కడియం: నామినేషన్ల పరిశీలనలో భాగంగా తాము ఇచ్చిన ఫిర్యాదును ఆర్వో పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామి నాయుడు అన్నారు. ఈ మేరకు గురువారం కడియం పంచాయతీ కార్యాలయం వద్ద ఆర్వో ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న కడియం ఎస్సై నాగ దుర్గాప్రసాద్ అక్కడకు చేరుకుని ఆయనతో చర్చించారు. అనంతరం వెంకటస్వామి నాయుడు విలేకరులతో మాట్లాడుతూ కడియం 1వ వార్డు సభ్యుడిగా నామినేషన్ వేసిన వ్యక్తికి కడియం, వేమగిరిలో రెండు చోట్లా ఓట్లు ఉన్నాయని బుధవారం పరిశీలన సందర్భంగా ఆర్వోకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే ఫిర్యాదు రేపు ఇవ్వాలని ఆయన సూచించడంతో తిరిగి గురువారం ఫిర్యాదు చేసేందుకు వస్తే తాను ఫిర్యాదును తీసుకోనని చెబుతున్నారన్నారు. కూటమి అభ్యర్థులకు అనుకూలంగా ఆర్వోలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జేగురుపాడులో సైతం ఇలాగే ఇబ్బందులు పెడుతున్నారన్నారు. దాదాపు రెండు గంటల పాటు నిరసన తెలిపిన ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ కూటమి పార్టీల నాయకులు దుళ్ల గ్రామంలో ఇళ్ల ఎదురుగా యంత్రాలతో గోతులు తవ్వేసి, తమకు ఓట్లు వేస్తేనే డ్రైనేజీలు నిర్మిస్తామంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.
ఫ కూటమికి అనుకూలంగా
ఆర్వో వ్యవహారం
ఫ మాజీ ఎంపీ వెంకటస్వామి
నాయుడి నిరసన


