రాజమహేంద్రవరం సిటీ: నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు ఎన్నికల నిబంధనలు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు అదనపు ఎన్నికల అధికారి, కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. ఈ మేరకు గురువారం గోకవరం, కడియం, గోపాలపురం, అనపర్తి, చాగల్లు, దేవరపల్లి, బిక్కవోలు మండలాల నుంచి కేటాయించిన పీఓ, ఏపీఓలకు వీటీ కళాశాలలో నిర్వహించిన శిక్షణను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాలెట్ బాక్సుల సీలింగ్, ఎన్నికల పత్రాల నిర్వహణ, పీఓ డైరీ నమోదుపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్ సామగ్రి పంపిణీ నుంచి పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను రిసెప్షన్ కేంద్రంలో అప్పగించే వరకు ప్రతి దశలోనూ జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎన్నికల విధులపై ఏవైనా సందేహాలు ఉంటే శిక్షణ సమయంలోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం హాజరు పట్టీని పరిశీలించారు. ఎన్నికల విధులకు నియమితులై శిక్షణకు హాజరు కాని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఫ రాజమహేంద్రవరంలో ప్రతిపాదిత రోడ్డు విస్తరణ, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కమిషనర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులతో రోడ్డు విస్తరణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు.
ఫ అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని కమిషనర్ స్పష్టం చేశారు. జేఎన్ రోడ్డులో రూ.12 లక్షలతో నిర్మించిన సీసీ డ్రెయిన్, కల్వర్టు పనుల నాణ్యతను పరిశీలించారు. లలితా నగర్, కృష్ణా నగర్‌లలో స్ట్రోం వాటర్ డ్రెయిన్ పనులను పరిశీలించి డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు.
ఫ కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా
ఫ పీఓ, ఏపీఓలకు శిక్షణ


