కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ డి.నరసింహ కిశోర్ బుధవారం తెలిపారు. జిల్లాలోని మండల పరిషత్ కార్యాలయాల వద్ద ఎన్నికల నిర్వహణకు ముందస్తు భద్రతా ప్రణాళిక రూపొందించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ఎంపీటీసీ సభ్యులు, ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రత కల్పించాలని పోలీస్ అధికారులను ఆదేశించామన్నారు. ఎన్నికల కేంద్రాల వద్ద అనుమతి లేని వ్యక్తుల ప్రవేశాన్ని నియంత్రించాలని, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించేలా గుంపులుగా చేరడం, వాగ్వాదాలు, ఘర్షణలకు పాల్పడడం వంటి చర్యలను సహించబోమన్నారు. ఎన్నికల కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన చోట్ల మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు.


