సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల ముసాయిదా జాబితాను డిసెంబర్ 23న ప్రచురించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ, అందిన దరఖాస్తుల పరిశీలన, ఓటర్ల జాబితా ప్రచురణకు సంబంధించి నిర్ణీత గడువులోగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు అందిన 3,270 దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాబితాకు సంబంధించి డిసెంబర్ 23 నుంచి జనవరి 12, 2027 వరకు కొత్త దరఖాస్తులు, క్లెయిములు, అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు తెలిపారు. జనవరి 27వ తేదీ నాటికి వాటి పరిష్కారం, అనుబంధ జాబితాల ముద్రణ పూర్తి చేసి, ఫిబ్రవరి 2వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు వివరించారు. తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు తదితర మొత్తం 707 విద్యాసంస్థల్లో 5,052 మంది ఉపాధ్యాయులు ఓటరు నమోదుకు అర్హులుగా ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. వీరిలో ఇప్పటివరకు 3,270 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.


