సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని (డిసెంబరు 3) పురస్కరించుకుని ఈ నెల 23న రాజమహేంద్రవరంలో జిల్లా స్థాయి పారా క్రీడా ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్‌తో కలిసి ఆమె ఆవిష్కరించారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి డీఎంఎం శేషగిరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్), కలెక్టర్ ఆదేశాల మేరకు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 13 ఏళ్లు పైబడిన దివ్యాంగ బాల బాలికలకు పారా అథ్లెటిక్స్, పారా బ్యాడ్మింటన్ (సింగిల్స్), పారా టేబుల్ టెన్నిస్ (సింగిల్స్), పారా తైక్వాండో, వీల్ చైర్ ఫెన్సింగ్, బ్లైండ్ గోల్‌బాల్ విభాగాల్లో ఎంపిక పోటీలు నిర్వహిస్తామని, ఆ రోజు ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో పోటీలు ప్రారంభమవుతాయన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను డిసెంబర్ 1, 2 తేదీల్లో విజయనగరంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పారా క్రీడా పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో యోగా కోచ్ బీవీజీ నాగేంద్ర, పారా టెక్నికల్ అధికారులు ఏ.మల్లేశ్వరరావు, డి.జ్యోతికుమార్ తదితరులు పాల్గొన్నారు.


