ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామికి రాజమహేంద్రవరానికి చెందిన వనిమిశెట్టి శ్రీరామకృష్ణ, వెంకట సుబ్బారావు, అనంతలక్ష్మి, సత్యవతి, కుటుంబ సభ్యులు గురువారం రూ.1,66,800 విలువైన స్వర్ణమయ తామ్ర కవచాలను సమర్పించారు. వీరి నుంచి ఆలయ అర్చక కమిటీ సభ్యులు వాడపల్లి వెంకట శేషావతారం, శిష్టా సూర్య కుటుంబరావు, ఆలయ సిబ్బంది వెంకటరాజు ఆభరణాలను స్వీకరించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం దాతలకు ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీసులు, తీర్థ ప్రసాదాలు అందించారు.
సెంట్రల్ జైలులో మత
ప్రచారంపై విచారణ కమిటీ
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం మహిళా కేంద్ర కారాగారంలో మత ప్రచారం జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ వివరాలను జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ గురువారం తెలిపారు. మహిళా జైలులోని అధికారి ఖైదీలకు మత ప్రచారం చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై నిజనిర్దారణ చేసేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేసి కడప మహిళా కేంద్రకారాగారం సూపరింటెండెంట్ కృష్ణవేణిని విచారణ అధికారిగా నియమించారు. మహిళా కేంద్రకారాగారంలో మతప్రచారం ఏమీ జరగలేదని, ఒక ఉన్నతాధికారి కావాలనే ఆరోపణలు చేశారని తెలుస్తోంది.
ర్యాగింగ్ ఘటనలో సెక్యూరిటీ అధికారి తొలగింపు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం మెడికల్ కళాశాలలో జరిగిన ర్యాగింగ్ సంఘటనపై అధికారులు స్పందించారు. ఆ వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంఎస్ రాజు గురువారం సాక్షి పత్రికకు తెలిపారు. జరిగిన సంఘటనపై విచారించి హాస్టల్ సెక్యూరిటీ అధికారిని తొలగించారు. అలాగే ర్యాగింగ్ వల్ల జరిగే నష్టాలను వివరించేందుకు కళాశాలలో పోలీసుల నేతృత్వంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. జూనియర్ వైద్య విద్యార్థులతో పోలీసులు మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. ఎటువంటి అవసరమైనా వెంటనే తమకు తెలపాలన్నారు. హాస్టళ్ల వద్ద ఎటువంటి ర్యాగింగ్ జరగకుండా పూర్తిగా చర్యలు చేపట్టారు. దీనిపై పూర్తి విచారణ జరిగిన తర్వాత విషయాలు వెల్లడిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.


