యాలు చేయాల్సిన త్యాగాలను కుండబద్దలు కొట్టింది. ఆ సదస్సులో ఇరుదేశాల ప్రతినిధులూ ఒప్పందం కుదుర్చుకున్నా, ఇప్పుడీ భేటీలో అంతకు మించిన ఆచరణాత్మక ప్రణాళికను ప్రకటించే చొరవ దేశాధ్యక్షులు తీసుకోలేదు. కానీ పనిలో పనిగా అనేక అంశాల్లో  చైనా తనను తాను సమర్థించుకుంది. భారత్‌తో వాస్తవాధీన రేఖ వెంట, జపాన్‌తో సముద్రజలాలపైన చైనా ప్రదర్శిస్తున్న దూకుడుపై వస్తున్న విమర్శలను తగ్గించే ప్రయత్నం చేసింది.

పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆవిర్భావం నుంచి ఇప్పటి దాకా చైనా తనకు తానుగా ఏ యుద్ధాన్నీ మొదలుపెట్టలేదనీ, ఇతర దేశాల నుంచి అంగుళమైనా ఆక్రమించలేదనీ, దురాక్రమణ – ఆధిపత్యం తమ రక్తంలోనే లేవనీ నాణేనికి ఒక వైపునే చూపెట్టింది. ప్రజాస్వామ్యమనేది ఏకరూప నమూనాలో ఉండదనీ, తమదైన పద్ధతిలో లేవని ఆ ప్రజాస్వామ్యాలను కొట్టిపారేస్తే అది అప్రజాస్వామికమనీ అమెరికాకు పాఠాలూ చెప్పింది. 

ట్రంప్‌ కాలం నుంచి ఇరుదేశాలూ వాణిజ్య, సాంకేతిక పోటీ విషయంలో వాదులాడుకుంటున్నాయి. అలాగని సరఫరా వ్యవస్థల కొరత, ద్రవ్యోల్బణం, ట్యారిఫ్‌లను తగ్గించే అవకాశం లాంటి ఆర్థిక అంశాలేవీ తాజా భేటీలో చర్చించినట్టు లేరు. ఇకపై జరిగే వాణిజ్య చర్చల్లో చైనా పట్ల అమెరికా కొంత మెత్తబడేందుకు ఈ పెద్దల వర్చ్యువల్‌ భేటీ దారులు వేస్తుందని చైనా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, ‘పోటీ ఓకే కానీ, పోరాటం వద్దు.

పర్యవసానంగా సంబంధాలు చెడగొట్టుకోవద్దు’ అన్నదే ఈ పెద్దన్నల మాటల్లో తేలిన విషయం. ఈ మార్చిలో అలాస్కాలో రెండు దేశాల సీనియర్‌ అధికారుల మధ్య రెండు రోజుల పాటు మూడు రౌండ్ల చర్చల వేళ నిందారోపణలు బయటపడితే, ఈసారి స్వరం మారడం కొంత శుభసూచకం. విభేదాలున్నా, అవి విపరీత ఘర్షణకు దారితీయకూడదన్న వివేకం ప్రపంచానికి మంచిదే! ఇటుపై దీన్ని ఎలా ముందుకు తీసుకెళతారో చూడాలి. 
 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top