ఆగమించిన ‘బాహుబలి’

5 Rafales jet fighters Landed In Ambala - Sakshi

రణరంగంలో శత్రువుతో హోరాహోరీ తలపడే వేళ మన వైమానిక దళానికి సమర్థవంతంగా తోడ్పడగలదని భావిస్తున్న రఫేల్‌ యుద్ధ విమానాలు బుధవారం మన గడ్డపై వాలాయి. అయిదేళ్లక్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించినప్పుడు రూ. 59,000 కోట్లు వ్యయం కాగల 36 రఫేల్‌ యుద్ధ విమానాలు అందించడానికి ఆ ప్రభుత్వంతో అవగాహన కుదిరింది. అనంతరం 2016 సెప్టెంబర్‌లో ఒప్పందంపై సంతకాలయ్యాయి. అధినేతలమధ్య అవగాహన కుది రినప్పుడు రెండేళ్లలో... అంటే 2017లో ఈ యుద్ధ విమానాలను మన దేశానికి అందిస్తామని ఫ్రాన్స్‌ హామీ ఇచ్చింది. అయితే ఒప్పందం ఖరారులో జరిగిన జాప్యం వల్ల మరో మూడేళ్ల సమయం తీసుకుని తొలి విడతగా అయిదు విమానాలను మనకు అందజేశారు. ఈ యుద్ధ విమానాలు హరి యాణాలోని అంబాలా వైమానిక దళ స్థావరానికి చేరుకుంటున్న తరుణంలో బుధవారం దేశం హర్షాతిరేకాలతో హోరెత్తింది. దాదాపు అన్ని వార్తా చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లో రఫేల్‌ యుద్ధ విమానాలదే హడావుడంతా. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద చైనాతో మనకున్న వివాదం నేపథ్యం ఇందుకు కారణం కావొచ్చు. ఈ విమానాలను ఎల్‌ఏసీకి సమీపాన వున్న లదాఖ్‌కు తరలించ బోతున్నట్టు చెబుతున్నారు.

రక్షణ బలగాలకు సమర్థవంతంగా సేవలందించగల మెరికల్లాంటి యుద్ధ విమానాల కోసం మన దేశం జరుపుతున్న అన్వేషణ ఈనాటిది కాదు. చుట్టూ చైనా కుంపట్లు రాజేస్తున్నదని, పాకిస్తాన్‌ ఎప్పటిమాదిరే కయ్యానికి కాలుదువ్వుతున్నదని... ఈ పరిణామాలన్నీ మన రక్షణ సంసిద్ధత పెరగ వలసిన అవసరాన్ని సూచిస్తున్నాయని వైమానిక దళం 2000 సంవత్సరం నుంచే చెబుతూ వస్తోంది. చివరకు 4.5 జనరేషన్‌ బహుళ విధ యుద్ధ విమానాలు అత్యవసరమని 2004లో తుది నిర్ణయాని కొచ్చారు. ఒకప్పుడు పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో రక్షణ దళాలకు విజయాలు సాధించిపెట్టిన మిగ్‌–21 బైసన్, జాగ్వార్‌ విమానాల వయసు మీరిందని, అవి తరచు ప్రమాదాల్లో చిక్కుకుంటున్నా యని వైమానిక దళం తెలిపింది. ఉన్నపాటుగా యుద్ధం వస్తే రణరంగంలోకి ఉరకడానికి అనువైన సాధనా సంపత్తి మన దగ్గరలేదన్న సంగతిని గుర్తు చేసింది. అయితే అదేం ప్రారబ్ధమోగానీ ఒకసారి యుద్ధ విమానాలో, మరొకటో కొనాలని నిర్ణయం జరిగాక టెండర్లు పిలవడం మొదలుకొని ఎంపిక చేయడం వరకూ అన్నీ నత్తనడక నడుస్తాయి. ఎంపిక పూర్తయ్యాక వరస ఆరోపణలు వెల్లువెత్తు తాయి. వేరే రకం ఇంతకన్నా మెరుగైనవే అయినా నాసిరకంతో సరిపెడుతున్నారని, ముడుపులు చేతులు మారడమే ఇందుకు కారణమని కథనాలు వస్తాయి. 

రఫేల్‌ యుద్ధ విమానాల ఎంపిక సమయంలోనూ అలాంటి సమస్యలు తప్పలేదు. దీన్ని ఎంపిక చేయడానికి ముందు అమెరికా తయారీ ఎఫ్‌/ఏ–18, ఎఫ్‌–16, రష్యా మిగ్‌–35, స్వీడన్‌ తయారీ గ్రిపెన్‌ తదితర విమానాల సామర్థ్యాన్ని పరీక్షించారు. మన అవసరాలకు అనుగుణంగా లేవన్న కారణంతో తిరస్కరించారు. చివరకు రఫేల్‌ తోపాటు బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ దేశాల కన్షార్షియం ఉత్పత్తి చేసే టైఫూన్లు మిగిలాయి. ఈ రెండింటిలో రఫేల్‌ అన్నివిధాలా మెరుగైనదని తేల్చారు. ఇంతలోనే బ్రిటన్, స్విట్జర్లాండ్, సింగపూర్, సౌదీ అరేబియా వంటి దేశాలు తిరస్కరించిన రఫేల్‌ ఎలా నచ్చిందన్న ప్రశ్నలు తలెత్తాయి. ఇదంతా 2012నాటి మాట. అప్పట్లో ఈ విమానాలను డసాల్ట్‌ కంపెనీ ఉత్పత్తి చేసేది. మన దేశానికి ఒప్పందం కుదిరింది కూడా దానితోనే. కానీ సాంకేతిక పరిజ్ఞానం బదిలీ విషయంలో పేచీ పెట్ట డంతో అది కాస్తా మూలనబడింది. రూ. 54,000 కోట్ల వ్యయం కాగల ఆ ఒప్పందం ప్రకారం డసాల్ట్‌ సంస్థ 126 రఫేల్‌ యుద్ధ విమానాలను సమకూర్చాలి. మూడేళ్లలో 18 విమానాలు అందజేయడంతో పాటు మిగిలిన 108 యుద్ధ విమానాలనూ హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)లో ఉత్పత్తి చేసేందుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తానని చెప్పింది. ఏమైతేనేం పాత ఒప్పందం స్థానంలో కొత్త ఒప్పందం ఖరారయింది.

మొత్తానికి మన బలగాలు కోరుకుంటున్న రఫేల్‌ విమానాలు ముంగిట్లోకి వచ్చాయి. అయితే వీటిని ఖరారు చేసేనాటికి చైనాతో మనకు ఈ స్థాయి వివాదం లేదు. మన చుట్టూ వున్న దేశాల్లో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న వైనంపై మన రక్షణ రంగ నిపుణులకు అవగాహన వున్నా, ప్రధానంగా పాకిస్తాన్‌ను దృష్టిలో వుంచుకునే 36 యుద్ధ విమానాలు సరిపోతాయని అంచనా వేశారు. కానీ మారిన పరిస్థితుల్లో పాక్‌తో వున్న అధీన రేఖ(ఎల్‌ఓసీ)తోపాటు చైనాను ఢీకొనడానికి ఎల్‌ఏసీ వద్ద కూడా మోహరించడం తప్పనిసరన్నది నిపుణుల భావన. మన వైమానిక దళానికి మంజూరైన స్క్వాడ్రన్‌లు  42 కాగా వాటిని 50కి పెంచాలన్న డిమాండు వుంది. కానీ మనకున్నవి ప్రస్తుతం 30 మాత్రమే. ఒక్కో స్వాడ్రన్‌ పరిధిలో 18 యుద్ధ విమానాలు ఉంటాయి. అంటే 2022 నాటికి రాఫెల్‌ యుద్ధ విమానాలన్నీ మన దగ్గరకొస్తే రెండు స్క్వాడ్రన్‌లు సంసిద్ధంగా వున్నట్టవుతుంది. ప్రభుత్వం చాలా చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటే తప్ప మంజూరైన 42 స్క్వాడ్రన్‌ లకూ అవసరమైన యుద్ధ విమానాలు సమకూరవు. ఇప్పటికే సుఖోయ్‌–30 ఎంకేఐ, మిగ్‌–29 యుద్ధ విమానాలు 33 కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. అలాగే హెచ్‌ఏఎల్‌ రూపొందించిన తేజస్‌ మార్క్‌1 తేలికపాటి యుద్ధ విమానాలు, తేజస్‌ మార్క్‌2 యుద్ధ విమానాలు, అధునాతన మధ్యశ్రేణి యుద్ధ విమానాలు(ఏఎంఏసీ) వరసగా అందబోతున్నాయి. ఇవన్నీ పూర్తిగా అందేలోగానే ఇప్పటికేవున్న సుఖోయ్‌–30, మిరేజ్‌–2000, మిగ్‌–29లను ఆధునీకరించడం అత్యవసరం. యుద్ధం అవసరం లేని, ఘర్షణలకు తావులేని ప్రపంచం కోసం కృషి చేయడం ముఖ్యమే. అయితే మనం బలమైన స్థితిలో వుంటేనే ఆ ప్రయత్నాలు సత్ఫలితాలిస్తాయి. ఆ కోణంలో రఫేల్‌ రాకను స్వాగతించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top