ఎన్నికల విధుల్లో మినహాయింపులు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధుల్లో మినహాయింపులు ఇవ్వాలి

Nov 13 2026 12:16 AM | Updated on Nov 13 2026 12:16 AM

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): ఎన్నికల విధుల కేటాయింపులో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం, వయసు, కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని జిల్లా ఏపీజేఏసీ నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం రాజమహేంద్రవరంలో జిల్లా రెవెన్యూ అధికారి భాస్కరరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. 58 ఏళ్లు నిండిన ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని, రాత్రి వేళ ప్రయాణ ఇబ్బందులు లేకుండా సమీప మండలాల్లోనే విధులు కేటాయించాలని, దీర్ఘకాలిక, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు, తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలు చూస్తున్న ఉద్యోగులకు విధుల నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. డీఆర్‌వోను కలిసిన వారిలో ఏపీజేఏసీ చైర్మన్‌ ఎం.మాధవరావు, కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, డీవీ వేణుమాధవరావు, సీహెచ్‌ విజయ్‌ కృష్ణ, ఈవీఎస్‌ఎస్‌ఆర్‌ ప్రసాదరావు ఉన్నారు.

బాలికను వేధిస్తున్న

ఉపాధ్యాయుడి అరెస్ట్‌

కోరుకొండ: బాలికను వేధిస్తున్న ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు కొల్లపు భాగ్యరాజును గురువారం కోరుకొండ పోలీసులు అరెస్ట్‌ చేశా రు. ఎస్సై ఆర్‌.శివాజీ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక బూరుగుపూడిలోని ఓ ప్రైవేటు పాఠశా లలో 6, 7 తరగతులు చదివింది. ఆ సమ యంలో అక్కడ ఉపాధ్యాయుడిగా భాగ్యరాజు పనిచేస్తున్నాడు. అనంతరం ఆ బాలిక వేరే పాఠశాలలకు మారిపోయి ప్రస్తుతం 8వ తరగతి చదువుతోంది. అయితే భాగ్యరాజు ఆ బాలికకు అసభ్యకరమైన వీడియోలు, సందేశాలు పంపడంతో పాటు తనతో మాట్లాడకపోతే కిడ్నాప్‌ చేస్తానని బెదిరిస్తున్నాడు. దీనితో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వాడపల్లి వెంకన్నకు రూ.2.91 కోట్ల ఆదాయం

ఆత్రేయపురం: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి హుండీల ద్వారా 49 రోజులకు రూ.2,91,06,115 ఆదాయం లభించింది. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్యచక్రధరరావు ఈ విషయం తెలిపారు. ఆలయంలోని హుండీల ఆదాయాన్ని జిల్లా దేవదాయ శాఖ అధికారి కె.లక్ష్మీనారాయణశెట్టి, రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్‌టీపీటీ శ్రీనివాస్‌, గ్రూపు దేవాలయాల ఈఓ పీవీవీఎస్‌ కామేశ్వరరావుల గురువారం సమక్షంలో లెక్కించామని వివరించారు. విశ్వేశ్వర స్వామి ఆలయ హుండీలతో కలిపి ప్రధాన హుండీల ద్వారా రూ.2,42,49,560, అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.48,56,555 లభించాయని తెలిపారు. అలాగే, బంగారం 39.500 గ్రాములు, వెండి 1.607 కిలోలు, 16 దేశాలకు చెందిన 136 కరెన్సీ నోట్లు లభించాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

లారీ డ్రైవర్‌ మృతి

దెందులూరు: స్థానిక దెందులూరు శివారులోని గుండేరు వాగు సమీపంలో 16వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం 6 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న పుల్లల లారీని, అదే దిశలో వెనుక నుంచి వచ్చిన మరో పుల్లల లారీ అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక వస్తున్న లారీ డ్రైవర్‌, ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరపడి గ్రామానికి చెందిన దేవరపల్లి వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న దెందులూరు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement