లో
తాళ్లపూడి మండలం పోచవరంలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం
సాక్షి, రాజమహేంద్రవరం: ఒక తుపాను దెబ్బ నుంచి తేరుకోకముందే మరొకటి విరుచుకుపడడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అర్నబ్, మురసు తుపాన్లు రైతుల ఆశలను చిదిమేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగాళాఖాతంలో ఆక్వాన్ తుపాను పొంచి ఉందన్న సమాచారం గుబులు పుట్టిస్తోంది. రెండు తుపాన్లకు దెబ్బతినగా మిగిలిన పంటను కోయాలా, వర్షాలు తగ్గేవరకు వేచి చూడాలా, ఇప్పటికే కోసిన ధాన్యాన్ని ఎక్కడ భద్రపరచాలి అన్న ప్రశ్నలకు సమాధానం దొరక్క సతమతమవుతున్నారు.
62 వేల హెక్టార్లలో నష్టం
ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో సుమారు 92 వేల హెక్టార్లలో రైతులు వరి సాగు చేపట్టారు. అనేక ఇబ్బందులను ఎదుర్కొని సాగు చేశారు. పంట కోతకు సిద్ధమవుతున్న సమయంలో అర్నబ్ తుపాను విరుచుకుపడి సుమారు 52 వేల హెక్టార్లలో పంటను ముంచేసింది. మరో నాలుగు రోజుల వ్యవధిలోనే మురసు తుపాను దెబ్బ తీసింది. అప్పటికే నీటిలో నానుతున్న చేలపై మళ్లీ వర్షాలు కురవడంతో నష్టం మరింత పెరిగింది. తద్వారా సుమారు మరో పది వేల హెక్టార్లకు పైగా పంట ప్రభావితమైనట్లు అంచనా. రెండు తుపాన్లతో కలిపి మొత్తం 62 వేల హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిగిలిన పంట కోతలకూ భయమే...
రెండు తుపాన్ల ప్రభావం నుంచి తప్పించుకున్న సుమారు 30 వేల హెక్టార్లలోని పంటపైనే ఇప్పుడు రైతులు ఆశలు పెట్టుకున్నారు. కనీసం ఈ పంటనైనా సురక్షితంగా ఇంటికి చేర్చుకుంటే కొంతవరకై నా పెట్టుబడులు తిరిగి వస్తాయని భావిస్తున్నారు. అయితే మిగిలిన పంటలో కొంత కోతకు సిద్ధంగా ఉండటం రైతులకు మరో సమస్యగా మారింది. ఇప్పుడే కోతలు కోస్తే ఆక్వాన్ తుపాను ప్రభావంతో కురిసే భారీ వర్షాలకు ధాన్యం తడిసిపోతాయేమోనన్న భయం, కోతలు వాయిదా వేస్తే ఈదురు గాలులకు పైరు నేలకొరుగుతుందేమోనన్న ఆందోళనతో ఏమీ తేల్చుకోలేక రైతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
రైతుల్లో గుబులు
ఇప్పటికే వరి కోతలు పూర్తి చేసిన రైతుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. కొవ్వూరు, తాళ్లపూడి, సీతానగరం, అనపర్తి వంటి ప్రాంతాల్లో నూర్పిడి చేసిన ధాన్యాన్ని కళ్లాల్లో, పొలాల పక్కన, రహదారుల వెంట ఆరబోసుకున్నారు. ధాన్యంలో తేమ తగ్గితే కొనుగోలు కేంద్రాలకు తరలించవచ్చని ఎదురుచూస్తున్నారు. కానీ ఆక్వాన్ తుపాను ప్రభావంతో వాతావరణంలో మార్పులు, వర్షాల ముప్పుతో ధాన్యాన్ని కాపాడుకోవడం కష్టంగా మారింది. ఆకాశం మేఘావృతమైతే చాలు రైతుల్లో ఆందోళన మొదలవుతోంది.
వరుస తుపాన్లతో నీటిలో నానిపోయి రంగుమారిన ధాన్యం
సీతానగరం మండలం మునికూడలిలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం
వంగలపూడిలో కోతకు సిద్ధంగా ఉన్న వరిచేను
8
కొనుగోలులో జాప్యం
ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం మరింత ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదని రైతుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. దాదాపు 90 శాతం కొనుగోలు కేంద్రాలు పనిచేయడం లేదని ఆరోపిస్తున్నారు. కొనుగోళ్లు సకాలంలో జరగకపోవడంతో మిల్లర్లు, దళారులను రైతులు ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తుపాన్ల ప్రభావంతో రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తారా, తేమ శాతం పేరుతో ధర తగ్గిస్తారా, కనీస మద్దతు ధర అందుతుందా అన్న అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. మరోవైపు గోనె సంచుల కొరత, ధాన్యం రవాణా సమస్యలు, తేమ శాతం నిబంధనల అమలుపై చంద్రబాబు ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఆక్వాన్ బుధవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తరాంధ్ర, యానాం, దక్షిణ ఒడిశా తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని, గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో రైతులు మరింతగా వణికిపోతున్నారు.


