ట్రంప్‌కు పరీక్షా సమయం

New Problems For Donald Trump Ahead Of President Election - Sakshi

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఇది కష్టకాలం. అధ్యక్ష ఎన్నికలో తన గెలుపును తన్నుకుపోయారంటూ వాషింగ్టన్‌లోని కాపిటల్‌ హిల్‌ భవనంపైకి మద్దతుదార్లను ఉసిగొల్పి విధ్వంసానికి కారకుడయ్యారన్న ఆరోపణలపై అభియోగాలు నమోదు కావొచ్చని అందరూ అనుకుంటున్న సమయంలో వేరే కేసు తలకు చుట్టుకుని ఆయన ఊపిరాడని స్థితిలో పడ్డారు.  తనతో ఉన్న లైంగిక సంబంధాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు శృంగార తార స్టార్మీ డేనియల్స్‌కు ట్రంప్‌ భారీ యెత్తున సొమ్ము ముట్టజెప్పారన్న ఆరోపణకు ఆధారాలున్నాయని మన్‌హటన్‌ గ్రాండ్‌ జ్యూరీ భావించటం అసాధారణ నిర్ణయం. దీని పర్యవసానంగా ట్రంప్‌ను సంకెళ్లు వేసి సాధారణ నేరస్థుడి మాదిరిగా తీసుకెళ్లి ఫొటోలు, వేలిముద్రలు తీసుకుంటారు. అయితే ఆ తర్వాత వెంటనే బెయిల్‌ రావటం పెద్ద కష్టం కాదు. ఈ కేసులో వాస్తవంగా విచారణ యోగ్యమైన నేరారోపణలేమిటన్నది ఇంకా వెల్లడి కావలసివుంది.

అర్ధ శతాబ్దంపాటు ట్రంప్‌ ఓ వెలుగు వెలిగారు. గుట్టు చప్పుడుకాకుండా తప్పుడు ఒప్పందాలు కుదుర్చుకోవటంలో, చట్టానికి దొరక్కుండా తప్పించుకోవటంలో, సమ ర్థుడైన వ్యాపారవేత్తగా వెలిగిపోవటంలో, రాజకీయాల్లో అడ్డగోలుగా మాట్లాడుతూ జనాన్ని ఆకట్టు కుని అధ్యక్ష పదవికి ఎగబాకటంలో ట్రంప్‌కెవరూ సాటిరారు. అధ్యక్ష పదవిలో ఉంటూ కూడా తన బాణీ ఆవగింజంతైనా మార్చకుండా అందర్నీ హడలెత్తించిన మొనగాడు ట్రంప్‌.  అన్ని దేశాల ప్రజానీకంలో ఉన్నట్టే అమెరికాలో కూడా నైతికవర్తన విషయంలో చాలా పట్టింపులుంటాయి. ముఖ్యంగా తమ పాలకుల నుంచి దాన్ని చాలా ఆశిస్తారు. కానీ ట్రంప్‌ చరిత్ర ఆద్యంతం అందుకు విరుద్ధం. నిజానికి ఒక నటీమణిని లోబర్చుకోవటానికి తాను చేసిన ప్రయత్నా లను ఆయన ఒక టీవీ షోలో గొప్పగా చెప్పుకున్నారు కూడా. 2006లో ఒక గోల్ఫ్‌ టోర్నమెంట్‌ కోసం వచ్చి ట్రంప్‌ తనతో గడిపారని స్టార్మీ డేనియల్స్‌ 2016లో అమెరికన్‌ మీడియా ఇంక్లైన్స్‌(ఏఎంఐ) అనే సంస్థకు చెప్పారు.

అధ్యక్ష పదవికి ట్రంప్‌ పోటీపడటం ఖాయమని తేలాక అనేక మంది మహిళలు బయటికొచ్చి ఆయన గతంలో తమను లైంగికంగా ఎలా వేధించిందీ వెల్లడించటం మొదలెట్టారు. అలాంటి మహిళలు ఆ కథనాలు కేవలం తమకు మాత్రమే ఇచ్చేలా అప్పట్లో ఏఎంఐ ఒప్పందాలు కుదుర్చుకుని వారికి డబ్బు ముట్టజెప్పింది. ఆ తర్వాత వాటిని బుట్టదాఖలా చేసింది. ఈ సంస్థ ట్రంప్‌ మాజీ అటార్నీ మైఖేల్‌ డి. కోహెన్‌ చెప్పుచేతల్లో ఉండేది. స్టార్మీ డేనియల్స్‌ వేరే మీడియా సంస్థకు అంతక్రితమే ఇంటర్వ్యూ ఇచ్చినా అది ప్రచురించకుండా కోహెన్‌ బెదిరించ గలిగారు. ఆ విషయంలో మరింత ముందుకు పోకుండా అప్పట్లో రహస్య ఒప్పందం కుదుర్చుకుని డేనియల్స్‌కు 1,30,000 డాలర్లు కోహెన్‌ అందించారు. అది అనైతిక సంబంధాన్ని కప్పెట్టడానికి కాదనీ, తప్పుడు ఆరోపణలు చేసి తన పరువు తీయకుండా ఉండటం కోసమేననీ ట్రంప్‌ 2018లో ఒకసారి చెప్పారు. ఇక్కడ ట్రంప్‌కు ఆమెతో అనైతిక సంబంధం ఉందా లేదా అన్నది కుటుంబపరంగా ఏమైనా కావొచ్చుగానీ... చట్టపరంగా పెద్ద సమస్య కాకపోవచ్చు. ఆ డబ్బును ఏ ఖాతాలో చూపారో, దానికి అనుసరించిన విధానాలేమిటో విచారణ సందర్భంగా బయటికొస్తాయి. తనకు అటార్నీగా వ్యవహరిస్తున్నందుకు కోహెన్‌కు చెల్లించిన ఫీజుగా, అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం చేసిన ఖర్చుగా ట్రంప్‌ చూపారు.

ఈ డబ్బు స్టార్మీకి చెల్లించటం కోసం కోహెన్‌ ఎసెన్షియల్‌ కన్సల్టెంట్స్‌ పేరిట ఒక దొంగ కంపెనీ సృష్టించారు. ఆ తర్వాత ఫీజు రూపంలో ట్రంప్‌ నుంచి స్వీకరించారు. స్వయానా కోహెనే దీన్ని ఒప్పుకున్నారు. ఇది అమలులో ఉన్న ఆర్థిక చట్టాలను ఉల్లంఘించటం. ఆ విధంగా ఆర్థిక నేరం. అయితే కోహెన్‌ ఆ మొత్తాన్ని ఏం చేశారో తనకు తెలియదనీ, తన న్యాయవాదిగా ఆయన చెప్పిందల్లా చేశాను తప్ప అందులోని తప్పొప్పులతో సంబంధం లేదనీ ట్రంప్‌ అనొచ్చు. అసలు ఇదంత పెద్ద నేరమేమీ కాదని వాదిస్తున్నవారు లేకపోలేదు. అది నిజం కావొచ్చు కూడా. ఆర్థిక నేరాన్నీ, అనైతికతనూ కలగాపులగం చేసి నిర్మించే కేసు ధర్మాసనం ముందు వీగిపోయినా పోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇంతవరకూ అమెరికా చరిత్రలో ఎప్పుడూ న్యాయ స్థానాల ముందుకురాని ఈ మాదిరి కేసు అంతిమంగా ట్రంప్‌పై సానుభూతిని పెంచినాపెంచొచ్చనీ, పర్యవసానంగా కాపిటల్‌ హిల్‌ భవనంపై దాడి, విధ్వంసం, కుట్ర, రహస్యపత్రాలు దగ్గరుంచుకోవటం వంటి బలమైన కేసుల విషయంలో జనంలో నిర్లిప్తత ఏర్పడే ప్రమాదం ఉన్నదనీ వారంటున్నారు. 

తాజా కేసు ట్రంప్‌కు రాజకీయంగా నష్టమో లాభమో వెంటనే చెప్పటం అంత సులభం కాదు. అభియోగాల నిర్ధారణ తర్వాత రిపబ్లికన్‌ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో పోటీపడే నేతలతో సహా అందరూ ఏకమయ్యారు. అలా చూస్తే ట్రంప్‌కు ఈ పరిణామం మేలు చేసేదే. నైతికతను దిగజార్చుకుని, దాన్ని కప్పిపుచ్చడానికి ఆర్థిక నేరాలకు పాల్పడి దేశాధ్యక్షుడైన వ్యక్తివల్ల అమెరికన్‌ సమాజానికీ, పాలనా వ్యవస్థకూ నష్టం కలుగుతుందని ప్రాసిక్యూటర్లు వాదిస్తారు. దాన్ని ఏ మేరకు ధర్మాసనం అంగీకరిస్తుందో చూడాలి. ఒకవేళ శిక్షించినా 1974లో వాటర్‌గేట్‌ కుంభకోణం దోషి నిక్సన్‌కు ఆయన వారసుడిగా వచ్చిన గెరాల్డ్‌ ఫోర్డ్‌ క్షమాభిక్ష పెట్టారు. రిపబ్లికన్ల ఏలుబడి వస్తే ట్రంప్‌ విషయంలో కూడా అదే జరగొచ్చు. ఏదేమైనా నాలుగేళ్లు దేశాధ్యక్షుడిగా ఉండి, మరోసారి అందుకోసం పోటీపడుతున్న నాయకుడిని శిక్షించడానికి అమెరికన్‌ న్యాయవ్యవస్థ ఏ మేరకు సిద్ధపడుతుందన్నది ఈ కేసుతో తేలిపోతుంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top