తాగునీటి కోసం వెలుగుబంద కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే భారీ నీటి ట్యాంకులు నిర్మించి, పైపులైన్లు ఏర్పాటు చేసినా వాటిని రెండేళ్లుగా సక్రమంగా నిర్వహించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇళ్ల నిర్మాణాల కోసం సామగ్రిని తరలించే భారీ వాహనాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పైపులైన్లు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల ట్యాంకులకు సంబంధించిన మోటార్లు సరిగ్గా పనిచేయడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించి శాశ్వతంగా నీటి సరఫరా చేయాల్సిన అధికారులు ట్యాంకర్లతో నీటిని పంపిణీ చేసి చేతులు దులుపుకొంటున్నారన్న విమర్శలున్నాయి. అదీ రెండు, మూడు రోజులకోసారి మాత్రమే సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని, కూలి పనులకు వెళ్లే కుటుంబాలు ఇంటి వద్ద అందుబాటులో లేకపోతే ఆ రోజు నీరు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


